రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాలుడు మృతి
ABN , First Publish Date - 2020-12-02T04:49:18+05:30 IST
గోటూరు సమీపంలో సోమవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు గాయపడిన విషయం తెలిసిందే.

వల్లూరు, డిసెంబరు 1: గోటూరు సమీపంలో సోమవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు గాయపడిన విషయం తెలిసిందే. వారిలో ప్రదీప్ (17) అనే బాలుడి పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా ప్రదీప్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడని, తల్లిదండ్రులు బాలసుబ్బయ్య్య, సుబ్బనరసమ్మది చెన్నూరు మండలం రామనపల్లెగా పోలీసులు తెలిపారు.
గంజాయి పట్టివేత : ఒకరి అరెస్టు
పులివెందుల టౌన్, డిసెంబరు 1: పట్టణంలోని నగరిగుట్ట ఎస్టీ హాస్టల్ వెనుక 1.140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నగరిగుట్టకు చెందిన లోకేని కృష్ణయ్య, ప్రసాద్ అనే వ్యక్తులు కర్నూలు జిల్లా డోన్ నుంచి గంజాయిని అక్రమంగా పులివెందులకు తీసుకొచ్చి అమ్మేవారన్నారు. తమకు అందిన సమాచారం మేరకు నగరిగుట్టలోని ఎస్టీ హాస్టల్ వెనుక కృష్ణయ్య గంజాయి అమ్ముతుండగా అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న 1.140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కడప (క్రైం), డిసెంబరు 1 : కడప నగరం అల్మా్‌సపేటలోని ఓ భవన నిర్మాణంలో సెంట్రింగ్ పనిచేస్తున్న యువకుడికి కరెంటు వైరు తగిలి మృతి చెందినట్లు టూటౌన్ ఎస్‌ఐ జీవన్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. రామరాజుపల్లెకు చెందిన మద్దెల సుబ్బరాయుడు(24) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అల్మా్‌సపేటలో ఓ భవనానికి సంబంధించి సెంట్రింగ్ పనిచేస్తుండగా కరెంటు వైరు తగిలి మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ
కడప (క్రైం), డిసెంబరు 1 : కడప నగరం పాతబస్టాండు సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో హుండీని గుర్తు తెలియని దొంగలు చోరీ చేసినట్లు వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. సీఐ వివరాల మేరకు ఆంజనేయస్వామి దేవాలయం బయట ఉన్న చిన్న హుండీలో రూ.5 వేలు కానుకలు ఉన్నాయని, అయితే గుర్తు తెలియని దొంగలు హుండీని అపహరించినట్లు తెలిపారు. ఆలయ పూజారి మయూ రం గోకుల్‌బట్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
సికెదిన్నె, డిసెంబరు 1: చింతకొమ్మదిన్నె మండలం తాడిగొట్ల గ్రామానికి చెందిన పల్లపోతుల వెంకటమానస (24) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు వారి బంధువులు తెలిపారు. బంధువుల సమాచారం మేరకు ఆర్టీపీపీకి చెందిన మానస తాడిగొట్లకు చెందిన వెంకటశివారెడ్డిలు ప్రేమించుకుని పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నారు. అయితే వీరి సంసారం హాయిగా సాగిపోతోంది. ఇంతలో ఏమైందో కానీ మంగళవారం సాయంత్రం భర్తకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు తెలిపి భర్త వచ్చేలోపే ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలిపారు.