పోలీసుల వద్దకు చేరిననకిలీ వీసాల వివాదం
ABN , First Publish Date - 2020-02-08T10:12:19+05:30 IST
నకిలీ వీసాల వివాదం రాజంపేట పోలీసుల వద్దకు చేరింది. ఇందుకు సంబంధించి నిజామాదాబాద్ జిల్లాకు చెందిన ఎం.సాగర్ అనే వ్యక్తిపై

రాజంపేట టౌన్, ఫిబ్రవరి7 : నకిలీ వీసాల వివాదం రాజంపేట పోలీసుల వద్దకు చేరింది. ఇందుకు సంబంధించి నిజామాదాబాద్ జిల్లాకు చెందిన ఎం.సాగర్ అనే వ్యక్తిపై బాధితుల ఫిర్యాదు చేయడంతో రాజంపేట పట్టణ సీఐ శుభకుమార్ శుక్రవారం సాయంత్రం విచారణ చేశారు. వివరాల్లోకి వెళితే...
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎం.సాగర్ రాజంపేట, కోడూరు ప్రాంతాలలోని ట్రావెల్ ఏంజెట్లను పట్టుకొని ఈ వీసాల వ్యాపారం కొనసాగిస్తున్నాడు. సింగపూర్, మలేషియా, మస్కట్, కువైత్ ప్రాంతాలలో ఉద్యోగాలిస్తామని, నెలకు 25వేలు జీతం ఇస్తారని, జీతంతో పాటు భోజనం, రూము సౌకర్యం కల్పిస్తారని నమ్మబలికి ట్రావెల్ ఏంజెట్ల ద్వారా వీసాలు అమ్మేవాడు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.70వేలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేకోడూరుకు చెందిన వెంకటేష్, హరి, శేఖర్, నాగరాజు, మల్లి, సూరి తదితరులను ఆరు నెలల కిందట మలేషియా వీసా మీద పంపారు. అక్కడికి వెళ్లిన తరువాత వీరిని పోలీసులు పట్టుకున్నారు. మీ వీసాలు టూర్ వీసాలని.. వచ్చిన మూడు నెలల్లోపు వెళ్లిపోవాలని.. మీకు ఎవరు ఉద్యోగం ఇస్తారని చెప్పారంటూ వారిని వెనక్కి పంపించారు. దీంతో ఇంటికి చేరుకున్న బాధితులు తమకు వీసా ఇచ్చిన సాగర్‌పై రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సాగర్ ప్రస్తుతం రాజంపేటలో ఉంటూ ఈ వ్యాపారం చేస్తున్నాడని బాధితులు తెలిపారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని పట్టణ స్టేషన్‌లో విచారణ చేశారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ నకిలీ వీసాలతో చాలా మందిని ఇతర దేశాలకు పంపించడం.. వారు మోసపోవడం వంటి అంశాలపై కూడా పోలీసులు ఆరా తీశారు. కాగా బాధితులందరూ రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఈ కేసును డీఎస్పీ విచారణ కోసం పంపుతున్నట్లు సీఐ శుభకుమార్ తెలిపారు.