-
-
Home » Andhra Pradesh » Kadapa » Build as told
-
చెప్పినట్టే నిర్మించుకోవాలి...
ABN , First Publish Date - 2020-12-27T05:46:44+05:30 IST
మనిషి జీవితంలో పెళ్లి, ఇల్లు రెండూ అత్యంత..

ఇంటి నిర్మాణం 340 చదరపు విస్తీర్ణంలో మాత్రమే
అంతా ప్రభుత్వం సూచించిన మేరకే...
ఆందోళనలో లబ్ధిదారులు
(కడప-ఆంధ్రజ్యోతి): మనిషి జీవితంలో పెళ్లి, ఇల్లు రెండూ అత్యంత ముఖ్యమైన ఘట్టాలు. ఈ రెండూ జీవితంలో మళ్లీ మళ్లీ చేపట్టలేరు. స్థోమతను బట్టి అభిరుచి, అవసరాలకు తగ్గట్లు ఇంటిని నిర్మించుకుంటారు. అయితే మీ అభిరుచులు, మా అవసరాలు కాదు.. మేం చెప్పినట్లే నిర్మించుకోవాలి.. ఈ పరిస్థితి ఇప్పుడు నవరత్నాల పక్కాగృహాలు నిర్మించుకోబోయే లబ్ధిదారులకు ఎదురవుతోంది. వంట గది, హాలు, బాత్‌రూం సహా ఏది ఎంత విస్తీర్ణంలో నిర్మించుకోవాలో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం లబ్ధిదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. నవరత్నాల్లో భాగంగా వైఎస్‌ఆర్ జగనన్న పేదలందరికీ ఇళ్లు అనే పథకం శుక్రవారం ప్రారంభమైంది. జిల్లాలో తొలి విడతలో 95,649 పక్కాగృహాలను మున్సిపల్ కార్పొరేషన, నగర పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ఇంటి నిర్మాణ విలువను బట్టి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం రూ.1.80 లక్షలు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేలు ఇస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎనఆర్‌జీఎ్‌స ఉపాధి హామీ ద్వారా చెల్లిస్తుంది.
340 చదరపు అడుగులే
పక్కాగృహాలను ప్రభుత్వం సూచించిన విధంగా లబ్ధిదారుడు 340 చదరపు విస్తీర్ణంలోనే నిర్మించుకోవాల్సి ఉంది. బెడ్‌రూం నిర్మాణం 82.64 చదరపు అడుగులు, లివింగ్ రూం 77.01, వరండా 64, వంట గది 35, మరుగుదొడ్డి 24 చదరపు అడుగుల్లో నిర్మించాలి. నిర్మాణానికి 92 బస్తాల సిమెంటు, అర టన్ను ఇనుము, నాలుగు డోర్లు, ఎలక్ర్టికల్ శానిటరీ మెటీరియల్, నీటి సరఫరా పైపులు, 250 లీటర్ల వాటర్ ట్యాంకు, టైల్స్‌ను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.
ఆందోళనలో లబ్ధిదారుడు
పేదలకిచ్చే ఇంటి స్థలాలు ఎక్కడో ఊరికి దూరంగా విసిరేట్లుగా దూర ప్రాంతాల్లో ఇస్తున్నారు. అక్కడ ఇవ్వడం పట్ల పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. సరేలే.. ఎలాగో సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో పేదలున్నారు. కూలీ పని చేసుకుని సంపాదించుకున్న సొమ్మును కుటుంబ పోషణకు పోగా కొందరు కాస్త పొదుపు చేస్తున్నారు. ప్రభుత్వమిచ్చే సొమ్ముతో పాటు కాయకష్టంతో మిగుల్చుకున్న సొమ్ముతో పిల్లల భవిష్యత కోసం కాస్త పెద్దదిగానే నిర్మించుకోవాలనుకున్నారు. అయితే 340 చదరపు అడుగులు మించొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా ఇంటిని ఒకే నమూనాలో నిర్మించుకోవాలని ఆదేశించింది.
దివంగత వైఎ్‌సఆర్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లను ఇబ్బడిముబ్బడిగా మంజూరు చేశారు. లబ్ధిదారులు ప్రభుత్వమిచ్చే సొమ్ముతో పాటు అప్పు చేసిన సొమ్ముతో వారికి తగ్గట్లు నిర్మించుకున్నారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటి నిర్మాణ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ప్రభుత్వ సొమ్ముతో ఇల్లు నిర్మించారా లేదా అనేది మాత్రమే పరిశీలించి బిల్లులు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖాళీ స్థలం మొదలుకుని నిర్మాణం పూర్తయ్యే వరకు నాలుగు దశల్లో జియోట్యాగ్ చేసి అప్‌లోడ్ చేస్తారు. ప్రభుత్వ నిర్ణయం పేదల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని విమర్శలు ఉన్నాయి.
లబ్ధిదారుడు కోరితే ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుంది: రాజశేఖర్, హౌసింగ్ పీడీ
ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నమూనాలో 340 చదరపు అడుగుల్లోనే ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. లబ్ధిదారుడు ప్రభుత్వ నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నిర్మాణ సామగ్రి ప్రభుత్వమే సరఫరా చేసి లేబరు ఛార్జీలకు డబ్బు ఇస్తుంది. దీంతో లబ్ధిదారులు నిర్మించుకోవచ్చు.. లేదా ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారుడు తెచ్చుకుంటానంటే మెటీరియల్‌కు అవసరమైన దశల వారీగా లబ్ధిదారుల ఖాతాలకు చెల్లిస్తుంది.. ఇక మూడో పద్ధతి. లబ్ధిదారులు ఇల్లు కట్టుకోలేనంటే ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుని ఇల్లు కట్టిస్తుంది.
జిల్లాలో మంజూరైన ఇళ్లను పరిశీలిస్తే..
నియోజకవర్గం ఇళ్లు
కడప కార్పొరేషన్ 26392
పులివెందుల 5965
ప్రొద్దుటూరు 15827
రాయచోటి 9589
కమలాపురం 5217
జమ్మలమడుగు 6513
మైదుకూరు 6462
బద్వేలు 5308
రైల్వేకోడూరు 5346
రాజంపేట 7611
యర్రగుంట్ల నగర పంచాయతీ 1419