-
-
Home » Andhra Pradesh » Kadapa » kadapa news city became silent
-
నగరం... నిశ్శబ్దం
ABN , First Publish Date - 2020-03-23T09:50:51+05:30 IST
కరోనా కట్టడికి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ (స్వీయ నిర్భంధం) పిలుపుకు జనం ఆదివారం స్వచ్ఛందంగా సంపూర్ణ సంఘీభావం తెలిపారు. వాహనాల రణగొణ...

- స్వీయ నిర్బంధం ఆచరించిన జనం
- రోడ్లు, వాణిజ్య ప్రాంతాలు నిర్మానుష్యం
- జనతా కర్ఫ్యూ వంద శాతం విజయవంతం
- చప్పట్లతో సేవకులకు అభినందనలు
కడప (సిటీ), మార్చి 22: కరోనా కట్టడికి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ (స్వీయ నిర్భంధం) పిలుపుకు జనం ఆదివారం స్వచ్ఛందంగా సంపూర్ణ సంఘీభావం తెలిపారు. వాహనాల రణగొణ ధ్వనులు వినిపించలేదు. ఆటోల అలజడి కానరాలేదు. రోడ్లు, వ్యాపార వాణిజ్య ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే జనం స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో నగరాన్ని నిశ్శబ్దం ఆవహించింది. ప్రధాన దారులే కాదు గల్లీలు సైతం నిర్మానుష్యంగా మారడం విశేషం.
కరోనా ప్రభావంతో ప్రపంచం వణికిపోతోంది. కరోనాపై స్వీయ నిర్బంధం పేరుతో జనం భాగస్వామ్యంతో భారత ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ప్రధాని మోదీ పిలుపుతో జనం వడివడిగా అడుగులు ముందుకేశారు. కడప నగర ప్రజలు ఐక్యశక్తిగా మారి జనతా కర్ఫ్యూను పాటించారు. ఇక్కడ అక్కడ అని కాదు నగరం మొత్తం నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా మారిపోయింది. విపరీత జన సందోహంతో కిటకిటలాడే వైవీ స్ర్టీట్, బీకేఎం వీధి, మార్కెట్లు, రైతు బజారు, పాత బస్టాండ్‌లు జనం లేని ప్రాంతాలుగా మారిపోయాయి. వాహనాలు తిరగక దుకాణాలు తెరుచుకోక జనం రోడ్లపైకి రాక అసలు కడపలో ప్రజలు లేరా అనే విధంగా మారింది.
చప్పట్లతో సేవకులకు అభినందనలు
కరోనా కట్టడిలో ప్రాణాలు తెగించి సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్, పారిశుధ్య కార్మికులకు జనం హర్షఽధ్వానాలు, గంటలు కొడుతూ అభినందనలు తెలిపారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాష తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు చరిచారు. నగరంలో అన్ని చోట్ల పిల్లలు, పెద్దలు మేడలపై నుంచి చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు.
రైలు ప్రయాణంపై కరోనా ఎఫెక్ట్
కడప మీదుగా వెళ్లే అన్ని రైళ్లు రద్దు
కడప (ఎర్రముక్కపల్లె), మార్చి 22: రైలు ప్రయాణాలపై కరోన ఎఫెక్ట్ బలంగా ఉంది. కడప మీదుగా వెళ్లే ప్యాసింజర్ రైళ్లు ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జనతా ఖర్ఫ్యూలో భాగంగా ఆదివారం దేశంలో అన్ని రైళ్లు రద్దు చేశారు. వైర్‌సను నివారించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ నెల 31 వరకు రైళ్ల రద్దును కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే గూడ్సు రైళ్లు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి.
టికెట్ డబ్బులు ఖాతాలో జమ
ఈ నెల 22వ తేది నుంచి 31 వరకు పలు రైళ్లకు రిజర్వేషన్ టికెట్లు క్యాన్సల్ చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. టికెట్‌కు సంబంధించి పూర్తి డబ్బులు సంబంధిత ప్రయాణికుని ఖాతాలో జమ చేయనుంది. అయితే ప్రయాణికులు జూన్ 21వ తేదీలోగా వారి టికెట్లను క్యాన్సలేషన్ చేసుకోవాల్సి ఉంది.
నిర్మానుష్యంగా కడప రైల్వే స్టేషన్
జనతా ఖర్ఫూలో భాగంగా కడప రైల్వే స్టేషన్ ప్రయాణికులు లేక నిర్మానుష్యంగా మారింది. కడప మీదుగా వేళ్లే రైళ్లు రద్దు కావడంతో వెలవెల పోయింది.
రైల్వే సిబ్బంది సంఘీభావం
జనతా ఖర్ఫూలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఆదేశాల మేరకు రైల్వే సిబ్బంది అదివారం సాయంత్రం చప్పట్లు కొడుతూ సంఘీభావం తెలియ జేశారు. ఈ సందర్భంగా కడప రైల్వేస్టేషన్ చీఫ్ కమర్శియల్ ఇన్‌స్పెక్టర్ అమరనాథ్ మాట్లాడుతూ కరోన వైరస్ నివారణకు అహర్నిశలు సేవలందిస్తున్న వైద్యులకు, పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక సిబ్బందికి హృదయ పూర్యకంగా ధన్యవాదాలు తెలియజేయడం ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించాలన్నారు.
కరోనా వైరస్‌పై అప్రమత్తత : ఎస్పీ
కడప (క్రైం), మార్చి 22: కరోనా వైరస్‌పై అప్రమత్తత.. ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 607 మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసు కార్యాలయ సిబ్బంది కూడా ఇంటి నుంచే పనిచేస్తారని, పోలీసు స్టేషన్లు, డీఎస్పీ కార్యాలయాలకు ప్రజలు ఎవరు రాకూడదన్నారు. సమస్య ఉన్నవారు డయల్ 100, లేదా 9121100717కు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తే తక్షణమే పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
నేటి నుంచి రిమ్స్‌లో ఓపీ బంద్
కడప (సెవెన్‌రోడ్స్), మార్చి 22: రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం నుంచి సాధారణ వైద్య సేవలతో పాటు సాధారణ శస్త్ర చికిత్సలను నిలిపి వేస్తున్నట్లు రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు గాను ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సలు మాత్రం అందుబాటులో ఉంటాయన్నారు. కనుక దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.