ఉపాధి లాక్‌.. ఆదాయం డౌన్‌

ABN , First Publish Date - 2020-05-13T08:03:01+05:30 IST

కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు నేటితో యాభై రోజులు. కరోనా పుణ్యమా అంటూ అన్ని రంగాలు కుదేలయ్యాయి.

ఉపాధి లాక్‌.. ఆదాయం డౌన్‌

నేటికి 50 రోజులు

కుప్పకూలిన నిర్మాణ, వ్యాపార రంగాలు

మూగబోయిన మగ్గాల చప్పుడు

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

కరోనా సృష్టించిన ఆర్థిక కల్లోలం


కిటకిటలాడే దుకాణాలు మూతపడ్డాయి. కళకళలాడే వీధులు వెలవెలబోయాయి. ఉత్పత్తికోసం స్వేదం చిమ్మే కర్మాగారాలు మూగబోయాయి. రాళ్లెత్తే కూలీలేకాదు నిర్మాణాలు సాగించే కాంట్రాక్టర్లు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రయాణికులను చేరవేసే ఆటోలు, బస్సులు రోడ్డెక్కలేదు. మరమగ్గాల చప్పుడు లేదు. పనిలేదు. పరిశ్రమ లేదు. డబ్బు లేదు. పేదలకు ఆకలి తీరే మార్గం లేదు. పెద్దలకు సంపాదన పెరిగే దారి లేదు. కరోనా కారణంగా జిల్లాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చింది. 50 రోజుల లాక్‌డౌన్‌ జిల్లాపై చేసిన ఆర్థిక గాయంపై ప్రత్యేక కథనం.


కడప, మే 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు నేటితో యాభై రోజులు. కరోనా పుణ్యమా అంటూ అన్ని రంగాలు కుదేలయ్యాయి. పనులు లేక ఉపాధికి ‘లాక్‌’ పడి.. ఆదాయం ‘డౌన్‌’ కావడం వల్ల కూలీలు, కార్మికులు, ఆటో కార్మికులు, చేనేత కార్మికులు ఇలా ఆయా రంగాలపై ఆధారపడ్డ శ్రామిక జనం పస్తులతో కాలం గడపాల్సి వస్తోంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వివిధ రంగాల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా భారీగా గండి పడింది.


మూగబోయిన చేనేత మగ్గం

జిల్లాలో మాధవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైలవరం, బద్వేలు, రాజంపేట, పుల్లంపేట, మైదుకూరు, సింహాద్రిపురం, వల్లూరు ప్రాంతాల్లో 11,947 మంది మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వస్త్రాలు ఉత్పత్తి చేస్తూ కుటుంబాలను పోషించుంకుంటున్నారు. భార్య, భర్త కష్టపడితే రోజుకు వచ్చే రాబడి రూ.500-700లకు మించదు. లాక్‌డౌన్‌ వల్ల 50 రోజులుగా మగ్గాలు అటకెక్కాయి. పనిలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక.. చేనేత కార్మికులు అర్ధాకలితో  జీవనం సాగిస్తున్నారు. రోజుకు రూ.85 లక్షల ప్రకారం లాక్‌డౌన్‌ కాలంలో రూ.45-50 కోట్లు కూలీ రూపంలో చేనేతలు నష్టపోయినట్లు అంచనా.


కుప్పకూలిన నిర్మాణ రంగం

జిల్లాలో భవన నిర్మాణరంగంపై ఆధారపడి 1.75 లక్షల కుటుంబాలు జీనవం సాగిస్తున్నాయి. కడప, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, పులివెందుల పట్టణాల్లో భవన, ఇతర నిర్మాణాలు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆ రంగంపై ఆధారపడిన కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయి. తొలి పదిపదైదు రోజులు ఎలాగో కాలం గడిపేశారు. ఆ తరువాత కష్టాలు తీవ్రమయ్యాయి. ఒక్కో కార్మికుడికి రోజు కూలీ రూ.350 ప్రకారం లెక్కించినా లాక్‌డౌన్‌ కాలంలో రోజుకు రూ.6.15 కోట్లు చొప్పున సుమారు రూ.300 కోట్లకుపైగా కోల్పోవాల్సి వచ్చిందని కార్మికశాఖ అధికారి ఒకరు పేర్కొనడం కొసమెరుపు. వీరితో పాటు ఆటో రంగంపై ఆధారపడిన కార్మికులు దాదాపుగా 25 వేల మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయారు.


