‘చంద్రబాబుపై కక్షతో పేదలను ఇబ్బంది పెడుతున్నారు’

ABN , First Publish Date - 2020-10-28T08:59:40+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైన కక్షతోనే రాష్ట్రంలోని పేద ప్రజలందరినీ ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు,

‘చంద్రబాబుపై కక్షతో పేదలను ఇబ్బంది పెడుతున్నారు’

రాయచోటి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైన కక్షతోనే రాష్ట్రంలోని పేద ప్రజలందరినీ ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన సుండుపల్లె మార్గంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో అపార్ట్‌మెంట్లను నిర్మించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదన్నారు.


ఇప్పటికైనా మిగిలిన పనులు పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పేపరు ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు. చంద్రబాబును విమర్శిస్తేనే.. స్థానిక ఎమ్మెల్యేకు ప్రమోషన్‌ వస్తోందని ఎద్దేవా చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే అండదండలతో ఇసుక, మట్టి, ఎర్రచందనాన్ని వైసీపీ నాయకులు అక్రమ రవాణా చేస్తున్నారని, డీకేటీ భూములను కబ్జా చేసి.. చుక్కల భూములుగా మార్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మీద పదే పదే అభాండాలు వేసే శ్రీకాంత్‌రెడ్డి తొలుత వరికి, శ్రీవరికి తేడా తెలుసుకోవాలని సూచించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాయచోటికి వచ్చిన ఆయనకు టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు.


ఈ సందర్భంగా బండ్లపెంట దివానేసాహెబ్‌ దర్గాలో, వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గాజుల ఖాదర్‌బాష, మాజీ మండల ఉపాధ్యక్షుడు అనుంపల్లె రాంప్రసాద్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌వలి, టీడీపీ నాయకుడు నాగేంద్ర, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T08:59:40+05:30 IST