జయహో జనతా

ABN , First Publish Date - 2020-03-23T09:36:59+05:30 IST

రోనా వైరస్‌ విస్తరణను అడ్డుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం కడప జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జనతా కర్ఫ్యూకు...

జయహో జనతా

కడప, ఆంధ్రజ్యోతి మార్చి 22 : కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం కడప జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జనతా కర్ఫ్యూకు జనం జయహో జనతా అంటూ విజయవంతం చేశారు. స్వచ్ఛందంగానే బంద్‌ పాటించారు. వ్యాపార సంస్ధలు మూసేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కిల్లర్‌ కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ, సోషియల్‌ డిస్టెన్స్‌ పాటించారు. కర్ఫ్యూను విజయవంతం చేయాలంటూ ప్రభుత్వ యంత్రాంగం, మీడియా, సోషియల్‌ మీడియా ద్వారా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. ముందస్తుగానే అవసరమైన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు.


జిల్లా కేంద్రం కడప నుంచి మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలు ఇలా అన్ని చోట్ల కర్ఫ్యూ విజయవంతమైంది. ఉదయం 7 గంటల నుంచి జనం ఇళ్ళకే పరిమితం కావడంతో నిత్యం వాహనాల రద్దీతో ఉండే జాతీయ రహదారులు మొదలుకొని ప్రధాన పట్టణాల్లోని ముఖ్యమైన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడే గాని జనసంచారం, వాహనాల రాకపోకలు లేకపోవడంతో అన్ని చోట్ల నిశ్శబ్ధమే రాజ్యమేలింది. ముందస్తుగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేయడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్‌లు బోసిపోయాయి. ముందస్తుగానే సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు, పెట్రోల్‌ బంకులు మూసివేశారు. కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు పోలీసులు తమ వంతు పాత్ర పోషించారు. కడప-రేణిగుంట, కర్నూలు-కడప- చిత్తూరు, ముంబాయి-మైదుకూరు-బద్వేలు క్రిష్ణపట్నం జాతీయ రహదారి, రాష్ట్ర, జిల్లా మండల, కేంద్ర రహదారులన్నీ నిర్మానుష్యంగా కన్పించాయి.కడప నగరంలో బంద్‌ విజయవంతం అయింది.


జనం, వాహనాలతో కిటకిటలాడే ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రధాన వీధుల నుంచి కాలనీల్లోని వీధుల్లో కూడా జనసంచారం లేదు. కూరగాయల మార్కెట్‌, ఏడురోడ్లు, మద్రా్‌సరోడ్డు, రైతు బజారు, వైవీ స్ర్టీట్‌, ఆర్టీసీ బస్టాండ్‌, అప్సరా సర్కిల్‌ ఇలా ఎటూ చూసినా అన్ని సర్కిళ్లు బోసిపోయి కన్పించాయి. ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న కొంతమంది యువకులకు కర్ఫ్యూ ఆవశ్యకతపై పోలీసులు అవగాహన కల్పించి పంపించేశారు. కుటుంబ సభ్యులతో ఇళ్ళకే పరిమితమయ్యారు. కడప రిమ్స్‌లో కరోనా బాధితులు వస్తే ఎలాంటి చికిత్స అందించాలి.


పేషెంట్‌ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గిరిధర్‌, ఆర్‌ఎంవో కొండయ్య వైద్య బృందానికి అవగాహన కల్పించారు. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, బద్వేలు, ప్రొద్దుటూరు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ఎర్రగుంట్లతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు.


చప్పట్లతో కృతజ్ఞతలు

కరోనా వైరస్‌ నివారణలో శ్రమిస్తున్న ఆరోగ్య వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, సైన్యం, అధికార యంత్రాంగం, పాత్రికేయులకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి అపార్ట్‌మెంట్‌లలోని బాల్కనీల్లో, ఇళ్ల బయటకు వచ్చి చప్పట్లు, గంటలు కొట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. కడపలో డిప్యూటీ సీఎం అంజద్‌బాష కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. ఇలా అన్ని చోట్ల జనం కృతజ్ఞతలు తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయులు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డితో పాటు పలువురు జనతా కర్ఫ్యూకు మద్దతుగా ఇళ్లకే పరిమితమై టీవీ వీక్షిస్తూ కుటుంబ సభ్యులతో గడిపారు.

Updated Date - 2020-03-23T09:36:59+05:30 IST