-
-
Home » Andhra Pradesh » Kadapa » kadapa news
-
మాస్కుతో కరోనా కట్టడి
ABN , First Publish Date - 2020-10-31T07:33:56+05:30 IST
కరోనా కట్టడిలో ప్రధాన ఆయుధం మాస్క్ మాత్రమే అని, ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు తప్పక ధరించాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు.

క్యాండిల్ ర్యాలీలో జేసీ సాయికాంత్ వర్మ
కడప(కలెక్టరేట్), అక్టోబరు 30 : కరోనా కట్టడిలో ప్రధాన ఆయుధం మాస్క్ మాత్రమే అని, ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్కు తప్పక ధరించాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి సంధ్యా సర్కిల్ వరకు ‘మాస్కే కవచం- మాస్కు ప్రతి ఒక్కరూ ధరించాలి’ అనే నినాదంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్-19 అన్‌లాక్ నేపథ్యంలో మరింత అప్రమత్తత అవసరమన్నారు. మాస్కు ధరించకుండా ఎవరూ బయటకు రాకూడదన్నారు. ప్రజారోగ్య బాధ్యత ప్రతిఒక్కరిదని గుర్తు చేశారు.
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బస్సులు, ఆటోల్లో ప్రయాణించే వారికి అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని చెప్పారు. అంతకు ముందు ఆయన కూడా మున్సిపల్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అధికారులతో కలసి ర్యాలీలో పాల్గొన్నారు. సంధ్యా సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి కొవిడ్ నివారణలో భాగంగా తాను మాస్కు ధరించడంతో పాటు ఇతరులు కూడా మాస్కు ధరించేలా చేస్తానంటూ అందరితో జేసీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లవన్న, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.