సీఎం పర్యటన ప్రత్యేక హోదా కోసం కాదా..?

ABN , First Publish Date - 2020-10-08T08:32:52+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లింది ప్రత్యేక హోదా కోసం కాదా..!? తనకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని న్యాయస్థానాలపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తారా..

సీఎం పర్యటన ప్రత్యేక హోదా కోసం కాదా..?

 న్యాయస్థానాలపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తావా? 

 కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు వైసీపీ తహతహ

 కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి ఇప్పుడు అక్రమం అంటారా?

 టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి ఫైర్‌


కడప, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లింది ప్రత్యేక హోదా కోసం కాదా..!? తనకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని న్యాయస్థానాలపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తారా.. అంటే న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని కోరుకుంటున్నావా అంటూ కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి ప్రశ్నించారు. బుధవారం సాయం త్రం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. న్యాయస్థానాల్లో తీర్పులు వ్యతిరేకంగా వస్తే పైకోర్టును ఆశ్రయించవచ్చన్నారు.


అయితే సీఎం జగన్‌ మాత్రం కోర్టులకు, ప్రధానమంత్రికి మధ్య తగువు పెట్టేలా అమిత్‌షా, ప్రధానికి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల అవినీతి కేసులు ఏడాదిలోపు తేల్చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. తెలంగాణలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో భయం పుట్టి కేసులు నీరుగార్చేందుకు కేంద్రంలో చేరేందుకు వైసీపీ తహతహలాడుతోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకమని చెప్పి ముస్లింలు, క్రిస్టియన్ల ఓట్లు వేయించుకుని ఇప్పుడు కేసుల నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వంలో చేరేందుకు తహతహలాడుతున్నారని ఆరోపించారు.


తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆహ్వానించడంతో సీఎం హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి ఇప్పుడేమో ఆ ప్రాజెక్టు అక్రమం అంటావా అని ప్రశ్నించారు. తెలంగాణ గడ్డపె ౖగోదావరి-క్రిష్ణ అనుసంధాన ప్రాజెక్టులు కడతామంటే టీడీపీ సహా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయన్నారు. అప్పుడు అక్కడ కట్టి ఉండింటే రాష్ట్ర పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు లొంగిపోవడంతో స్వారీ చేస్తున్నారన్నారు. సమావేశంలో కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు, నగర అధ్యక్షుడు జిలానీబాషా, ప్రధాన కార్యదర్శి వికా్‌స హరిక్రిష్ణ, ఆ పార్టీ నాయకులు యాటగిరి రాంప్రసాద్‌, గురప్ప తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-08T08:32:52+05:30 IST