ప్రైవేటు వైద్యులకు కరోనా భయం

ABN , First Publish Date - 2020-08-01T11:45:36+05:30 IST

ప్రైవేటు వైద్యులకు కరోనా భయం పట్టుకుంది. వైద్య సేవల కోసం వచ్చే రోగుల్లో ఎవరికి పాజిటివ్‌ ఉందో అన్న భయం వైద్యులను వెంటాడుతోంది.

ప్రైవేటు వైద్యులకు కరోనా భయం

వైరస్‌ బారిన దాదాపు 80 మంది వైద్యులు..?

కడపలోనే 20 మందికి..?

ఓపీ సంఖ్య సగానికి తగ్గింపు 

వైద్యసేవలందక జనం అవస్థలు


(కడప-ఆంధ్రజ్యోతి): ప్రైవేటు వైద్యులకు కరోనా భయం పట్టుకుంది. వైద్య సేవల కోసం వచ్చే రోగుల్లో ఎవరికి పాజిటివ్‌ ఉందో అన్న భయం వైద్యులను వెంటాడుతోంది. ఇప్పటికే తోటి సహచర వైద్యులు కరోనా బారిన పడడంతో వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాలో 50-80 మంది వైద్యులు కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. ఒక్క కడప నగరంలోనే 20 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. దీంతో ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతో కొందరు వైద్యులు ఆసుపత్రులను తాత్కాలికంగా మూసివేస్తే.. మరికొందరు ఓపీ సంఖ్య తగ్గించుకుని మధ్యాహ్నం వరకే ఆసుపత్రులు తెరుస్తున్నారు. 


జిల్లాలో 300కు పైగా ప్రైవేటు వైద్యశాలలు ఉన్నాయి. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, బద్వేలు ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు కార్పొరేట్‌ స్థాయి వైద్యశాలలు ఉన్నాయి. వీటిలో కొన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండగా.. మరికొందరు ఎంబీబీఎస్‌, ఫిజీషియన్‌, సర్జన్లు సొంతంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు వైద్యశాలలన్నీ వైద్యసేవల కోసం వచ్చిన వారితో కిక్కిరిసిపోయేవి. అయితే కరోనా వైర్‌సతో ప్రైవేటు ఆసుపత్రుల్లో సీన్‌ మారిపోయింది. కరోనాను అడ్డుకునేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. అప్పట్లో ప్రైవేటు వైద్యశాలలు మూతబడ్డాయి. అయితే కొన్ని సడలింపుల తరువాత తిరిగి ప్రారంభమయ్యాయి. అనారోగ్య కారణాలతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో పలువురు డాక్టర్లు కరోనా బారినపడ్డారు. కడపలోనే పేరొందిన సర్జన్లు, కార్డియాలజి్‌స్టలు, నెప్రాలజిస్ట్‌, ఫిజిషియన్లు.. ఇలా 20 మంది వరకూ వైరస్‌ బారిన పడినట్లు సమాచారం.


దీంతో మిగతా వైద్యుల్లో భయం నెలకొంది. ఆసుపత్రులు తెరిచి వైద్యసేవలు, ఓపీ పరీక్షించకుంటే ఆసుపత్రి నిర్వహణ, సిబ్బంది జీతాలు ఇవ్వడం కష్టమని భావించి కొందరు పరిమిత సంఖ్యలోనే పేషంట్లను పరీక్షిస్తుంటే .. మరికొందరు పూర్తిగా మూసేశారు. కడపలో 8 సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ ఉండగా కార్డియాలజిస్ట్‌, సర్జన్‌, 10 మంది ఫిజిషియన్‌, సర్జన్లు 15 మంది, ఎంబీబీఎ్‌సలు 10 మంది, గైనకాలజి్‌స్టలు 30 మంది వరకూ ఉన్నారు. వీరిలో కొంతమంది సొంతంగా క్లినిక్‌లు నిర్వహిస్తుంటారు. అవి 30 దాకా ఉంటాయి. వీటితో పాటు చిన్న చితకా కలుపుకుని మరో 40 ఉండవచ్చు. అయితే కరోనా కారణంగా పేరొందిన వైద్యులతో పాటు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో కూడా పేషంట్లను చూడడం తగ్గించారు. పేరొందిన డాక్టర్లు గతంలో రోజూ 300 మందిని పరీక్షించేవారు. అలాంటి వారు ఇప్పుడు వంద, 120 మందికి లోపే ఓపీ చూస్తున్నారు. ఓ ఫిజిషియన్‌ కోసం జిల్లావాసులతో పాటు పొరుగు జిల్లాల వారూ చికిత్స కోసం వస్తుంటారు. ఒకప్పుడు 300 ఉన్న ఓపీ సంఖ్య ఇప్పుడు వందకే పరిమితం చేశారు. మధ్యాహ్నం వరకే ఆసుపత్రుల్లో పేషంట్లను పరీక్షిస్తున్నారు.


సీజనల్‌ వ్యాధులపై ప్రభావం

ఇప్పుడంతా సీజనల్‌ వ్యాధుల కాలం. జలుబు, దగ్గు, జ్వరం సహజంగానే వస్తుంటాయి. కరోనాకు కూడా దాదాపు అవే లక్షణాలు ఉంటుండడంతో అలాంటి కేసులు చూడాలంటేనే వైద్యులు జంకుతున్నారు. కరోనా టెస్టు చేయించుకుని వస్తే వైద్య సేవలందిస్తామని చెబుతుండడంతో సాధారణ పేషంట్లు పరేషాన్‌కు గురవుతున్నారు. ముఖ్యంగా కన్ను, ముక్కు గొంతుకు సంబంధించిన డాక్టర్లు అయితే మరీ భయపడిపోతున్నారు. రోగులను దగ్గరకు తీసుకుని పరీక్షించాల్సి రావడంతో ఎక్కడ కరోనా అంటుకుంటుందోనన్న భయం వారిలో నెలకొంది. కొందరు పీపీఈలను ధరించి పరీక్షిస్తున్నారు. ఓపీ సంఖ్యను కుదించేయడంతో అందరికీ వైద్య సేవలందక జనం ఇబ్బందులు పడుతున్నారు. రిమ్స్‌కు వెళదామంటే అక్కడ కొవిడ్‌ సెంటరు ఉండడంతో ఆ భయంతో చాలా మంది అటు వైపు వెళ్లడం లేదు. కరోనాకు ముందు రోజూ 1400 మంది ఓపీ ఉండగా, ఇప్పుడు 350కి పడిపోయింది. అటు రిమ్స్‌ వెళ్లలేక, ఇటు ప్రైవేటు వైద్యులు చూడక జనం ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2020-08-01T11:45:36+05:30 IST