గట్టెక్కేదెలా..?

కరోనా కల్లోలంతో వ్యాపార, వాణిజ్య రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. చిన్న, మధ్య తరహా వ్యాపారులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. జిల్లాలో 76,200 వ్యాపార సంస్థలు ఉన్నాయి. అందులో 55 వేలకుపైగా కిరాణా, ఎలక్ర్టికల్‌, వస్త్రాలు, సిమెంట్‌, ఐరన్‌, ఎరువులు, విత్తనాలు, బంగారు వంటి దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దుకాణం రోజుకు సగటున రూ.10-25 వేలు, కొన్ని దుకాణాల ద్వారా రూ.50 వేల నుంచి రూ.లక్ష వ్యాపారాలు జరిగేవి. 50 రోజుల్లో రూ.550 కోట్ల నుంచి రూ.700 కోట్లకుపైగా లావాదేవీలు ఆగిపోయినట్లు ఇండస్ట్రీస్‌ అండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకుడు ఒకరు తెలిపారు. తద్వారా జీఎస్‌టీ రూపంలో ప్రభుత్వం ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. పరిశ్రమలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు సరేసరి.


ప్రభుత్వ ఖజానాకూ భారీగా గండి

కడప, ప్రొద్దుటూరు జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల పరిధిలో 18 సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులు ఉన్నాయి. గతంలో రోజుకు 350-400లకు పైగా డాక్యుమెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ జరిగేది. తద్వారా రూ.90 లక్షల నుంచి కోటి ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌ వల్ల రూ.45కోట్లు కోల్పోవాల్సి వచ్చింది.


గనుల శాఖ జిల్లాలో 153 మైనింగ్‌ కేంద్రాలకు అనుమతి ఇచ్చింది. నాపరాళ్లు 69, డోలామైట్‌ 12, బెరైటీస్‌ 15, గ్రానైట్‌ 26, రోడ్‌మెటల్‌ మైనింగ్‌ 31 ఉన్నాయి. వాటి నుంచి రోజుకు సరాసరి రూ.కోటి చొప్పున రూ.50 కోట్లు కోల్పోయింది.

రోడ్డు రవాణా శాఖ పరిధిలో డీటీసీ 1, ఆర్‌టీవో 2, ఎంవీఐ ఆఫీసులు 4 ఉన్నాయి. వాటి పరిధిలో రోజుకు 200-250 వాహన రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఆ శాఖ ఆదాయం రూ.36 కోట్లు నష్టపోయినట్లు అధికారులు తెలిపారు.

ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబీషన్‌ శాఖ పర్యవేక్షణలో జిల్లాలో 205 మద్యం షాపులు, 30 బార్లు ఉన్నాయి. గతంలో రోజు 6 వేల కేసులు లిక్కరు, బీరు అమ్మేవారు. లాక్‌డౌన్‌ వల్ల 40 రోజుల్లో రూ.80-100 కోట్లు వ్యాపారం ఆగిపోయి.. ఖజానాకు గండి పడింది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు మద్యం ధరలు 75 శాతం పెంచి మద్యంబాబుల జేబుకు చిల్లు పెట్టారు.


కడప రీజియన్‌ పరిధిలో 8 బస్‌డిపోలు, 845 బస్సులు ఉన్నాయి. బస్సులు రోజుకు 3 లక్షల కి.మీలు తిరుగుతూ 2.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేవి. లాక్‌డౌన్‌ వల్ల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రోజుకు రూ.1.15 కోట్లు చొప్పున రూ.50.75 కోట్లు రాబడి కోల్పోయామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.


