-
-
Home » Andhra Pradesh » Kadapa » Isuka
-
పేదలకు భారంగా మారిన ఇసుక
ABN , First Publish Date - 2020-11-22T05:04:32+05:30 IST
ఇసుక నేడు నిత్యావసర వస్తువుగా మారి పేదలకు ధరాభారం తప్పడంలేదు.

జమ్మలమడుగు రూరల్, నవంబరు 21: ఇసుక నేడు నిత్యావసర వస్తువుగా మారి పేదలకు ధరాభారం తప్పడంలేదు. ఒక వైపు ఎడ్ల బండ్ల ద్వారా తక్కు వ ధరలకు ఇసుక సరఫరా చేస్తామని ప్రకటిస్తున్నా మరో వైపు అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నా యని పలువురు వాపోతున్నారు. నేడు ఎక్కడ చూసిన అపార్టుమెంట్లు, నూతన భవనాలు నిర్మిస్తుండడంతో ఇసుక అవసరం ఎక్కువగా ఉంటోంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు ఇసుక ధరలు బాగా పెంచి ఆర్థిక ప్రయోజనంతో ప్రజా ప్రయోజనాన్ని విస్మరించడంతో ప్రజలకు ఇసుక కష్టాలు తప్పడంలేదు. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని జమ్మలమడుగు, మోరగుడి, దొమ్మరనంద్యాల, కన్నెలూరు, గూడెం చెరువు తదితర గ్రామాలకు పెన్నానది దగ్గరలోనే ఉండటం వలన గత ప్రభుత్వ హయాంలో ఎడ్ల బండి ద్వారా రూ.300 నుంచి రూ.400లకు ఇసుక విక్రయించేవారని ప్రస్తుతం రూ.800 నుంచి రూ.1200 దాకా విక్రయిస్తున్నారని ఆయాగ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. రెండు సంవత్సరాల నుంచి ఇసుక లేక ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయి భవననిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం విదితమే. అయితే గత నెల నుంచి అధికారులు ఇసుక రవాణాకు ఎడ్లబండ్లకు అనుమతి ఇచ్చి బండి ఇసుక సరఫరా చేయుటకు రూ.500 మాత్రమే ఇవ్వాలని, అంతకుమించి ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని నగర పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సంబందిత అధికారులు ప్రకటించారు. కాని ఇసుక సమీప గ్రామాలకు పెన్నానది నుంచి తోలేవారు రూ.800 నుంచి రూ.1200 వరకు దూరాన్ని బట్టి రూ.1500 కూడా ఇసుక విక్రయిస్తున్నారు. నెలన్నర నుంచి పెన్నానదిలో మైలవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో ఇసుక సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు పెన్నాసమీప గ్రామాలకు ఇసుక తక్కువ ధరలకు విక్రయించాలని ప్రజలు కోరుతున్నారు.