పక్కా.. భారం!
ABN , First Publish Date - 2020-02-08T09:46:21+05:30 IST
వైసీపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి

పక్కా గృహం యూనిట్ విలువ తగ్గింపు?
ఆందోళన చెందుతున్న పేదలు
పేదలపై రూ.1000 కోట్ల భారం
కడప, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పేదలపై ఎలాంటి భారం పడకుండా చూస్తామని చెప్పారు. జగన్ సీఎం అయితే సొంతింటికి ఢోకా ఉండదని భావించిన పేదలకు నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పక్కాగృహం యూనిట్ విలువను తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం పేదలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రతి దాంట్లోనూ రివర్స్ టెండరు విధానాన్ని అవలంబిస్తున్న రాష్ట్రసర్కారు గృహ నిర్మణంలోనూ రివర్స్‌లోకి వెళ్లి నిర్మాణ వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే జరిగితే జిల్లాలో పేదలపై దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర భారం పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ పోతారు. సిమెంటు, ఇనుము, బేల్దార్లు, కూలీలతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ధర పెరుగుతుంటుంది. దీంతో ప్రభుత్వాలు కూడా కాస్త పెంచడం జరుగుతుంది. కాంగ్రె్‌స హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.75 వేలు ఇచ్చేవారు. టీడీపీ హయాంలో 3 రకాల పక్కాగృహాలను మంజూరు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలను కేటాయించేవి. ఇందులో ఎన్టీఆర్ గ్రామీణ పీఎంవై గృహానికి రూ.2లక్షలు, ఎన్టీఆర్ రూరల్ రూ.1.50లక్షలు, ఎన్టీఆర్ అర్బన్ (బీఎల్‌సీ) రూ.3.50 లక్షలు, అన్నమయ్య అర్బన్ డెవల్‌పమెంట్ అఽథారిటీ పరిధిలో రూ.2.50లక్షలు చెల్లించేవారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ గ్రామీణ, ఎన్టీఆర్ పీఎంవై, పీఎంవై, ఎన్టీఆర్ అర్బన్, ఎన్టీఆర్ రూరల్, ఎన్టీఆర్ టీఎంవై ద్వారా దాదాపు 75వేల గృహాలు మంజూరయ్యాయి.
యూనిట్ కాస్ట్ తగ్గించే యోచనలో...
వచ్చే ఉగాది రోజున అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాధాన్యతగా పెట్టుకుంది. ఇందులో భాగంగా స్థల సేకరణ జోరుగా సాగుతోంది. ఇంటి స్థలాల లేఅవుట్లను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 1.10లక్షల మంది పేదలకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. కడప నగరంలోనే 25వేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో పక్కాగృహాలకు అర్హులైన వారిని వలంటీర్ల ద్వారా గుర్తిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 75వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్వే పూర్తయితే పక్కాగృహాలకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య లక్ష దాటుతుందని గృహ నిర్మాణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వలంటీర్ల ద్వారా జాబితా గృహ నిర్మాణ శాఖకు అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు చేపడతారు. అర్హులు లక్ష మందిగా గుర్తిస్తే వారికి విడతల వారీగా గృహాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే స్థలం ఇచ్చిన తరువాత పక్కాగృహం మంజూరు చేస్తారు. స్థలం కూడా ప్రభుత్వమే ఇస్తున్నందున ఇంటి నిర్మాణానికి ఇచ్చే మొత్తాన్ని తగ్గించాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
గత ప్రభుత్వ హయాంలో మూడు పథకాల ద్వారా పక్కాగృహలు మంజూరుచేశారు. ఒక్కో పథకానికి ఒక్కో నిర్మాణ వ్యయం ఉండేది. ఇప్పుడు జగన్ సర్కారు వ్యయాన్ని తగ్గిస్తే పేదలపై దాదాపు రూ.1000 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ధర విపరీతంగా పెరిగింది. సిమెంటు బస్తా రూ.250 నుంచి రూ.260, ఐరన్ టన్ను 43వేలు ధర పలుకుతుంది. బేల్దార్ల కూలీలు కూడా గణణీయంగా పెరిగాయి. ఇలాంటప్పుడు ఇంటి నిర్మాణానికి ఇచ్చే మొత్తాన్ని పెంచాలే తప్ప తగ్గించకూడదు. మరి ప్రభుత్వం మాత్రం తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు రావడం పేదలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయమై గృహనిర్మాణ శాఖ పీడీ రామచంద్రన్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.