అవధానులకు పుట్టినిల్లు

ABN , First Publish Date - 2020-12-01T06:06:20+05:30 IST

అవఽధానం తెలుగువారికే సొంతమని అలాంటి అవధానులకు కడప జిల్లా పుట్టినిల్లని మాజేటి వెంకటనాగలక్ష్మీప్రసాద్‌ పేర్కొన్నారు.

అవధానులకు పుట్టినిల్లు
సీపీబ్రౌన గ్రంథాలయం రజతోత్సవాలలో భాగంగా శతావధాని ఆముదాల మురళిని సత్కరిస్తున్న దృశ్యం

మాజేటి వెంకట నాగలక్ష్మీప్రసాద్‌

అలరించిన ఆముదాల మురళి అవధానం

ముగిసిన సీసీ బ్రౌన గ్రంథాలయ రజతోత్సవాలు

కడప(మారుతీనగర్‌), నవంబరు 30: అవఽధానం తెలుగువారికే సొంతమని అలాంటి అవధానులకు కడప జిల్లా పుట్టినిల్లని మాజేటి వెంకటనాగలక్ష్మీప్రసాద్‌ పేర్కొన్నారు. సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండురోజులపాటు రజతోత్సవాలు జరిగాయి. రెండోరోజైన సోమవారం తిరుపతికి చెందిన శతావధాని ఆముదాల మురళిచే అష్టావధానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధాని మాజేటి వెంకటనాగలక్ష్మీప్రసాద్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. తిరుపతి వెంకటకవుల తర్వాత కడపజిల్లాకు చెందిన పలువురు దేశవ్యాప్తంగా అవధానాలు నిర్వహించారన్నారు. అనంతరం నిర్వహించిన అవధానంలో భాగంగా జనము, ధనము, మనము, వనము అనే పదాలను ఇచ్చి సీపీ బ్రౌన్‌, డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాసి్త్ర తెలుగుకు చేసిన సేవను స్వేచ్ఛాఛందస్సులో చెప్పమని పృచ్ఛకులు అవధాని ఆముదాల మురళిని కోరారు. ‘జనమంతా సంతోషించేలా ధనాన్ని వెచ్చిస్తూ, స్వీకరిస్తూ సాహిత్య వనంలోని వేల కావ్యపుష్పాలు పరిమళించేలా కవాతాసంపదను రక్షించారు’ అని అవధాని రమ్యంగా చంపకమాల వృత్తంలో పూరించారు. అనంతరం కడప ఘనతను స్వేచ్ఛాఛందస్సులో వర్ణించమని కోరారు. ఆముదాల మురళి మత్తేభవృత్తంలో ‘అవధానులకు కడపజిల్లా ఆటపట్త్టె, కావ్యాలకు పట్టుగొమ్మ్తె, ప్రజల హృదయాలు గెలుచుకున్న నేతలకు నిలయమై ప్రపంచమంతటా కొనియాడబడుతున్నది’ అంటూ సమర్థవంతంగా పూరించారు. భూతపురి గోపాలకృష్ణ శాసి్త్ర, విశ్రాంత తెలుగు పండితులు యాడికి శివప్రభాకరరెడ్డి, చింతకుంట శివారెడ్డి, ఎన్‌.రమేశరావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.ఈశ్వరరెడ్డి, తెలుగు ఉపన్యాసకులు పెద్దిరెడ్డి నీలవేణి తదితరులు పృచ్ఛకులుగా వ్యవహరించారు. ఈ అవధానం సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం బాధ్యులు డాక్టర్‌ మూల మల్లికార్జునరెడ్డి పర్యవేక్షణలో జరిగింది. నిర్వాహకులు అవధాని ఆముదాల మురళిని, పృచ్ఛకులను ఘనంగా సత్కరించారు.

సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం అభివృద్ధికి నిరంతర కృషి

సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం అభివృద్ధికి నిరంతర కృషి చేస్తామని వైవీయూ కులసచివులు ఆచార్య దుర్భాక విజయరాఘవప్రసాద్‌ అన్నారు. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం  రజతోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరై మాట్లాడారు. సాహితీవేత్తలను, సాహితీప్రియులను, కడప పట్టణ ప్రజలను ఈ ఉత్సవాలు ఎంతగానో ఆహ్లాద పరిచాయన్నారు. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ చేసిన అమూల్యమైన సాహిత్యసేవకు తెలుగునేల రుణపడిందన్నారు.  కార్యక్రమానికి ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి అద్యక్షత వహించి మాట్లాడారు. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో ప్రత్యేకంగా బ్రౌన్‌ పరిశోధన విభాగం ఏర్పాటు చేసి, బ్రౌన్‌కు చెందిన రచనలు, లేఖలు, సాహిత్యం, ఒకేచోట చేర్చాలన్నారు. గౌరవ అతిథి ఆచార్య పి.పద్మ మాట్లాడుతూ బ్రౌన్‌ గొప్ప మానవతావాది అని అందువల్లే శతాబ్దాలు దాటినా ఆయన అందరి హృదయాలలో నిలిచే ఉన్నారన్నారు. కార్యక్రమంలో సీపీ బ్రౌన్‌ గ్రంఽథాలయ సలహామండలి సభ్యులు పోతురాజు వెంకటసుబ్బన్న, ప్రముఖ అవధాని నరాల రామారెడ్డి, సీకే సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T06:06:20+05:30 IST