-
-
Home » Andhra Pradesh » Kadapa » collector visit airport
-
ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములను పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-21T05:32:28+05:30 IST
కడప ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు సంబంధించి అవసరమైన భూములను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ శుక్రవారం పరిశీలించారు.

కడప(కలెక్టరేట్), నవంబరు 20: కడప ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు సంబంధించి అవసరమైన భూములను జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ శుక్రవారం పరిశీలించారు. కడప సబ్ కలెక్టర్ పృథ్వీతేజ్‌తో కలసి కడప విమానాశ్రయం విస్తరణ పనుల్లో భాగంగా ఆ ప్రాంతంలో భూములు కోల్పోతున్న చిన్నమాచుపల్లె, పాలెంపల్లె రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కడప విమానాశ్రయాన్ని మరింత విస్తరించడం జరుగుతుందన్నారు. అందుకోసం సుమారు 67 ఎకరాల భూములను రైతుల నుంచి సేకరిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాంతాలైన చెన్నూరు మండలంలోని చిన్నమాచుపల్లె రైతులకు చెందిన 20 ఎకరాలను, కడప రూరల్ పరిధిలోని పాలెంపల్లె రైతులకు చెందిన 47 ఎకరాల భూములను సేకరించడం జరుగు తుందన్నారు. ఇందుకోసం రైతుల నుంచి అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. అక్కడ భూముల విలువలను ప్రాథమికంగా అంచనా వేసేందుకు భూ యజమానులతో మాట్లాడడంతో పాటు వారి అభిప్రాయాలను సేకరించామని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కడప, చెన్నూరు మండలాల తహసీల్దార్లు శివరామిరెడ్డి, అనురాధ, సంబంధిత రెవెన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.