జగనన్నా.. మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి

ABN , First Publish Date - 2020-12-25T05:39:21+05:30 IST

ఆ పేద కుటుంబంలో బిడ్డపుట్టిన సంతోషం ఎన్నాల్లో నిలవలేదు. పుట్టిన కొడుకుకు తలసేమియా వ్యాధి ఉందని తెలిసి ఆ తల్లిదండ్రుల ఆశలు తల్లకిందులయ్యాయి. కూలిపని చేసుకునే తండ్రి తమ ఉద్ద ఉన్నవన్నీ ఊడ్చేసి రూ.17 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. ఇక చిన్నారికి ఆపరేషన చేస్తేనే బతికే పరిస్థితి.

జగనన్నా.. మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి
చిన్నారి మస్తాన వలికి రక్తమార్పిడి చేస్తున్న దృశ్యం

తలసేమియాతో మృత్యువు ముంగిట చిన్నారి

ఇప్పటికే రూ.17 లక్షల ఖర్చు

ఆపరేషనకు రూ.30 లక్షలు అవసరం

అంత స్థోమత లేక ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు

వేంపల్లె, డిసెంబరు 24: ఆ పేద కుటుంబంలో బిడ్డపుట్టిన సంతోషం ఎన్నాల్లో నిలవలేదు. పుట్టిన కొడుకుకు తలసేమియా వ్యాధి ఉందని తెలిసి ఆ తల్లిదండ్రుల ఆశలు తల్లకిందులయ్యాయి. కూలిపని చేసుకునే తండ్రి తమ ఉద్ద ఉన్నవన్నీ ఊడ్చేసి రూ.17 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. ఇక చిన్నారికి ఆపరేషన చేస్తేనే బతికే పరిస్థితి. దీంతో తల్లిదండ్రులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంభయంగా గడుపుతున్నారు. అన్నా జగనన్న.. మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి అంటూ వేడుకుంటున్నారు. వివరాలు ఇలా..

వేంపల్లె గరుగువీధికి చెందిన షేక్‌ అలిఅహ్మద్‌, మల్లిక దంపతులకు రెండు సంవత్సరాల మస్తాన వలి ఉన్నాడు. 11 నెలల వయసు నుంచి తరచూ ఒంటిలో రక్తం తగ్గి నీరసంగా ఉండడం, జ్వరం వస్తూ ఇబ్బంది పడుతున్నాడు. ఆస్పత్రికి వెళితే తలసేమియా అని తేల్చారు. తండ్రి బంగారు షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుమారుడి తలసేమియా వ్యాధికి చికిత్సకోసం ఇప్పటివరకు తల్లిదండ్రులు తమ వద్దనున్న డబ్బు, నగలు, ఇల్లు అమ్ముకొని సుమారు రూ.17లక్షల వరకు ఖర్చుచేసి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. 20 లేదా 30 రోజులకు ఒకసారి రక్తం ఎక్కిస్తుండడం వల్ల పిల్లాడు బతికి ఉన్నాడు. అయినా రోజురోజుకు మస్తాన వలి ఆరోగ్యం క్షీణిస్తోంది. కర్ణాటకలోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వారు ఆపరేషన చేస్తాం రూ.30లక్షలు అవుతుందని చెప్పారు. ఉన్నదంతా వైద్యానికే ఖర్చుచేసి కుటుంబ పోషణే భారంగా ఉన్న వారు బిడ్డను బతికించుకునేది ఎలా అని కుమిలిపోతున్నారు. సొంత నియోజకవర్గ శాసనసభ్యులు సీఎం వైఎస్‌ జగన జోక్యం చేసుకుని ఆపరేషన జరిగేలా చూస్తే తమ బిడ్డ ప్రాణం దక్కుతుందని అంటున్నారు.


మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి

- మస్తాన వలి తల్లిదండ్రులు అలి అహ్మద్‌, మల్లిక

జగనన్నా.. మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి. బిడ్డ పుట్టిన ఆనందం ఏమాత్రం లేకుండా పోయింది. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటివరకు ఉన్నదంతా వైద్యానికే ఖర్చు అయిపోయింది. మీరు జోక్యం చేసుకుంటేనే మా బిడ్డకు ఆపరేషన జరుగుతుంది. ప్రాణం దక్కుతుంది. ఆపరేషనకు ఆర్థిక సహాయం చేసి మా కుటుంబాన్ని నిలబెట్టండి.Updated Date - 2020-12-25T05:39:21+05:30 IST