స్టూడియో మూతపడ్డంతో రూ.లక్ష నష్టపోయా: కొమ్మినేని శివప్రసాద్‌, శివ స్టూడియో, రాజంపేట 

రాజంపేట పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నేను శివస్టూడియో పెట్టుకొని ఉన్నాను. నా వద్ద నలుగురు పనిచేస్తున్నారు. నెలన్నర రోజులుగా కరోనా లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్ల నాకు లక్ష రూపాయలు పైబడి నష్టం వాటిల్లింది. ప్రతిరోజూ వ్యక్తిగత ఫోటోలు తీసుకునేవారు, పెళ్లిళ్లు, పేరంటాలు ఇతరత్రా శుభకార్యాలు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఏమీ లేవు. నాతోపాటు నా వద్ద పనిచేసే నలుగురూ నెలన్నర రోజులుగా ఖాళీగా ఉన్నాం.


లాక్‌డౌన్‌తో రూ.10లక్షలు నష్టం:  అదునుకోట నరసింహులు, సాయిబాబా ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని, రైల్వేకోడూరు 

రైల్వేకోడూరులో సుమారు 8 ప్రింటింగ్‌ప్రె్‌సలు ఉన్నాయి. ప్రతి ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఐదుగురు సిబ్బంది పనిచేస్తుంటారు. పెళ్లి పత్రికలు, ఎన్నికల వాల్‌పోస్టర్లు, వ్యాపారాలకు సంబంధించిన బిల్‌బుక్కుల పనులు ప్రింటింగ్‌ ప్రెస్‌లో రోజూ ఉంటాయి. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో సుమారు రూ.10లక్షల వరకు వ్యాపారం జరిగి ఉండేది. కరోనా కారణంగా మొత్తం నష్టపోయాం. వ్యాపారం లేకపోగా కరెంటు బిల్లు, రూముబాడుగ, మిషన్‌ ఆపరేటర్‌, హెల్పర్లు.. ఇలా ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌కు రెండు లక్షలు ఖర్చు వచ్చింది. ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యుత్‌ బిల్లుల్లో వెసులుబాటు కల్పించాలి.


లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయాం: ఆర్‌వీ మురళీక్రిష్ణ, లావణ్య స్టీల్‌హౌస్‌, ప్రొద్దుటూరు

మా లావణ్య స్టీల్‌హౌస్‌ రెడ్‌జోన్‌ పరిధిలో ఉంది. దీంతో జనతా కర్ఫ్యూ మొదలు ఇప్పటి వరకు సుమారు 50 రోజులు షాపు తెరవలేదు. నెలకు రూ.8లక్షలు టర్నోవర్‌ ఉంటుంది. మా షాపులో నలుగురు పనోళ్లు ఉన్నారు. షాపు తెరిచే వీలులేక ఆదాయం లేదు. షాపు బాడుగ, కరెంట్‌ బిల్లు, పనివాళ్లకు జీతాలు చెల్లించాలి. ఇపుడున్న పరిస్థితిలో ఇవంతా భారంగా ఉంది. ఈ నష్టం నుంచి ఎప్పుడు బయటపడతామో తెలీదు.


పనిలేక చితికిపోయాం: దస్తగిరి, బేల్దారి, సుందరయ్యనగర్‌, ప్రొద్దుటూరు 

లాక్‌డౌన్‌ కారణంగా పనులకు పోయే వీలు లేదు. పనిలేక, కూలి డబ్బు రాక మా బతుకులు చితికిపోయాయి. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి మాది. ఈ పరిస్థితి మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కుటుంబ పోషణ కష్టమైంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. కొందరు దాతలు ముందుకొచ్చి నిత్యావసరాలు, కూరగాయలు అందిస్తున్నారు. వారి పుణ్యాన ఒక పూట భోజనం చేయగలుగుతున్నాం. ప్రభుత్వం మాలాంటి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి.


ఇళ్లు గడవడం కష్టంగా ఉంది : డి.సురేంద్ర, ఆటో డ్రైవర్‌, రాయచోటి

16 సంవత్సరాలుగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు డీజిల్‌, ఇతర ఖర్చులన్నీ పోను రూ.400 వరకు మిగిలేది. అయితే 45 రోజులుగా లాక్‌డౌన్‌ ఉండడంతో ఒక్కసారిగా సంపాదన నిలిచిపోయింది. దీంతో ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. 


Updated Date - 2020-05-13T08:03:01+05:30 IST