పక్కాగా పత్తి దోపిడీ..!

ABN , First Publish Date - 2020-12-11T05:16:38+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌ పంటగా 20 వేల హెక్టార్లలో తెల్లబంగారం పత్తి సాగు చేశారు.

పక్కాగా పత్తి దోపిడీ..!
మైలవరం మండలంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని లారీలో లోడ్‌ చేస్తున్న వ్యాపారులు

పల్లెల్లోనే దళారుల తిష్ట

క్వింటా రూ.4,800-5,200లకు మించి ఇవ్వని వైనం


మద్దతు ధర రూ.5,850 అందని ద్రాక్షే

తూకాల్లో మాయ

క్వింటాకు 8 కిలోలకు పైగా మోసం

చోద్యం చూస్తున్న మార్కెటింగ్‌ అధికారులు

ఆర్థికంగా నష్టపోతున్న అన్నదాతలు

సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌


అతివృష్టి వర్షాలకు పత్తి పంట నీటిపాలై రైతులు ఆర్థికంగా నష్టపోయారు. చేతికొచ్చిన అరకొర పత్తి దిగుబడులు అమ్మబోతే దళారులు, వ్యాపారులు కుమ్మక్కై దగా చేస్తున్నారు. తూకం, తేమ ముసుగులో మాయ చేస్తున్నారు. క్వింటాకు 6-8 కిలోలు అదనంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే వర్షాలు, వరదలకు చితికిన కష్టజీవులను మరింత కష్టాలు నష్టాల్లోకి నెట్టుతున్నారు. అంతేకాదు.. నాణ్యత లేదంటూ క్వింటా రూ.4,800-5,200లకు మించి కొనడం లేదు. మద్దతు ధర రూ.5,825 ప్రకటనలకే పరిమితం అయింది. దీనిని పట్టించుకోవాల్సిన మార్కెటింగ్‌ అధికారులు కొత్తచట్టం ప్రకారం తమ పరిధిలోకి రాదంటున్నారు. పత్తి కొనుగోళ్లలో దళారులు, వ్యాపారుల మోసాలపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ పంటగా 20 వేల హెక్టార్లలో తెల్లబంగారం పత్తి సాగు చేశారు. బోల్‌గార్డ్‌ (బీజీ-2) పత్తి వచ్చాక ఎకరాకు 12-15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. దీంతో రైతులు పత్తి సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది కూడా తెల్లబంగారం ఆదుకుంటుందనే ఆశతో ఎకరాకు రూ.35-40 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. చెట్టుకు 40-50 కాయలు చూసి కష్టాలు తీరుతాయని ఆనందించారు. పంట చేతికొస్తుందనుకుంటే నివర్‌ తుఫాన్‌ రూపంలో నిలువునా ముంచింది. తెల్లగా పగలాల్సిన కాయ నల్లబారి రాలిపోయింది. ఎకరాకు ఐదారు క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. ఆ పంటను అమ్మబోతే వ్యాపారులు, దళారులు కుమ్మకై దగా పర్వానికి తెర తీశారు.

తూకాల్లో ఇదో రకం దోపిడీ

రాజుపాలెం, మైలవరం, ఖాజీపేట, పెద్దముడియం తదితర మండలాల్లో వ్యాపారులే గ్రామాలకు వెళ్లి పత్తిని కొంటున్నారు. మార్కెటింగ్‌ శాఖ నిబంధనల ప్రకారం తూనికలు, కొలతలు శాఖ అధికారులు తనిఖీ చేసి సీలు వేసిన ఎలకా్ట్రనిక్‌ వేయింగ్‌ మిషన్‌తో పత్తి తూకాలు వేయాలి. కొందరు దళాలీ వ్యాపారులు ఏ అనుమతిలేని వేయింగ్‌ మిషన్లతో తూకాలు వేసుకుంటున్నారని రైతుల ఆరోపణ. 25-30 కిలోల పత్తి జల్ల (వెదురు గంప)లో వేసి తూకం చేస్తున్నారు. ముందు ఖాళీ జల్ల తూకం వేసి.. ఆ బరువును ఎలకా్ట్రనిక్‌ కాటాలో జీరో చేస్తారు. ఇక్కడే రైతు కళ్లగప్పి మోసం చేస్తున్నారు. వ్యాపారుల వద్ద నాలుగైదు జల్లలు ఉంటాయి. ఒకటి రెండు జల్లలు ఆరు కిలోలకు పైగా ఉంటే.. మిగిలినవి 4 కిలోలకు మించవు. రైతుకు ఆరు కిలోలు జల్ల చూపించి కాటాలో జీరో చేస్తారు. పత్తి తూకానికి మాత్రం నాలుగు కిలోల జల్లను వాడుతున్నారు. అంటే.. 25-30 కిలోలకు రెండు కిలోలు పత్తి అందనంగా తీసుకుంటున్నారు. ఈ లెక్కన క్వింటాకు 6-8 కిలోలు మోసం చేస్తున్నారు. అంతేకాదు.. తేమ పేరుతో క్వింటాకు 1.5 కిలోలు అదనంగా తీసుకుంటున్నారు. ఇంతటితో సంతృప్తి చెందకుండా ఒక జల్ల తూకం వేసినప్పుడల్లా లెక్క కోసం అరకిలో వరకు పత్తిని ఉండ (ముద్ద)గా చేసి పక్కన పెడతారు. ఆ పత్తి ఉండల్లో సగం వ్యాపారికే. ఈ రూపంలో క్వింటాకు మరో కిలో వరకు దోచేస్తున్నారు. అంటే.. జల్ల తూకం, తేమ శాతం, లెక్క ఉండల రూపాల్లో క్వింటాకు సగటున 8-10 కిలోలకు పైగా మోసం చేస్తున్నట్లు ప్రధాన ఆరోపణ. కనీస మద్దతు ధరతో పోలిస్తే ఒక క్వింటాకు రైతు రూ.500 నష్టపోతున్నారు.

