అమ్మపై ‘కుట్టు’ భారం..!

ABN , First Publish Date - 2020-10-13T11:33:29+05:30 IST

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం సమదుస్తులు సరఫరా చేస్తోంది. ఆ దుస్తులను మీరే కుట్టించుకోండి.. కుట్టు కూలి అమ్మ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

అమ్మపై ‘కుట్టు’ భారం..!

 జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థికి మూడు జతల దుస్తులు 

 తొలిసారిగా క్లాత్‌ పంపిణీ 

 కుట్టు కూలి ఒక జతకు ప్రభుత్వ ఇచ్చేది రూ.40

 దర్జీ తీసుకునేది రూ.300-450 పైమాటే

 తల్లిదండ్రులపై రూ.25 కోట్లు ఆర్థికభారం



(కడప-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం సమదుస్తులు సరఫరా చేస్తోంది. ఆ దుస్తులను మీరే కుట్టించుకోండి.. కుట్టు కూలి అమ్మ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒక జత యూనిఫాం కుట్టు కూలీ ప్రభుత్వం ఇస్తున్నది ఎంతో తెలుసా..? అక్షరాల నలభై రూపాయలు. మూడు జతలకు రూ.120. రూ.40కు జత యూనిఫాం ఏ దర్జీ అయినా కుడతాడా..? ఎవరినడిగినా అసాధ్యమే అంటారు. సగటున జత కుట్టు కూలి రూ.350 పైమాటే. మూడు జతలకు రూ.1,050 అవుతుంది.


ప్రభుత్వం ఇచ్చేది రూ.120. అదనంగా రూ.930లకు పైగా భారం తప్పడం లేదు. జగనన్న విద్యా దీవెన కింద ఇచ్చే యూనిఫాం కుట్టు రూపంలో తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారం రూ.25 కోట్లకుపైగాగానే. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.


జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల పాఠశాలలు, ఎయిడెడ్‌ విద్యా సంస్థలలో 2,63,717 మంది పేద విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వారిలో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే బాలురు 62,746, బాలికలు 66,835 కలిపి 1,29,581 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరు నుంచి పదో తరగతి చదివే బాలురు 61,895, బాలికలు 72,241 కలిపి 1,34,136 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ లెక్కన 7,91,515 జతలు పంపిణీ చేసింది.


విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా సమగ్ర శిక్ష పథకం కింద విద్యార్థులకు సమ దుస్తుల పంపిణీ కోసం ఒక్కో విద్యార్ఝికి రూ.600 ఇస్తున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం వాటాగా 65 శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 35 శాతం నిధులు చెల్లిస్తుంది. 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం నిధులు సమకూరుస్తుంది. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా ఆప్కో ద్వారా ఈ దుస్తులను సరఫరా చేస్తున్నారు. 


లోపాలకు చెక్‌ పెట్టాలని...

గత కొన్నేళ్లుగా ప్రభుత్వమే ఏజెన్సీల ద్వారా సమ దుస్తులు కుట్టించి అయా పాఠశాలలకు సరఫరా చేసేది. ఆప్కో సంస్థ నుంచి నేరుగా వస్ర్తాన్ని ప్రభుత్వం గుర్తించిన కుట్టు ఏజెన్సీలకు సరఫరా చేసేది. కుట్టిన సమదుస్తులను పాఠశాలలకు సరఫరా చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పలు లోపాలు వెలుగు చూశాయి. విద్యార్థులకు సరిపడా సైజులో కుట్టడం లేదని..


కొందరు విద్యార్థులకు వేసుకోవడానికే సరిపోని దుస్తులు పంపిణీ చేశారనే ఆరోపణలు లేకపోలేదు. అంతేకాదు.. కట్టు ఏజెన్సీలు కూడా క్లాత్‌ మిగిలించుకోవాలనే స్వార్థంతో పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి చెక్‌ పెడుతూ వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన కింద దుస్తులకు బదులుగా మూడు జతలకు సరిపడ్డ క్లాత్‌ పంపిణీ చేసింది. ఇంతవరకు భాగానే ఉన్నా.. కుట్టు కూలి ఒక జతకు కేవలం రూ.40లు నిర్ణయించడంతో తల్లిదండ్రులపై అదనపు భారం తప్పడం లేదని అవేదన వ్యక్తం చేస్తన్నారు. 

 

అమ్మపై ఆర్థిక భారం

ప్రభుత్వం ఒక జత కుట్టు కూలీ రూ.40 చొప్పున మూడు జతలకు రూ.120 అమ్మ ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక జత దుస్తులు రూ.40కు దర్జీ కుడతాడా..? ఎవరిని అడిగినా అది అసాధ్యమేనని అంటున్నారు. కడప నగరం, పులివెందుల, రాజంపేట, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు పట్టణాలతో పాటు ఆయా గ్రామాల్లో దర్జీ (టైలర్‌)లను విచారిస్తే రూ.40లకు ఏమి వస్తుంది..? 1-5 తరగతి చదివే విద్యార్థుల యూనిఫాం రూ.250-300, 6-7 తరగతి చదివే విద్యార్థులకు రూ.300-400, 8, 9, 10 తరగతి విద్యార్థులకు రూ.500 కుట్టు కూలీ కింద తీసుకుంటామని వివరించారు.


సగటున రూ.350 ప్రకారం లెక్కిస్తే మూడు జతలకు రూ.1050 అవుతుంది. ప్రభుత్వం ఇస్తున్నది కేవలం రూ.120 మాత్రమే. సరాసరి రూ.930 తల్లిదండ్రులు అదనంగా  భరించాల్సి వస్తోంది. ఈ లెక్కన జిల్లాలో 2,63,717 మంది విద్యార్థులకు రూ.950 ప్రకారం రూ.25 కోట్లు తల్లిదండ్రులపై అదనపు భారం తప్పడం లేదు. రూ.950 మా వద్ద ఉంటే 2-3 జతలు రెడిమేడ్‌ దుస్తులు వస్తాయని, అంత డబ్బులు మా వద్ద లేవని ప్రభుత్వమే కుట్టించి ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.కరోనా కాలంలో చేయడానికి పనులు లేక బతకడమే భారంగా మారింది.. ఈ పరిస్థితుల్లో కుట్టు కూలి రూపంలో అదనపు భారం మోపడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ప్రభుత్వం నిర్ణయించిన ధర జతకు రూ.40 ..ప్రభాకర్‌రెడ్డి, అడిషనల్‌ కో-ఆర్డినేటర్‌, సమగ్ర శిక్ష, కడప

 జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల పాఠశాలలు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2,63,717 మంది బాల బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కింద ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి మూడు జతలకు సరిపడా వస్త్రాన్ని పంపిణీ చేసింది. ఒక జత కుట్టు కూలీ రూ.40 ప్రభుత్వం నిర్ణయించింది. మూడు జతలకు రూ.120 తల్లి ఖాతాలో జమ చేస్తారు.

Updated Date - 2020-10-13T11:33:29+05:30 IST