ఎంత పనిచేశావే కరోనా..!
ABN , First Publish Date - 2020-05-24T11:35:04+05:30 IST
కంటికి కనిపించని క్రిమి ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల మధ్య సంబంధాలనూ తెంచేస్తోంది. మనుషులను ఎక్కడికక్కడ ఎవరికి వారిని

కడదాకా వచ్చి.. కన్నబిడ్డను చూడలేకపోయిన కన్నపేగు
తల్లి క్వారంటైన్లో.. తండ్రి కువైత్‌లో
రాజంపేట, మే 23 : కంటికి కనిపించని క్రిమి ప్రపంచాన్ని వణికిస్తోంది. మనుషుల మధ్య సంబంధాలనూ తెంచేస్తోంది. మనుషులను ఎక్కడికక్కడ ఎవరికి వారిని బందీలుగా మారుస్తూ.. ఆత్మీయుల కడచూపులకూ దూరం చేస్తోంది. గుండెకో కథ, మనిషికో వ్యథను మిగిలిస్తోంది.
నిన్నగాక మొన్న నందలూరుకు చెందిన ఓ మహిళ పూణాలో క్యాన్సర్‌తో మృతిచెందింది. మరణం తర్వాత ఆమెకు పాజిటివ్ ఉందని వైద్యులు ధ్రవీకరించారు. ఆమె చివరి కోరిక సొంతూరిలో మట్టిలో కలిసిపోవడం. బంధువులు ఆమె మృతదేహాన్ని తీసుకుని సొంతూరికి బయలుదేరారు. విషయం తెలిసి ఆ ఊరి ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆ పరిసరాల్లో అంత్యక్రియలు నిర్వహించనివ్వమని చెప్పారు. చివరకు అధికారులు వారికి నచ్చచెప్పి అంత్యక్రియలు నిర్వహించారు.. కాగా ఆ మృతదేహం తీసుకొచ్చిన అంబులెన్స్ నందలూరులోకి రాగానే.. రోడ్లపై ఒక్కరు కూడా లేకుండా అందరూ ఇళ్లలోకి దూరుకున్నారు. చివరి చూపు అనే పదానికి అర్థమే మారిపోయేలా చేసింది కరోనా..
ఇక.. తాజా వ్యవహారం మరింత బాధాకరం. రాజంపేటకు సమీపంలోని పెనగలూరు మండలానికి చెందిన ఓ కుటుంబం తమ కొడుకును డాక్టర్‌ను చేయాలని ఆశించింది. రెండేళ్ల క్రితం అప్పులు చేసి ఉక్రెయిన్ పంపింది. ఆ అప్పులు తీర్చేందుకు అమ్మానాన్న కువైత్ వెళ్లారు. బిడ్డ చదువు వారి కష్టాన్ని మరిపించేది. ఇలాంటి సమయంలో గత నెల 24న ఆ యువకుడు అక్కడే బ్రెయిన్ స్ర్టోక్‌తో మరణించాడు. కన్నపేగులు తల్లడిల్లిపోయాయి. రూ.5లక్షలు ఖర్చు చేసి కొడుకు మృతదేహం స్వగ్రామం వచ్చే ఏర్పాట్లు చేశాయి. కరోనా కారణంగా కువైత్‌లో లాక్డౌన్ ఉన్నా.. వారినీ వీరినీ వేడుకుని తల్లి శుక్రవారం రాజంపేటకు చేరుకుంది.
అధికారులు ఆమెను క్వారంటైన్లో ఉంచారు. శనివారం కుమారుడి మృతదేహం స్వగ్రామం వచ్చింది. ఈలోగా ఆమెకు పాజటివ్ ఉందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో సుదూర దేశం నుంచి 8వేల కి.మీ. విమానాలు, ఇతర వాహనాలద్వారా ప్రయాణించి వచ్చినా.. నడిచిపోయేంత దూరం 5 కి.మీలలోని సొంతూరిలో ఉన్న కొడుకు దేహాన్ని ఆ తల్లి చివరిచూపు చూడలేకపోయింది. గుండలవిసిపోయేలా రోదించింది. శవపేటికను తెరవకుండానే అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో చుట్టుపక్కల గ్రామస్తులు భౌతికదూరం పాటిస్తూ యువకుడి శవపేటికను చూసి.. తల్లి కడసారి చూపునకు నోచుకోలేని విషయాన్ని, కువైత్‌లో ఉన్న తండ్రి ఆవేదనను మననం చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ కరోనా మహమ్మారి దాహం తీరాలంటే ఇంకెందరు ఎన్ని కన్నీళ్లు కార్చాలో..