కాపాడే దేవుళ్లు..!

ABN , First Publish Date - 2020-04-28T05:30:00+05:30 IST

కంటికి కనిపించని కరోనా వైరస్‌తో ప్రత్యక్ష పోరుచేస్తున్నారు. ఆ క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ మహమ్మారి తమకూ సోకుతుందని వారికి తెలుసు. అయినా విధుల్లో అడుగు

కాపాడే దేవుళ్లు..!

కరోనాతో ప్రత్యక్ష పోరు

బాధితుల సేవలో అలుపెరగని సైనికులు

కోవిడ్‌-19 ఆస్పత్రి డాక్టర్ల కృషి ప్రశంసనీయం

క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు, సిబ్బంది


కడప, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కంటికి కనిపించని కరోనా వైరస్‌తో ప్రత్యక్ష పోరుచేస్తున్నారు. ఆ క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ మహమ్మారి తమకూ సోకుతుందని వారికి తెలుసు. అయినా విధుల్లో అడుగు పెట్టినప్పటి నుంచి సైనికుల్లా  పోరాడుతున్నారు. వైద్యోనారాయణహరి..! అన్నదాన్ని అక్షరసత్యం చేస్తూ, కరోనా కబళిస్తున్న ఆపద సమయంలో ఎందరినో ప్రాణాపాయం నుంచి కాపాడుతూ దేవుళ్లుగా మారుతున్నారు. విపత్తు వేళలోనూ సేవకు వెరవని వైద్యులపై ప్రత్యేక కథనం.


జిల్లాలో ఏప్రిల్‌ 1న కరోనా మహమ్మారి పడగ విప్పింది. తొలిసారిగా 15 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొదట్లో రిమ్స్‌లోనే ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేసి సేవలు ఆరంభించారు. అయితే ప్రసవం కోసం వచ్చే గర్భిణీలు, పసిపిల్లలు, సాధారణ రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రిమ్స్‌ సూపరిటెంండెంట్‌ డాక్టర్‌ గిరిధర్‌ పర్యవేక్షణలో ఫాతిమా మెడికల్‌ కళాశాలను కోవిద్‌-19 జిల్లా ఆస్పత్రిగా ఏర్పాటు చేసి సేవలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఇప్పటి వరకూ 58 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. పరిస్థితి విషమంగా ఉన్న 9 మందిని కోవిద్‌-19 రాష్ట్ర ఆస్పత్రి తిరుపతి స్విమ్స్‌కు పంపించారు. 49 మందిని ఫాతిమా మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో ఆడ్మిట్‌ చేశారు.


రోజూ ఐసీయూలో మూడు సిఫ్టుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌, అసోషియేట్‌ ప్రొఫెసర్స్‌ 9 మంది, ఓపీ డాక్టర్లు ఆరుగురు, హౌస్‌ సర్జన్స్‌ ఆరుగురు.. ఇలా వివిద స్థాయిల్లో 30 మంది డాక్టర్లు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, హెడ్‌నర్స్‌, నర్సింగ్‌ సిబ్బంది 25-30 మంది, పారామెడికల్‌ సిబ్బంది 25-30 మంది, శానిటేషన్‌ సిబ్బంది 30 మంది, సెక్యూరుటీ గార్డులు 30 మంది విధి నిర్వహణలో మమేకమయ్యారు. 


బాధితులతో నేరుగా మాట్లాడుతూ..

మూడు షిఫ్టుల్లో కరోనా బాధితులతో నేరుగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. కరోనాపై సాగించే పోరాటంలో ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా వీరి ప్రాణాలకే ప్రమాదం. అయినప్పటికీ భయపడక కర్తవ్యదీక్షతో ఆయుషు పోస్తున్నారు. డాక్టర్ల సేవలతో 28 మంది పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరారు. ఇది రాష్ట్రంలోనే రికార్డు. పలు జిల్లాల్లో ప్రైవేటు డాక్టర్లు కూడా కోవిడ్‌ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తే.. ఇక్కడ కేవలం ప్రభుత్వ ఆస్పత్రి (రిమ్స్‌), మెడికల్‌ కళాశాల వైద్యులు మాత్రమే కరోనా పోరులో రాణిస్తున్నారు. పులివెందుల, ప్రొద్దుటూరు ఐసోలేషన్‌లలో సైతం డాక్టర్లు సహసోపేతమైన విధులు నిర్వర్తిస్తున్నారు.


క్షేత్రస్థాయి సిబ్బంది సైతం..

