శ్మశానవాటికకు దారిచూపండయ్యా..?
ABN , First Publish Date - 2020-09-12T11:18:34+05:30 IST
శ్మశానవాటికకు దారి చూపండయ్యా.. అని నగర పరిధిలోని 36, 37వ డివిజన్లకు చెందిన ప్రజలు అధికారులను ..

కడప(చిన్నచౌకు), సెప్టెంబరు 11: శ్మశానవాటికకు దారి చూపండయ్యా.. అని నగర పరిధిలోని 36, 37వ డివిజన్లకు చెందిన ప్రజలు అధికారులను వేడుకొంటున్నారు. శుక్రవారం సదరు ప్రాంతానికి చెందిన ఒకరు మృతి చెందడంతో చెట్లు, పుట్టలు ఎక్కుతూ.. దిగుతూ.. పడుతూ.. లేస్తూ శ్మశానానికి వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. అల్మా్‌సపేట, వక్కలపేట, కాపుగడ్డ, పద్మశాలి వీధి, గూడూరు ప్రాంతాల్లో నివశిస్తున్న దాదాపు 20 వేల మంది హిందువులకు వినాయకనగర్ సమీపంలోని మొదటి బ్రిడ్జి కింద బుగ్గవంకకు ఆనుకుని లోతట్టు ప్రాంతంలో హిందూ శ్మశానవాటిక ఉంది.
గత కొన్నేళ్లుగా శ్మశానవాటికకు పోయే దారి కబ్జా చేసిన కారణంగా దారి లేకుండా పోయింది. ఎవరైనా మరణిస్తే ఆ మనిషి చనిపోయాడనే బాధ కంటే శ్మశానానికి ఎలా తీసుకెళ్లా లన్నదే వారికి వచ్చిన పెద్ద సమస్యగా తయారైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఇప్పటికే ఎన్నోసార్లు నగరపాలక సంస్థ, జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి హిందూ శ్మశానవాటికకు దారి ఏర్పాటు చేయాలని ప్రజలు విన్నవించు కుంటున్నారు.