అదనంగా ఒక్కపైసా కూడా వసూలు చేయం

ABN , First Publish Date - 2020-05-10T07:15:01+05:30 IST

‘‘రెండు నెలల (మార్చి, ఏప్రిల్‌) విద్యుత్‌ వినియోగ రీడింగ్‌ ఒకేసారి తీయడం వల్ల బిల్లు ఎక్కువగా వచ్చి ఉంటుంది.

అదనంగా ఒక్కపైసా కూడా వసూలు చేయం

వినియోగదారులకు ఎస్‌ఈ వివరణ


కడప (సిటి), మే 9 : ‘‘రెండు నెలల (మార్చి, ఏప్రిల్‌) విద్యుత్‌ వినియోగ రీడింగ్‌ ఒకేసారి తీయడం వల్ల బిల్లు ఎక్కువగా వచ్చి ఉంటుంది. ఏప్రిల్‌ నెల నుంచి 500 యూనిట్లు పైబడి వినియోగించిన వారికి మాత్రమే యూనిట్‌పై 90 పైసలు పెరుగుతుంది. మిగతా స్లాబ్‌లలో పాత చార్జీలే వర్తిస్తాయి. వినియోగదారుల నుంచి వినియోగానికి మించి ఒక్క పైసా అదనంగా వసూలు చేయం’’ అని ఎస్పీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఎన్‌.శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆయన శనివారం విద్యుత్‌ భవన్‌లో స్లాబులు, బిల్లు, వసూలు మొత్తం వివరాలను విలేకరులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.


మార్చి 31వ తేదీ వరకు గత టారిఫ్‌ (చార్జీలు) వర్తిస్తాయని, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త టారిఫ్‌ వచ్చిందని ఇందులో 500 యూనిట్ల వరకు ఎలాంటి మార్పు లేదని అంతకు పైబడి వినియోగించిన వారికి మాత్రమే యూనిట్‌పై 90 పైసలు అదనంగా పడుతుందన్నారు. కరోనా కారణంగా మార్చి నెల రీడింగ్‌ తీయలేకపోవడంతో ఫిబ్రవరిలో వినియోగ బిల్లు ఎంత చెల్లించి ఉంటారో అంతే మొత్తాన్ని మార్చి నెల కింద ఏప్రిల్‌లో వసూలు చేశామన్నారు. ఏప్రిల్‌ నెలలో రెడ్‌జోన్‌ మిహా మిగతా ప్రాంతాల్లో రీడింగ్‌ తీశామని రెండు నెలల వినియోగం బట్టి బిల్లు చేశామన్నారు. ఇక్కడ కూడా ఏనెలకానెల విభజించే బిల్లు ఇచ్చామన్నారు. సాఽధారణంగా ఫిబ్రవరితో పోలిస్తే మార్చి, ఏప్రిల్‌ నెలలో వినియోగం 40 నుంచి 60 శాతం పెరుగుతుందని ఈసారి లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వినియోగం మరింత పెరిగిందన్నారు.


సంవత్సర వినియోగాన్ని బట్టి గృహ వినియోగాన్ని ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించి ఆయా టారి్‌ఫలను బట్టి వసూలు చేసేవారమని ఏప్రిల్‌ నుంచి నెలవారీ వినియోగం బట్టి గ్రూపులు విభజించడం వల్ల వినియోగదారుడికి వెసులుబాటు వస్తుందన్నారు. ఐదు వందల యూనిట్లు పైబడి వినియోగించేవారు వేసవి కావడంతో 5 నుంచి 8 శాతం ఉంటారని కావున చార్జీలు పెరిగాయనో, అదనంగా వేశారనో వినియోగదారులు భావించవద్దని అన్నారు. వినియోగం యూనిట్లతో పాటు కస్టమ్‌ చార్జి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఆలస్యంపై సర్‌చార్జీ కలుపుతామన్నారు. ఒక్కపైసా, ఒక్క యూనిట్‌ అదనంగా బిల్లు చేయమన్నారు. బిల్లింగ్‌పై ఏవైనా అనుమానాలుంటే సమీపంలోని అధికారులకు కానీ, తమకు కానీ వివరించి నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో డీఈఈలు శోభవాలెంటీనా, జగన్మోహన్‌రెడ్డి, సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసరు శ్రీనివాసులు, ఏడీఈలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-10T07:15:01+05:30 IST