హై అలర్ట్‌..!

ABN , First Publish Date - 2020-04-12T09:09:25+05:30 IST

ప్రొద్దుటూరులో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. కట్టడి చేసేందుకు పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతం నుంచి చుట్టూ 8 కి.మీలు హాట్‌స్పాట్‌గా గుర్తించారు.

హై అలర్ట్‌..!

హాట్‌స్పాట్‌గా ప్రొద్దుటూరు

మరో పాజిటివ్‌ కేసు అక్కడే నిర్ధారణ

జిల్లాలో 30కి చేరిన కోవిడ్‌-19 కేసులు

ఒక్క ప్రొద్దుటూరులోనే 12

8 కి.మీలు హాట్‌స్పాట్‌గా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు

బయటికి వస్తే కేసులు నమోదు

ప్రొద్దుటూరు కమాండ్‌ కంట్రోల్‌ నెంబరు 91211 00702


కడప, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రొద్దుటూరులో కరోనా వైరస్‌ కోరలు చాస్తోంది. కట్టడి చేసేందుకు పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతం నుంచి చుట్టూ 8 కి.మీలు హాట్‌స్పాట్‌గా గుర్తించారు. హై అలర్ట్‌ ప్రకటించారు. ఉదయం 6 - 9 గంటల సమయంలో మినహా గడప దాటవద్దని కలెక్టర్‌ హరికిరణ్‌ సూచించారు. ఎవరైనా బయటికి వస్తే కేసులు నమోదు చేయక తప్పదని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజ న్‌ హెచ్చరికలు జారీ చేశారు. 



జిల్లాలో ప్రొద్దుటూరులో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం 40 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ ్యక్తికి పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఇంటికి 400 మీటర్ల దూరంలో ఉన్న మరో వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కాంటాక్ట్సు సర్వేను మరింత వేగం పెంచారు. ఒక్క ప్రొద్దుటూరులోనే కోవిడ్‌-19 కేసులు 12కు చేరాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.


చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్‌ కట్టడికి కఠిన లాక్‌డౌన్‌ అమలుకు చర్యలు తీసుకోనున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు విక్రయ దుకాణాలను మూసివేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే క్రమంలో రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్న ఏ ఒక్కరికీ ఇబ్బంది రాకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఇళ్లవద్దకే కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ వివరించారు.


గడప దాటితే కేసులు నమోదు

ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్‌ కేసు వచ్చిన ప్రాంతాన్ని ఎస్పీ అన్బురాజన్‌ పరిశీలించారు. కరోనా వైరస్‌ కట్టడి చేయాలంటే ఇబ్బందికరమైనా కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఇంటి నుంచి బయటికి రాకుండా కఠిన చర్యలు తీసుకోనున్నామని, ఎవరైనా బయటికి వస్తే కేసులు నమోదు చేస్తామని అన్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, మెడిసిన్‌ వంటివి అవసరమైతే ప్రొద్దుటూరులో కొత్తగా ఏర్పాటు చేసిన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ నెంబరు 91211 00702 కు కాల్‌ చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారని వివరించారు.


శాంపిల్స్‌లో రాష్ట్రంలోనే అగ్రస్థానం

కరోనా వైరస్‌ అనుమానితుల కోసం శాంపిల్‌ ్స సేకరించడంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నామని కలెక్టర్‌ హరికిరణ్‌ వివరించారు. ఇప్పటి వరకు 1230 శాంపిల్స్‌ తీశారు. 829 రిజల్ట్స్‌ రాగా, 30 పాజిటివ్‌ తేలింది. 799 నెగటివ్‌ కేసులు వచ్చాయి. శనివారం మరో 94 శాంపిల్స్‌ తీశారు. ఇప్పటికే మూడు రౌండ్లు ఇంటింటి సర్వే నిర్వహించామని ఆయన వివరించారు. ఏడు లక్షల కుటుంబాలు ఉంటే 7.70 లక్షల ఇళ్లు సర్వే చేశారని, మరో 30 వేల ఇళ్లు ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 1500 మందికి జ్వరం, దగ్గు ఉన్నట్లు గుర్తిస్తే.. అందులో 700 మందికి మాత్రమే శాంపిల్స్‌ తీసే అవకాశం ఉందని వైద్యులు సూచించినట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ వివరించారు. కడప, బద్వేలు, పులివెందుల, మైదుకూరు, వేంపల్లె ప్రాంతాల్లోని రెడ్‌జోన్‌ ఏరియాలో కట్టుదిట్టమైన భద్ర త కొనసాగుతోందన్నారు.


కరోనా వైరస్‌ స్వాబ్‌ శాంపిల్స్‌, రిజల్ట్స్‌ వివరాలు ః

మొత్తం శాంపిల్స్‌ ః 1230

రిజల్ట్స్‌ వచ్చినవి ః 829

నెగటివ్‌ ః 799

పాజిటివ్‌ ః 30

రిజల్ట్స్‌ రావలసినవి ః 401

11న తీసిన శాంపిల్స్‌ ః 94


జిల్లాలో కరోనా పాజిటివ్‌ వివరాలు ః

కడప 6

ప్రొద్దుటూరు 12

పులివెందుల 4

వేంపల్లె 2

బద్వేలు 3

మైదుకూరు 3


మొత్తం 30


Updated Date - 2020-04-12T09:09:25+05:30 IST