జగనన్న కాలనీలలో 95 వేల ఇళ్లు.. ఒక్కో ఇంటికి ఎంత ఖర్చు చేశారంటే..

ABN , First Publish Date - 2020-12-16T05:06:16+05:30 IST

నవరత్నాల హామీల్లో భాగంగా అందరికీ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేనుంది.

జగనన్న కాలనీలలో 95 వేల ఇళ్లు.. ఒక్కో ఇంటికి ఎంత ఖర్చు చేశారంటే..
నగర శివార్లలోని లేఅవుట్‌

ఒక్కో ఇంటికి లక్షా ఎనిమిది వేల వ్యయం

25 నుంచి పనులు ప్రారంభం

నీటి వసతి కోసం రూ.122 కోట్లు మంజూరు


కడప (సిటి), డిసెంబరు 15: నవరత్నాల హామీల్లో భాగంగా అందరికీ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేనుంది. ఈనెల 25 నుంచి వైఎ్‌సఆర్‌ జగనన్న కాలనీ పేరుతో ముఖ్యమంత్రి జగన్‌, ఎమ్మెల్యేల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది. తొలి దశ కింద జిల్లాలో 95 వేల పైచిలుకు ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. నిర్మాణాలకు నీటి వసతి కోసం రూ.122 కోట్లు మంజూరు చేశారు. పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌ ఇళ్లు లేని వారందరికీ ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం చేసి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అఽధికారంలోకి వచ్చాక వైఎ్‌సఆర్‌ జగనన్న కాలనీల పేరుతో అధికారులు స్థలాల సేకరణ చేపట్టారు. ఒక్కో సెంటులో ఇంటి నిర్మాణం అయ్యేలా లేఅవుట్లు వేశారు. రాష్ట్రంలో ఏదోక చోట సీఎం ప్రారంభించనుండగా ఎమ్మెల్యేలు వారి వారి పరిధుల్లోని లేఅవుట్లను ప్రారంభిస్తారు.


327 కాలనీలు.. 95 వేల ఇళ్లు

జిల్లాలో 327 వైఎ్‌సఆర్‌ జగనన్న కాలనీలకు సంబంఽధించి లేఅవుట్లు పూర్తి చేశారు, సెంటు స్థలంలో ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. జిల్లాలో తొలి విడత కింద 95,649 ఇళ్లు మంజూరయ్యాయి. అర్బన్‌లో 62,633, రూరల్‌లో 33,016 ఉన్నాయి. ఒక్కో ఇల్లు లక్షా 8 వేల వ్యయంతో నిర్మిస్తారు. ఈనెల 25న ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు. అదేరోజు ఒక్కో నియోజకవర్గంలోని ఒక పెద్ద లేఅవుట్‌లలో సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలు పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా 26 నుంచి జనవరి 7వ తేదీ వరకు మిగిలిన అన్ని లేఅవుట్లలో పనులు ప్రారంభిస్తారు. 


నీటి వసతికి రూ.122 కోట్లు

ఇంటి నిర్మాణాలకు సంబంధించి నీటి వసతి కల్పనకు అర్బన్‌లో రూ.93 కోట్లు, రూరల్‌లో రూ.29 కోట్లు మొత్తం రూ.122 కోట్లు మంజూరయ్యాయి. ఆర్‌డబ్ల్యుఎస్‌, అన్నమయ్య అర్బన్‌ డెవల్‌పమెంటు అథారిటీ (అనుడా) పర్యవేక్షణలో నీటి వసతి పనులు చేపడతారు. కాగా ఇంటి నిర్మాణాలు పూర్తయ్యేందుకు కాల వ్యవధిపై ఇంకా స్పష్టత రానట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా అందరికీ ఇళ్లు పనులు ప్రారంభం కానున్నాయి.


ముఖ్యమంత్రి చొరవతో అందరికీ ఇళ్లు 

- రాజశేఖర్‌, హౌసింగ్‌ పీడీ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదల, చొరవ కారణంగా అందరికీ ఇళ్లు పథకం ముందుకు సాగనున్నదని హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టరు రాజశేఖర్‌ అన్నారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పనులు పూర్తి చేస్తామన్నారు. వైఎ్‌సఆర్‌ హౌసింగ్‌ కింద పెండింగులో ఉన్న చెల్లింపులను ఈనెల 20 నుంచి లబ్ధిదారులకు అందించనున్నామని, 15 కోట్ల పైచిలుకు ఉంటుందన్నారు. పీఎంఏవై అర్బన్‌ గ్రామీణ లబ్ధిదారులకు కూడా చెల్లింపులు జరుగుతున్నాయన్నారు.

Updated Date - 2020-12-16T05:06:16+05:30 IST