ఇప్పటికిప్పుడు ఊర్లు వదలం
ABN , First Publish Date - 2020-09-12T11:20:58+05:30 IST
ఇప్పటికిప్పుడు ఊర్లు ఖాళీ చేసి పిల్లా, పాపలు, గొడ్డు గోదతో ఎక్కడికెళ్లాలి? మాకు గడువు ఇవ్వాల్సిందే.

ఖాళీ చేయడానికి గడువు ఇవ్వాల్సిందే
తేల్చి చెప్పిన గండికోట నిర్వాసిత బాధితులు
16 టీఎంసీలు నిల్వ చేస్తాం : కలెక్టర్
రైతులతో మాట్లాడి ఒప్పిస్తాం : ఎంపీ, ఎమ్మెల్యే
కడప, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ‘ఇప్పటికిప్పుడు ఊర్లు ఖాళీ చేసి పిల్లా, పాపలు, గొడ్డు గోదతో ఎక్కడికెళ్లాలి? మాకు గడువు ఇవ్వాల్సిందే. అప్పట్లోగా పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించండి. ఇళ్లు నిర్మించి ఇవ్వండి. అప్పుడు మేమే స్వచ్ఛందంగా ఖాళీ చేస్తాం’ అని గండికోట నిర్వాసిత బాధితులు తేల్చి చెప్పారు. గండికోటలో పూర్తి స్థాయి సామర్థ్యం 26.85 టీఎంసీలు నిల్వ చేసే విషయంపై శుక్రవారం రాత్రి కలెక్టర్ హరికిరణ్ అధ్యక్షతన గండికోట ప్రధాన ముంపు గ్రామం తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితులతో చర్చలు జరిపారు. ఈ చర్చలకు ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరయ్యారు. రాత్రి 9గంటల దాకా కొనసాగిన చర్చలు ఫలప్రదం కాకుండానే అర్ధంతరంగా ముగిశాయి. సీఎం జగన్ రూ.900 కోట్లు ఇచ్చారని, తాళ్లప్రొద్దుటూరు ఎస్సీ, బీసీ కాలనీలను ఖాళీ చేస్తే కనీసం 16 టీఎంసీలు నిల్వ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఖాళీ చేస్తే నివాసం ఉండేందుకు తాత్కాలికంగా షెడ్డులు, గోడౌన్‌లు ఏర్పాటు చేస్తామని కావాలనే కొందరు విభేదాలు సృషిస్తున్నారని అన్నారు.
అయితే రైతులు కలుగజేసుకొని మాలో మాకు విభేదాలు సృష్టించకండి, పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించేదాకా ఊర్లు, ఇల్లు ఖాళీ చేయం.. ఊర్లు ముంచుతామంటే ఒప్పుకోం అంటూ బయటకు వెళ్లిపోయారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ తాళ్ల ప్రొద్దుటూరులోని సమస్యలను యుద్ధ ప్రాతిపదికన తీర్చి నీరు నిల్వ చేసేందుకు రైతులను ఒప్పిస్తామని అన్నారు. తనకు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కరోనా పాజిటివ్ రావడం వల్ల ఇన్నాళ్లు బాధితుల వద్దకు వెళ్లలేకపోయామన్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రతిఒక్కరికి ఆర్‌అండ్‌ఆర్ డబ్బులు పడేలా చూస్తామని ఆందోళన విరమించుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.