ప్రశాంతంగా ముగిసిన దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-10-27T08:17:28+05:30 IST

రెండో మైసూరుగా ఖ్యాతిగాంచిన పసిడిపురిలో దసరా శరన్నతరాత్రి ఉత్సవాలు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసాయి.

ప్రశాంతంగా ముగిసిన దసరా ఉత్సవాలు

 కొవిడ్‌ నిబంధనలకు లోబడి అమ్మవారి తొట్టిమెరవణిప్రొద్దుటూరుక్రైం/టౌన్‌, అక్టోబరు 26: రెండో మైసూరుగా ఖ్యాతిగాంచిన పసిడిపురిలో దసరా శరన్నతరాత్రి ఉత్సవాలు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసాయి. ఉత్సవాలు జరిగిన అమ్మవారిశాల, శివాలయం, రాజరాజేశ్వరీ ఆలయం, చెన్నకేశవస్వామి దేవాలయం తదితర ఆలయాల్లో కొవిడ్‌-19 నిబంధనల మేరకు పరిమితంగా భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. విజయదశమి రోజున సాయంత్రం కొర్రపాడురోడ్డులోని జమ్మిచెట్టు వద్దకు అమ్మవార్లు రాగా, తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. విజయదశమి సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయాల్లో దసరా ఉత్సవ నిర్వాహకులు ఆదివారం అమ్మవారికి శమీ దర్శనం నిర్వహించారు. అమ్మవారిశాలలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయం వద్దనే శమీ దర్శనం చేశారు. ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు.


ఘనంగా తొట్టిమెరవణి

వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో ఆదివారం రాత్రి తొట్టిమెరవణి ఘనంగా నిర్వహించారు. పంచలోహంతో తయారు చేసిన హంసవాహనంపై అమ్మవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. దసరా వేడుకల్లో భాగంగా అమ్మవారిశాలలో ఆర్యవైశ్యులు రంగులు చల్లుకుంటూ వసంతోత్సవం నిర్వహించారు. ఈ నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా టుటౌన్‌ సీఐ నరసింహారెడ్డి, త్రీటౌన్‌ సీఐ గంటా సుబ్బారావు, రూరల్‌ సీఐ విశ్వనాధరెడ్డి, ట్రాఫిక్‌ సీఐ క్రిష్ణయ్యల ఆధ్వర్వంలో ఎస్‌ఐలు శివశంకర్‌, లక్ష్మినారాయణ, యోగేంద్ర, భాస్కర్‌, నారాయణయాదవ్‌, నరసయ్య పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2020-10-27T08:17:28+05:30 IST