సీసీఐ కొనుగోలు ఏదీ..?

ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధర రూ.5,850. ఇది రైతులకు అందని ద్రాక్షే. వర్షానికి తడిసిందనో.. తేమ శాతం అధికంగా ఉందనో.. నాణ్యత లేదనో.. ఇలా ఏవో కారణాలు చెప్పి క్వింటా రూ.4,800 నుంచి రూ.5,200లకు మించి కొనుగోలు చేయడం లేదు. ఇక్కడ కూడా క్వింటాకు రూ.500-1,000 మోసం చేస్తున్నారు. తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని దళారులు గుంటూరు, బళ్లారి మార్కెట్లల్లో విక్రయించి లాభపడుతున్నారు. పెట్టుబడికోసం రైతులకు ముందుగా వ్యాపారి నూటికి రూ.1.50 నుంచి రూ.2ల వడ్డీకి ఎకరాకు రూ.20 వేలు అప్పు ఇస్తున్నారు. దీంతో వారికే పత్తి అమ్మాల్సి వస్తుంది. మరొకరికి అమ్ముదామన్నా కొనేవారు ఉండరు. మద్దతు ధర లేనప్పుడు ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మద్దతు ధరకు ప్రభుత్వమే పత్తి కొనుగోలు చేయాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం. రైతులు మాత్రం వ్యాపారుల మాయాజాలంలో ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రొద్దుటూరు కేంద్రంగా సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


సీసీఐ కొనుగోలు కేంద్రం పెట్టాలి

- గుంజ కృష్ణయ్య, కౌలు రైతు, టంగలూరు గ్రామం, రాజుపాలెం మండలం

నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి వచ్చింది. అధిక వర్షాలకు పంట దెబ్బతింది. ఎకరాకు ఆరు క్వింటాళ్లు దిగుబడి కూడా రాలేదు. అమ్మబోతే వ్యాపారి రూ.4,800లకు అడుగుతున్నారు. పెట్టుబడి కూడా రాదు. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రం పెట్టి మద్దతు ధర రూ.5,850లకు కొనుగోలు చేసి ఆదుకోవాలి. 


మద్దతు ధరకు కొనాలి

- ఎస్‌.సుబ్బారెడ్డి, సంజీవనగర్‌, ప్రొద్దుటూరు మండలం

15 ఎకరాల్లో పత్తి సాగుచేసి రూ.2.80 లక్షలు పెట్టుబడి పెట్టాను. వర్షానికి భారీగా నష్టపోయాను. వచ్చిన అరకొర పంటకు గిట్టుబాటు ధర లేదు. వ్యాపారులు తూకాల్లో మోసాలు చేస్తున్నారు. రైతు బాగుపడేదెలా..? ఇప్పటికైనా సీసీఐ కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.


వ్యాపారులపై మా అజమాయిషి లేదు

- సుధాకర్‌, జేడీ, మార్కెటింగ్‌ శాఖ, కడప

నూతన వ్యవసాయ చట్టాల ప్రకారం రైతులు పండించే పంట దిగుబడులు ఎవరైనా కొనగోలు చేయవచ్చు. వారికి ఎలాంటి లైసెన్సు అవసరం లేదు. వారిపై మా అజమాయిషి కూడా లేదు. రైతు మార్కెట్‌కు వస్తేనే మార్కెటింగ్‌ శాఖ బాధ్యతగా తీసుకుంటుంది. గ్రామాల్లో వ్యాపారుల మోసాలపై రైతులు రాతపూర్వంగా ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే ఆయనే విచారించి చర్యలు తీసుకుంటారు.

Updated Date - 2020-12-11T05:16:38+05:30 IST