వివేకా హత్య కేసులో కీలక అనుమానితులను ప్రశ్నించనున్న సీబీఐ!
ABN , First Publish Date - 2020-07-19T12:57:19+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సీబీఐ రంగంలో దిగిన విషయం తెలిసిందే.

కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సీబీఐ రంగంలో దిగిన విషయం తెలిసిందే. శుక్రవారం కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేసిన సిట్ అధికారులను కలసి కేసు వివరాలను సేకరించినట్టు విశ్వసనీయ సమాచారం. వివేకా హత్య కేసు విచారణ కోసం సీబీఐ రంగప్రవేశం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. శనివారం నాడు విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలియవచ్చింది. ఆదివారం కూడా (రెండో రోజు) ఈ కేసులో విచారణ కొనసాగుతున్నది. ఇవాళ పులివెందులలో సీబీఐ బృందం విచారణ చేయనుంది. పులివెందులలో హత్య జరిగిన ప్రదేశంతో పాటు.. వివేకా నివాసాన్ని అధికారులు నిశితంగా పరిశీలించనున్నారు. అంతేకాకుండా ఇవాళ కొందరు కీలక అనుమానితులను సీబీఐ బృందం ప్రశ్నించనుంది.!.
ఈ కేసు పూర్వపరాలివీ..
కాగా.. 2019 మార్చి 14వ తేది అర్ధరాత్రి తర్వాత వైఎస్ వివేకానందారెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నాటి సీఎం చంద్రబాబు ఈ కేసు విచారణకు సిట్‌ను నియమించారు. అయితే.. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడిచినా వివేకా కేసు విచారణ చేపట్టిన సిట్ దర్యాప్తులో పురోగతి లేదని, పలు అనుమానాలు ఉన్నాయని, సీబీఐకి అప్పగించాలని సీఎం వైఎస్ జగన్ చెల్లెలు, వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత హైకోర్టును ఆశ్రయించారు. సిట్ విచారణపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అమాయకులను ఇరికించి.. అసలైన నేరస్తులను వదిలేస్తారేమో..? అని సందేహం కలుగుతోందని హైకోర్టులో వాదన వినిపించారు.