లాక్‌డౌన్‌తో ఎక్కడివారక్కడే...

ABN , First Publish Date - 2020-03-24T10:30:48+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌తో సోమవారం జిల్లాలో జన

లాక్‌డౌన్‌తో ఎక్కడివారక్కడే...

డిపోలకే పరిమితమైన బస్సులు

మూతబడ్డ దుకాణాలు

రిమ్స్‌లో ఓపీ బంద్‌


కడప, మార్చి 23: కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 31 వరకు ప్రకటించిన లాక్‌డౌన్‌తో సోమవారం జిల్లాలో జన జీవనం స్తంభించిపోయింది. నిత్యం వాహనాల రద్దీతో రణగొణధ్వనులు వినిపించే ప్రాంతాలన్నీ అరకొర వాహనాలతో దర్శనమిచ్చాయి. మెడికల్‌ స్టోర్లు, నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు తెరుచుకున్నాయి. కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. రెండురోజుల క్రితం కిలో 8 నుంచి 10 ఉన్న వస్తువు ధర ఇప్పుడు రూ.24- 28కి చేరుకుంది. జన సమూహాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రవాణా సేవలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో జిల్లాలో 800 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.


ద్విచక్ర వాహనాలు, ఆటోలు మరికొన్ని వాహనాల ద్వారా ప్రయాణాలు కొనసాగించారు. ఇక కడప- బెల్గాం విమాన సర్వీసును ఈనెల 28వ తేదీ వరకు రద్దు చేస్తూ ట్రూజెట్‌ నిర్ణయం తీసుకుంది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే కర్నూలు-కడప-చిత్తూరు, కడప-రేణిగుంట-ముంబై-ప్రొద్దుటూరు-బద్వేలు-కృష్ణపట్నం జాతీయ రహదారిలో వాహనాల రద్దీ తగ్గింది. కేవలం ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మాత్రమే తిరిగాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో స్టేషన్‌ నిర్మానుష్యంగా మారిపోయింది. ఇక కడప నగరంలో లాక్‌డౌన్‌ ప్రభావం కనిపించింది. వ్యాపారాలకు అడ్డాగా పేరొందిన వైవీ స్ర్టీట్‌, బీకేయం స్ర్టీట్‌, మద్రాసు రోడ్డు, అంబేడ్కర్‌ సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండు, కోటిరె డ్డిసర్కిల్‌లలో, కోర్టు ఎదురుగా, ఎర్రముక్కపల్లె సర్కిల్‌, సంధ్యాసర్కిల్‌లలో ఉన్న బంగారం, వస్త్ర, షూమార్ట్స్‌, మొబైల్స్‌ షాపులతో పాటు మరికొన్ని వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. రిమ్స్‌లో సాధారణ వైద్య సేవలు నిలిపివేశారు.


ప్రతిరోజూ వెయ్యి మంది వరకు రోగులు వస్తుంటారు. సోమవారం 150 మంది వచ్చారు. వారికి చికిత్సలు చేసి పంపించేశారు. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సేవల కోసం ఐదుగురు డాక్టర్లను షిఫ్ట్‌ల వారీగా నియమించినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గిరిధర్‌ తెలిపారు. కడప నగరంలో కొందరు ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో యథేచ్ఛగా ప్రయాణాలు సాగించారు. పోలీసులు రహదారులపై బారికేడ్లు వేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. అవసరం ఉంటేనే రావాల్సిందిగా దండం పెడుతూ మరీ విజ్ఞప్తి చేశారు. ఆటోల్లో ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లడంతో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో కిటకిటలాడే కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు జనాలు లేక మూతబడ్డాయి. 


Read more