క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ డాక్టరు, సిబ్బంది, ఆశావర్కర్లు సేవలు అందిస్తున్నారు. కరోనా వైరస్‌ కట్టడిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయంటే అప్రమత్తం అవుతున్నారు. సమాచారాన్ని స్థానికంగా వైద్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అందిస్తారు. వారి ఇళ్ల ముందు వాలిపోతున్నారు. కరోనా వైరస్‌ మనకు వ్యాపిస్తే ఎలా..? అనే భయాన్ని పక్కన పెట్టి కర్తవ్య నిర్వహణతో ముందుకు వెళ్తున్నారు. అందుకే 7 వేలకు పైగా శాంపుల్స్‌ సేకరించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల పరిధిలో 149 మంది డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు 90 మంది, సచివాలయ హెల్త్‌ అసిస్టెంట్లు 895 మంది, ల్యాబ్‌ టెక్నిషియన్లు 90 మంది, ఏఎన్‌ఎంలు 1,200, ఆశావర్కర్లు 2,300 మంది కరోనా కట్టడిలో నిమగ్నమయ్యారు. ఇక 108 వాహన సిబ్బంది సేవలు ఎనలేనివి.


సమష్టి కృషితో మంచి ఫలితాలు 

కోవిడ్‌-19 ఆస్పత్రిలో విధులు సాహసంతో కూడుకున్నవే. షిప్ట్‌కు వెళ్లేటప్పుడు మాలో ఒకటే లక్ష్యం.. కరోనాపై విజయం సాధించాలి. బాధితులు సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు చేరాలి.. అప్పుడే శ్రమ ఫలించినట్టు అనుకొని డ్యూటీలోకి వెళ్తాం. ఐసీయూలో విధులు నిర్వర్తించే వైద్యులు, ఓపీ డాక్టర్లు, హౌస్‌ సర్జన్లు ఎవరికి వారే సైనికుల్లా పనిచేస్తున్నారు. ఏ చిన్న అనుమానం వచ్చినా మెరుగైన వైద్యం అందించేలా చర్చించుకుంటాం. 8 గంటలు డ్యూటీలో ఉండాలి. మాస్క్‌కు వాడే ఎలాస్టిక్‌ తాళ్ల గుర్తులు మొహం మీద లోతుగా అచ్చులు పడతాయి.


షిఫ్ట్‌కు వెళ్లడానికి ముందు రక్షణ కోసం పీపీఈ కిట్లు, మాస్క్‌లు, చేతితొడుగులు.. ఇలా అన్నీ వేసుకోవాల్సిందే. పాజిటివ్‌ కేసు దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థతి తెలుసుకొని అనుగుణంగా చికిత్స అందించాలి. అప్పుడే బాధితులు త్వరగా కొనుకోగలరు. ఆ సమయంలో ఏ చిన్న నిర్లక్ష్యం.. అశ్రద్ధ వహించినా ప్రమాదమే. మాకు రోగుల ప్రాణాలే ముఖ్యం. కరోనా పోరులో సక్సెస్‌ కావడం వల్లే 28 మంది బాధితులు కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరారు. రెండు మూడు రోజుల్లో మరో నలుగురు డిశ్చార్జ్‌ కానున్నారు. ఇది సమష్టి విజయం.


భార్య పిల్లలతో ఆప్యాయంగా గడిపింది లేదు: డాక్టర్‌ సురేశ్వరరెడ్డి, ఫ్రొఫెసర్‌, రిమ్స్‌, కడప

కరోనాపై చేసే సమరంలో రోగుల ప్రాణాలే మాకు అత్యంత ముఖ్యం. వారు సురక్షితంగా ఇంటికి వెళ్లినప్పుడే మాకు ఆనందం. ఆ క్రమంలో ఇంటిని కూడా మరిచిపోతాం. ఫాతిమా మెడికల్‌ కళాశాలలోని కోవిడ్‌-19 ఆస్పత్రిలో షిఫ్ట్‌ 8 గంటలు డ్యూటీ చేయాలి. మామూలు రోజుల్లో అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక్కడ పీపీఈ కిట్లు, మాస్క్‌లు, చేతికి గ్లౌజులు వేసుకోవాలి. ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పలేం. బాత్‌రూంకు వెళ్లాలన్నా ఇబ్బందే. డ్యూటి నుంచి ఇంటికి రాగానే బయటే దుస్తులు వదిలేసి స్నానం చేసి నాకు కేటాయించిన ప్రత్యేక గదిలోకి వెళ్తాను.


భార్య పిల్లలకు దగ్గరగా కూర్చొని ఆప్యాయంగా మాట్లాడలేని పరిస్థితి. దూరం నుంచి వారితో మాట్లాడతా. ఎందుకంటే కరోనాతో నిత్యం పోరాడుతున్నాం. ఏ చిన్నపొరపాటు జరిగినా ప్రమాదమే కాబట్టి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మెరుగైన సేవలు అందిస్తున్నాం. మా లక్ష్యం ఒక్కటే.. కరోనా బాధితులను సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపాలన్నాదే. ఒక్కరికి కూడా నష్టం జరగకూడదు. అప్పుడే వైద్యుడిగా మాకు సంతృప్తి.. ఆనందం.


Updated Date - 2020-04-28T05:30:00+05:30 IST