దర్జా కబ్జా.. వందల ఎకరాల సర్కారీ భూములకు కంచె
ABN , First Publish Date - 2020-10-03T21:32:25+05:30 IST
ఎకరా కొన్ని లక్షల విలువ చేసే భూములవి. ఆ భూములకు సమీపంలోనే ఎలక్ట్రానిక్ వస్తు తయారీ పరిశ్రమ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకేముంది.. జిల్లాలో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. హాట్‌కేకుల్లా ఊరిస్తున్న ఈ భూములను మింగేస్తున్నారు.
ఆ భూముల్లో ఉద్యాన పంటల సాగు
అడ్డుకోబోతే అధికారులపై దౌర్జన్యం
కబ్జాలో కడపజిల్లా నయా ట్రెండ్
‘హబ్’ ప్రకటనతో జోరుగా దందాలు
కమలాపురం, ఎర్రగంట్ల భూములపై కన్ను
1030 ఎకరాల్లో 250 ఎకరాలు స్వాహా
కాపాడుకోవడానికి ప్రయత్నించే అధికారులకు.. ఫోన్లు చేసి కట్టడి చేస్తున్న అధికార నేతలు
కబ్జాదారులకే వాటిపై హక్కులిచ్చేలా పావులు
డీకేటీ పట్టాలు ఇస్తామంటూ నేతల హామీలు!
(కడప-ఆంధ్రజ్యోతి): ఎకరా కొన్ని లక్షల విలువ చేసే భూములవి. ఆ భూములకు సమీపంలోనే ఎలక్ట్రానిక్ వస్తు తయారీ పరిశ్రమ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకేముంది.. జిల్లాలో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. హాట్‌కేకుల్లా ఊరిస్తున్న ఈ భూములను మింగేస్తున్నారు.
భూమిని కొన్నప్పుడు జాగ్రత్తకోసం దానిచుట్టూ యజమాని కంచె ఏర్పాటుచేస్తాడు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు హద్దు రాళ్లు ఏర్పాటుచేసి.. చుట్టూ కంచె నాటుతారు. హెచ్చరిక బోర్డులు పెడతారు. కానీ, కడప జిల్లాలో కబ్జారాయుళ్లు తాము ఆక్రమించిన వందల ఎకరాల ప్రభుత్వ భూముల చుట్టూ దర్జాగా కంచె నాటేశారు. ఆ కంచె తీసేయాలని వచ్చిన అధికారులతో తగువుకు దిగారు. దీంతో ఎర్రగుంట్ల, కమలాపురం ప్రాంతాల్లో ఇటీవల ఉద్రిక్తత నెలకొంది. కబ్జారాయుళ్లకు అధికార నేతల అండ ఉండటంతో రెవిన్యూ అధికారులు అంత దూకుడుగా వెళ్లలేకపోతున్నారు. విచిత్రమేమిటంటే, కబ్జాదారులకే ఈ భూములపై హక్కులు కల్పిస్తామని అధికార ప్రజాప్రతినిధులు చెబుతుండటం! త్వరలో అసైన్మెంట్ కమిటీ సమావేశం పెట్టి డీకేటీ పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జల్లా కడపలో భూదందాపర్వంలో ఇలా కొత్త అంకానికి తెరలేచింది. ఆ వివరాల్లోకి వెళితే..
కడప జిల్లా కమలాపురం మండలం తుగకపల్లె, జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం కోడూరు గ్రామాలకు సమీపంలో భారతీ సిమెంటు పరిశ్రమ ఉంది. ఈ రెండు గ్రామాలు వేర్వేరు మండలాలు, నియోజకవర్గాల పరిధిలో ఉన్నా.. భౌగోళికంగా భూములు పక్కపక్కనే ఉన్నాయి. కడప నగర శివారులోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఎలకా్ట్రనిక్ వస్తు తయారి పరిశ్రమ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల సీఎం జగన్ ప్రకటించారు. పారిశ్రామికవాడకు కేవలం 10-15 కిలోమీటర్ల దూరంలోని ఈ రెండు గ్రామాల పరిధిలో ప్రభుత్వానికి వెయ్యి ఎకరాలకుపైగా గుట్టపొరంబోకు భూములున్నాయి. హబ్ ప్రకటన తర్వాత ఆ భూముల్లో ఇప్పటిదాకా దాదాపు 250 ఎకరాలను కబ్జాదారులు ఆక్రమించి కంచె వేశారు. ఆ కంచెలు తొలగించకుండా.. ఎక్కడికక్కడ రెవిన్యూ అధికారులకు కీలక నాయకులు ఫోన్లు చేసి కట్టడి చేస్తున్నట్టు తెలిసింది. తుగకపల్లెలోని రెండు సర్వే నంబర్లలో 536 ఎకరాలు ఉండగా, ఇప్పటికే 100-150 ఎకరాలను ఆక్రమించేశారు. కోడూరులో సర్వే నంబరు 756-2 పరిధిలోని 494 ఎకరాల్లో వంద ఎకరాలు స్వాహా చేశారు. ఆన్‌లైన్‌లో రెవిన్యూ రికార్డులను పరిశీలిస్తే.. 1-బీ నమూనాలో అవి ప్రభుత్వ భూములని తెలుస్తోంది. ఇక్కడ ఎకరా కొన్ని లక్షలు పలుకుతోంది.
