సుప్రీంకోర్టుకు వెళ్లయినా పట్టాలు ఇస్తా

ABN , First Publish Date - 2020-12-26T05:44:13+05:30 IST

వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ పండుగలు ఒకే రోజు రావడం గొప్ప శుభదినం.

సుప్రీంకోర్టుకు వెళ్లయినా పట్టాలు ఇస్తా
పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ కేక్‌ కటింగ్‌లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌

పులివెందులలో పట్టాల పంపణీ వాయిదా పడ్డం బాధగా ఉంది

రాష్ట్రంలో 31 లక్షల పట్టాలు పంపిణీ చేస్తున్నాం

క్రిస్మస్‌, వైకుంఠ ఏకాదశి ఒకే రోజు రావడం శుభదినం

ప్రజలందరికీ క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు

సీఎం జగన్‌

పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనలు

కడప నుంచి రాజమండ్రికి బయలుదేరిన ముఖ్యమంత్రి

ముగిసిన మూడు రోజుల పర్యటన

కడప, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ పండుగలు ఒకే రోజు రావడం గొప్ప శుభదినం. ఈ రోజు రాష్ట్రంలో 31 లక్షల ఇంటి పట్టాల పంపిణీకి శ్రీకారం చుడితే.. నన్ను ఆదరించిన పులివెందులలో గిట్టనివారు కోర్టుకు వెళ్లడం వల్ల పట్టాల పంపిణీ వాయిదా పడ్డం మనసులో చిన్న బాధగా ఉందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు శుక్రవారం పులివెందుల సీఎ్‌సఐ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి విజయలక్ష్మి, సతీమణి వైఎస్‌ భారతి, కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్‌ కేక్‌ను సీఎం కట్‌ చేశారు. అలాగే.. చర్చి ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండరును ఆవిష్కరించారు. క్రిస్మస్‌ వేడుకల్లో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి, కలెక్టరు సి.హరికిరణ్‌, జేసీలు ఎం.గౌతమి, ధర్మచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కడప మాజీ మేయరు సురే్‌షబాబు పాల్గొన్నారు.


మనసులో చిన్న బాధ

సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం సీఎం వైఎ జగన్‌ మాట్లాడారు. తనను ఆదరించి ఇంతటివాన్ని చేసిన పులివెందుల పట్టణ పేదలకు ఏపీఐఐసీ భూముల్లో 8,300 మందికి ఇంటి పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేశామని, గిట్టనివారు కోర్టుకు వెళ్లడం వల్ల పంపిణీ వాయిదా పడ్డం మనసులో చిన్న బాధగా ఉందని అన్నారు. క్రిస్మస్‌, వైకుంఠ ఏకాదశి ఒకే రోజు వచ్చిన పర్వదినం నాడు చేపట్టిన పట్టాల పంపిణీ కార్యక్రమం గిట్టనివారు కోర్టుకు వెళ్లడం వల్ల వాయిదా పడిందన్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లైనా సరే త్వరలో అందరికి పంపిణీ చేస్తామన్నారు. ఏసుప్రభువు, ఆ భగవంతుని కృప కటాక్షాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం ఆ దేవుని దయ, అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రిస్మస్‌ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నామని, మరో ఐదు రోజుల్లో 2020కి వీడ్కోలు పలికి 2021లోకి అడుగు పెడుతున్నామని అన్నారు. జిల్లా, రాష్ట్ర ప్రజలు అందరికి క్రిస్మస్‌, నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.


వీడ్కోలు పలికి నేతలు

జిల్లా పర్యటన ముగించుకొని రాజమండ్రికి బయలుదేరిన సీఎం జగన్‌కు ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘరామిరెడ్డి, కమలాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, జేసీ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ, కడప సబ్‌ కలెక్టరు పృథ్వీతేజ్‌, కడప డీఎస్పీ సునీల్‌ వీడ్కోలు పలికారు.


మూడురోజులు ఇడుపులపాయలోనే..

మూడు రోజలు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన సీఎం జగన్‌ ఇడుపులపాయ గెస్ట్‌హౌ్‌సలోనే బస చేశారు. రెండు రోజులు పులివెందులలోనే అభివృద్ధి కార్యక్రమాలు, క్రిస్మస్‌ వేడుకల్లో జగన్‌ పాల్గొన్నా.. ఇక్కడ సొంతిల్లు ఉన్నా ఇడుపులపాయలోనే బస చేయడం విశేషం. 23వ తేది బుధవారం సాయంత్రం 6.20 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌ చేరుకొని రాత్రి అక్కడే బస చేశారు. 24న ఉదయం 9.45 గంటలకు కుటుంబ సభ్యులతో కలసి దివంగత సీఎం వైస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకొని నివాళులు ఆర్పించారు. మధ్యాహ్నం తరువాత పులివెందుల పట్టణానికి చేరుకొని సుమారు రూ.5,010 కోట్లతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, ఏపీ కార్ల్‌లో ఇర్మ, ఏపీఐఐసీలో అపాచి సంస్థల ఏర్పాటు శంకుస్థాపన చేసి తిరిగి ఇడుపులపాయకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10.15 గంటల వరకు సీఎ్‌సఐ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకలు, ప్రార్థన కూటముల్లో పాల్గొన్నారు. 10.30 గంటలకు భాకరపురం హెలిపాడ్‌కు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాప్టరులో కడపకు బయలుదేరారు. 11.15 గంటలకు కడప చేరుకున్న సీఎం జగన్‌ 10.30 గంటలకు ప్రత్యక విమానంలో రాజమండ్రికి బయలుదేరారు. విమానంలో జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు, ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఉన్నారు.

Updated Date - 2020-12-26T05:44:13+05:30 IST