పైసలకోసం.. చంపేశారు!
ABN , First Publish Date - 2020-12-01T06:09:31+05:30 IST
పండు ముదుసలిని బతికుండగానే రికార్డుల్లో చంపేశారు. ఆమె కొడుకూ చనిపోయినట్టు రికార్డుల్లోకి ఎక్కించారు. కోడలికి వితంతు పింఛను ఇస్తున్నారు.
పండు ముదుసలిని బతికుండగానే రికార్డుల్లో చంపేశారు. ఆమె కొడుకూ చనిపోయినట్టు రికార్డుల్లోకి ఎక్కించారు. కోడలికి వితంతు పింఛను ఇస్తున్నారు. ఆ పింఛనులో నెలనెల కొంత తీసుకుంటున్నారు. వివరాలిలా.. లక్కిరెడ్డిపల్లె మండలం దప్పేపల్లె పరిధిలోని కొండవాండ్లపల్లెకు చెందిన షేక్ మదీనాబీ(85)కి వితంతు పింఛన వచ్చేది. ఆమెకు కొంతకాలంగా పింఛన రావడం లేదు. ఆమె స్థానంలో పెద్దకోడలికి పింఛను ఇస్తున్నారు. దీనిపై ఆమె ఆరా తీయగా బతికుండగానే రికార్డుల్లో మదీనాబీ చనిపోయినట్టు నమోదు చేశారని తెలిసింది. అలాగే ఆమె కొడుకు బతికి ఉన్నా చనిపోయినట్టు నమోదు చేసి కోడలికి పింఛను మంజూరు చేశారు. ఈ వ్యవహారంపై సోమవారం బాధితురాలిని తీసుకుని సీపీఐ రాయచోటి నియోజకవర్గ సహాయ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు లక్కిరెడ్డిపల్లె ఎంపీడీవో కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ తల్లీకొడుకు బతికుండగానే డెతసర్టిఫికెట్లు ఇచ్చి కోడలికి పింఛన మంజూరు చేశారని, పింఛన్లలో నెలనెలా అధికారులు మామూళ్లకు అలవాటు పడి ఇలాంటి అక్రమాలు ఎన్నో చేస్తున్నారని ఆరోపించారు. రద్దు అయిన వృద్ధురాలి పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఎంపీడీవో వీరరాఘవరెడ్డిని వివరణ కోరగా.. పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని అన్నారు.
- లక్కిరెడ్డిపల్లె