కరోనా కట్టడికి సహకరించాలి

ABN , First Publish Date - 2020-06-19T06:34:07+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలందరూ సహ కరించాలని

కరోనా కట్టడికి సహకరించాలి

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 18 : లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలందరూ సహ కరించాలని డీఎస్పీ సుధాకర్‌ లోసారి సూచించారు. గు రువారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు కూడళ్లలో  సీఐలు నరసింహారెడ్డి, సుబ్బారావులతో కలిసి కరోనా వ్యాప్తి నివారణపై డీఎస్పీ విస్తృత ప్రచారం కల్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటికి రావద్దని అత్యవసరమైతేనే రావాలని, వచ్చేటప్పుడు మాస్క్‌లు ధరించాలని, ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని అప్పు డే కరోనా కట్టడి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

 

ఆటోలతో విసృత ప్రచారం 

కరోనా వైరస్‌ నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలు ప్రజలకు అవగాహన కలిగించే విధంగా డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు ఆటోల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. మైక్‌ ద్వారా కరోనా నివారణ చర్యలను ప్రజలకు వివరించారు. అదే విధంగా త్రీటౌన్‌ సీఐ గంటా సుబ్బారావు తమ సర్కిల్‌ పరిధిలోని 3, 4, 5 వార్డు సచివాలయాల్లో అక్కడి సిబ్బందితో సమావేశమై వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు మాస్క్‌ ధరించి ఉంటేనే కార్యాలయంలోకి అనుమతించాలని అదేశించారు. శానిటైజర్‌ వాడాలని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


మాస్క్‌ లేకుండా వస్తే చర్యలు తప్పవు

ప్రొద్దుటూరు:  ప్రజలు మాస్క్‌లు లేకుండా బయటకు వస్తే జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేసే పరిస్థితి ఉందని మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రాధ హెచ్చరించారు. మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం  ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ స్వచ్ఛందంగా కరోనా నివారణకు సహకరించాలన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఒకే రోజు 14 కేసులు ఒకే ప్రాంతంలో రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దుకాణాదారులు నోమాస్క్‌, నో ఎంట్రీ అని బోర్డు పెట్టుకోవాలన్నారు. వర్షాకాలంలో కరోనా ఎక్కువగా ప్రబలే అవకాశాలు ఉన్నాయని, అందరు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ప్రొద్దుటూరు మండలంలో ఇప్పటి వరకు 83 కేసులు వచ్చాయన్నారు. ఇందులో 43 మందిని డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు చండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు. 


మాస్క్‌ లేనిదే బయటకు రావద్దు

జమ్మలమడుగు రూరల్: మాస్క్‌ లేకుండా ఎవరూ బయటకు రాకూడదని జమ్మలమడుగు అర్బన్‌ సీఐ మధుసూదన్‌రావు  సూచించారు. గురువారం జమ్మలమడుగు పోలీసు స్టేషన్‌ ఆవరణలో స్థానికులతో కలిసి ఆయన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా కరోనా మాట విజృంభిస్తోందన్నారు. బయటకు వచ్చేటప్పుడు మాస్క్‌ ధరించి శానిటైజర్‌తో హ్యాండ్‌వాష్‌ చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-19T06:34:07+05:30 IST