విద్యుదాఘాతంతో..
ABN , First Publish Date - 2020-10-04T05:46:32+05:30 IST
పని ముగించుకుని ఇంటికి వెళ్లాల్సిన సమయంలో ఒక ఫ్లెక్సీ బోర్డును పైకి లాగే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కేశిగాళ్ల కొండయ్య (50), జమాల్‌బాష (44) అనే ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృత్యుఒడి చేరారు.
ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతి
ఆ రెండు కుటుంబాల్లో విషాదం
ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 3 : పని ముగించుకుని ఇంటికి వెళ్లాల్సిన సమయంలో ఒక ఫ్లెక్సీ బోర్డును పైకి లాగే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కేశిగాళ్ల కొండయ్య (50), జమాల్‌బాష (44) అనే ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృత్యుఒడి చేరారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ఆ ఇద్దరి మృతితో ఆ రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన శనివారం సాయంత్రం స్థానిక గాంధీరోడ్డులో జరిగింది. బాధితులు, పోలీసుల వివరాల మేరకు... పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉండే కేశిగాళ్ల కొండయ్య బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడి వద్ద స్థానిక యానాది కాలనీకి చెందిన జమాల్‌బాష కూలీగా పనికి వస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా గత మూడు రోజులుగా ఈ ఇద్దరు గాంధీరోడ్డులో ఇంటి మరమ్మతు పనులు చేస్తున్నారు.
రోజు మాదిరిగానే శనివారం కొండయ్య, జమాల్‌బాషలు అక్కడికి పనికి వచ్చారు. సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్లాల్సిన సమయంలో ఒక ఫ్లెక్సీ బోర్డును పైకి లాగే పని చెప్పగా బోర్డును లాగే క్రమంలో ఆ బోర్డు పక్కనే ఉన్న విద్యుత్తు లైన్లపై పడి కింద పడింది. దీంతో కొండయ్య, జమాల్‌బాషలు విద్యుత్‌షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో కొండయ్యకు భార్య గుర్రమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాసులు మెడికల్ ఏజెన్సీలో పనిచేస్తుండగా, రెండో కుమారుడు నాగేంద్ర ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
జమాల్‌బాషకు భార్య నవీనా, కుమారుడు అబ్దుల్లా, కుమార్తె అయేషాలు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ఆ ఇద్దరి మృతితో ఆ రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఎస్‌ఐ రాజారెడ్డిలు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలం చేరుకుని మృతదేహలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.