రాళ్లు పీకే దమ్ముందా?
కమలాపురం మండలంలో భూ అక్రమణలు గుర్తించేందుకు ఇటీవల తుగకపల్లెకు తహశీల్దారు వెళ్లారు. భూముల దగ్గరకు వెళుతుండగా.. ఆయనను వైసీపీ నాయకులు కొందరు మధ్యలోనే అడ్డుకున్నారు. ‘రాళ్లు పీకే దమ్ము నీకుందా?’ అంటూ ఆయనను తీవ్రస్వరంతో హెచ్చరించారు. ‘‘అధికారం మాది.. మా అనుమతి లేకుండా గ్రామంలోకి వస్తావా?’’ అంటూ ముందుకెళ్లకుండా అడ్డంగా నిలబడ్డారు. చేసేది లేక తహసీల్దార్ వెనుదిరిగారు. ఈ మండలం పరిధిలోనే భారతీ సిమెంటు పరిశ్రమ ఉంది. కడప నగర శివారులో కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఎలకా్ట్రనిక్ వస్తు తయారి పరిశ్రమ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. దీంతో భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. పారిశ్రామికవాడకు కేవలం 10-15 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వానికి రెండు సర్వే నంబర్లలో 536 ఎకరాలు ఉండగా, ఇప్పటికే 100-150 ఎకరాలను ఆక్రమించేశారు. వాటికి వేసిన కంచెలు తొలగించకుండా.. ఎక్కడికక్కడ రెవిన్యూ అధికారులకు కీలక నాయకులు ఫోన్లు చేసి కట్టడి చేస్తున్నట్టు తెలిసింది.
దందాలు.. దౌర్జన్యాలు..
కమలాపురం మండలం ఎల్లారెడ్డిపల్లి రెవిన్యూ గ్రామ పరిధిలో నల్లింగాయపల్లి సమీపంలో సర్వే నంబరు 7 పరిధిలో 379.64 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఎకరం సుమారుగా రూ.5-10 లక్షలు పలుకుతోంది. అందులో సాగు యోగ్యమైన 135.80 ఎకరాలను గతంలో అసైన్మెంట్ కమిటీ ఆమోదం మేరకు భూమి లేని పేదలకు డీకేటీ పట్టాలు ఇచ్చారు. ఇంకా 243.84 ఎకరాలు మిగిలే ఉంది. ఓ దిగువ స్థాయి రెవిన్యూ అధికారి సహకారంతో ఇందులో ఏకంగా వంద ఎకరాలకు పైగా ఆన్‌లైన్లో రికార్డులు మార్చేసి, సబ్ డివిజన్ చేసి ఫారం-1బీ జారీ చేశారు. వారసత్వంగా అనుభవంలో ఉన్నట్లు రెవిన్యూ అన్‌లైన్ రికార్డుల్లో నమోదు చేశారు.
కొండాపురం మండలం మురగంపల్లి రెవిన్యూ గ్రామం సర్వే నంబర్-1 పరిధిలో 63.61 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. రెవిన్యూ రికార్డుల్లో రిజర్వు ఫారెస్టు అని ఉంది. ఈ భూములు మురగంపల్లె, సిరిగేపల్లి, దొబ్బుడపల్లి, కొత్తపల్లి, టీ.కోడూరు తదితర గ్రామాలకు పచ్చికబైలుగా ఉన్నాయి. ఈ భూమిని అధికార నేతల అండతో కొందరు ఆక్రమించుకొని చెట్లు నరికేసి ఎక్స్‌కవేటర్‌తో చదును చేశారు. ఈ గ్రామానికి ఆనుకుని టీ.కోడూరు రెవిన్యూ గ్రామం సర్వే నంబరు 728లో దాదాపుగా 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రెవిన్యూ అధికారులే అంటున్నారు. ఇందులో కొంత ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.
మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం మాచుపల్లె రెవిన్యూ గ్రామం సర్వే నంబర్ 11లో 2,470.500 ఎకరాల అటవీ శాఖ భూములు ఉన్నాయి. సాగుకు పనికిరాని భూమి 1,470.5000 ఎకరాలు కాగా.. సాగు యోగ్యమైన భూమి 1,000 ఎకరాలు ఉందని ఆన్‌లైన్ చూపుతోంది. మైదుకూరు మండలం నంద్యాలంపేట సర్వే నంబర్లు 506-బీలో 38.940 ఎకరాలు, సర్వే నంబరు 507లో 267.5600 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఇందులో వందల ఎకరాలు కబ్జాకు గురైందని మైదుకూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ఆరోపించారు.
చర్యలు తీసుకుంటాం: పృథ్వితేజ్, సబ్ కలెక్టరు, కడప జిల్లా
ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణపై విచారణ చేయిస్తాం. కబ్జాకు గురైనట్లు తేలితే భూమి స్వాఽధీనం చేసుకోవడంతో పాటు ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
