పసుపు కొనుగోళ్లకు టోకెన్లు జారీ

ABN , First Publish Date - 2020-04-28T05:30:00+05:30 IST

కడప జిల్లాలో ప్రభుత్వం పసుపు కొనుగోళ్లకు సోమవారం టోకెన్లు జారీ చేసింది. క్వింటాకు మద్దతు ధర

పసుపు కొనుగోళ్లకు టోకెన్లు జారీ

కడప మార్కెట్లో బారులు తీరిన రైతులు

భౌతిక దూరం పాటించని వైనం


కడప, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కడప జిల్లాలో ప్రభుత్వం పసుపు కొనుగోళ్లకు సోమవారం టోకెన్లు జారీ చేసింది. క్వింటాకు మద్దతు ధర రూ.6850 ప్రభుత్వం నిర్ణయించింది మార్క్‌ఫెడ్‌ సంస్థ సేకరిస్తోంది. జిల్లా మార్కెటింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీకి కొనుగోళ్లు బాధ్యత అప్పగించారు. ఈ నెల 22వతేదీన డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కొనుగోళ్లను ప్రారంభించినా, సోమవారం నుంచి మాత్రమే రైతులకు టోకెన్లు పంపిణీ చేపట్టారు. ఇది తెలిసి ఆయా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కడప మార్కెట్‌కు రైతులు తరలివచ్చారు. బారులు తీరారు.   ఒక్కసారిగా రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరు తాకుతూ నిలబడ్డారు. 


కడప జిల్లాలో 8932 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. ఎకరాకు 28 - 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని, ఈ లెక్కన 9.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అంచనా. లాక్‌డౌన్‌ వల్ల అంతర్జాతీయ ఎగుమతులు లేక పసుపు ధర పతనమైంది. క్వింటా రూ.4300 నుంచి రూ.5500 మించి పలకడం లేదు. పసుపు రైతును ఆదుకోవాలని ప్రభుత్వం మద్దతు ధర రూ.6850 ప్రకటించినా.. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పింది. మిగిలిన పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్మాల్సి వస్తుందని, ధర మరింత తగ్గించి కొనుగోలు చేసే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.


కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు హార్టికల్చర్‌, డీసీఎంసీ అధికారులు సమన్వయంతో ఈ-క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా గ్రామాల్లోనే రైతులకు టోకెన్లు జారీ చేస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. జిల్లాలో కడప, మైదుకూరు, రాజంపేటలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-04-28T05:30:00+05:30 IST