కాపునేస్తంతో ప్రభుత్వం కొత్త మోసం

ABN , First Publish Date - 2020-06-26T10:14:35+05:30 IST

కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, కాపు నేస్తం పేరుతో జగన్‌ ప్రభుత్వం మోసపూరిత

కాపునేస్తంతో ప్రభుత్వం కొత్త మోసం

టీడీపీతోనే కాపులకు న్యాయం

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌


కడప (నాగరాజుపేట), జూన్‌ 25 : కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, కాపు నేస్తం పేరుతో జగన్‌ ప్రభుత్వం మోసపూరిత పథకానికి కొత్త తెరలేపిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ ఆరోపించారు. స్థానిక హరిటవర్స్‌లో గురువారం ఏర్పాటు అయిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడ్డగోలు నిబంధనలు పెట్టి ఇచ్చే రూ.15 వేలు కూడా 25 లక్షల మంది మహిళల్లో కేవలం రాష్ట్రవ్యాప్తంగా 2,35,873 మందికి మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. కాపుల అభివృద్ధికి అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి చైర్మన్‌ను కూడా నియమించారని గుర్తు చేశారు. కార్పొరేషన్‌ ద్వారా యువతకు అందాల్సిన 45 వేల రుణాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. కాపులకు నికరంగా రూ.401 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చి రూ.1600 కోట్ల గత ఏడాది ఎగనామం పెట్టిందని ఆరోపించారు. ఉన్న 5 శాతం రిజర్వేషన్‌ రద్దు చేసిన పాపం ఈ ప్రభుత్వానిదేనన్నారు.


కుల, మత ప్రస్తావన లేకుండా కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.3100 కోట్లు టీడీపీ హయాంలో ఖర్చు చేసి పథకాలు అందరికీ అందజేశారన్నారు. ఉన్నత విద్యాదీవెన ద్వారా శిక్షణకు రూ.28 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి నాగరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుభరోసా వంటి పథకాలు కాపులకు దూరం చేసిందన్నారు. న్యాయం చేస్తామంటూనే రిజర్వేషన్లు రద్దు చేసిందని తెలిపారు. ఏడాదిగా ఒక్క రుణం కూడా మంజూరు చేయలేదన్నారు. ఏడాదిలో కాపులకు చేసిందేమీ లేదన్నారు. సమావేశంలో బలిజ సంఘం నాయకులు మిరియాల నరసింహులు, దండు అనిల్‌, ఎస్వీ రఘు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-26T10:14:35+05:30 IST