మనోధైర్యంతో కరోనాను జయించవచ్చు
ABN , First Publish Date - 2020-07-27T10:36:55+05:30 IST
మనోధైర్యం, స్వీయ జాగ్రత్తలతో కోవిడ్-19 వైర్‌సను జయించవచ్చని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ పాజిటివ్ పేషంట్లకు

జేసీ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ
కడప (సెవెన్‌రోడ్స్), జూలై 26: మనోధైర్యం, స్వీయ జాగ్రత్తలతో కోవిడ్-19 వైర్‌సను జయించవచ్చని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత్‌వర్మ పాజిటివ్ పేషంట్లకు సూచించారు. ఆదివారం నగరంలోని కొవిడ్ ఆసుపత్రి (రిమ్స్)లోని ఐసోలేషన్ వార్డులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొవిడ్ వార్డుల్లో వైద్యం తీసుకుంటున్న పాజిటివ్ వ్యక్తులతో మీకు వైద్య సదుపాయాలు సరిగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ పాజిటివ్ వ్యక్తులు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వారికి మనోధైర్యాన్ని కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, భౌతిక దూరంతో ఉండి, వైద్యుల సలహాలు, సూచనల మేరకు నిర్ధిష్ట సమయాల్లో ఆహారం, మందులు తప్పక తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో సిబ్బంది ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి పర్యవేక్షిస్తుంటారని, ఏ చిన్నపాటి సందేహం వచ్చినా వెంటనే తెలియజేయాలన్నారు.
ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో క్రమం తప్పకుండా శానిటేషన్ చేయించాలని రిమ్స్ ఆర్‌ఎంవో కొండయ్యను ఆదేశించారు. అనంతరం పేషంట్ల అడ్మిషన్, డిశ్చార్జి నమోదు తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లవన్నతో పాటు కొవిడ్ ఆసుపత్రి నోడల్ అధికారులు, రిమ్స్ వైద్యులు, సంబంధిత వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.