ఎన్నాళ్లకెన్నాళ్లకో....

ABN , First Publish Date - 2020-05-11T11:27:46+05:30 IST

ఒకనాడు జీవనదిగా పేరుగాంచిన చెయ్యేరు కాలానుగుణంగా చుక్కనీరు లేక ఎడారిగా మారిపోయింది.

ఎన్నాళ్లకెన్నాళ్లకో....

చెయ్యేరులో జలకళ


రాజంపేట/నందలూరు, మే 10 : ఒకనాడు జీవనదిగా పేరుగాంచిన చెయ్యేరు కాలానుగుణంగా చుక్కనీరు లేక ఎడారిగా మారిపోయింది. ప్రస్తుతం అన్నమయ్య ప్రాజెక్టు నుంచి ప్రస్తుత వేసవి నీటి ఎద్దడి దృష్ట్యా 450 క్యూసెక్కుల నీటిని వదలడంతో ఎడారిగా వున్న చెయ్యేరు నీటితో కళకళలాడుతోంది. ఈనెల 5వ తేదీ అన్నమయ్య ప్రాజెక్టు 3వ గేటు నుంచి 450 క్యూసెక్కుల నీటిని అన్నమయ్య ప్రాజెక్టు అధికారులు కింది ప్రాంతాలకు వదిలారు. దీంతో చెయ్యేరు నదీ పరీవాహక ప్రాంతాలైన రాజంపేట మండలంలోని గుండ్లూరు, మదనగోపాలపురం, తాళ్లపాక, మందరం, అగ్రహారం, పులపత్తూరు, మందపల్లె, నందలూరు మండలంలోని నందలూరు, బగ్గిడిపల్లె, పాటూరు, ఇసుకపల్లె, లేబాక, టంగుటూరు, కుంపిణీపురం, ఓబిలి, ఇండ్లూరు, జట్టివారిపల్లె, నారాయణనెల్లూరు తదితర 100 గ్రామాల ప్రజలకు కొద్దిపాటి భూగర్భజలం అందనుంది.


ప్రస్తుతం అన్నమయ్య ప్రాజెక్టు 20 సంవత్సరాల కిందట చెయ్యేరు నదిపై ఎగువ ప్రాంతంలో కట్టడంతో దిగువ ప్రాంతాలకు తాగునీరు కూడా లభించని పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం వేసవిలో భూగర్భజలం పూర్తిగా లేకుండా పోయింది.గతంలో మోచెయ్యి లోతులోనే ఇసుక రేణువుల మధ్య చెయ్యేటిలో పుష్కలంగా లభించే నీరు నేడు 500 అడుగులకు బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో కొద్దిపాటి నీరు దిగువ ప్రాంతాలకు రావడంతో వేసవిలో కొద్దిగా భూగర్భజలం పెరిగి తాగునీరు లభించే అవకాశముంది. 

Updated Date - 2020-05-11T11:27:46+05:30 IST