‘ఉపాధి’ జోష్‌

ABN , First Publish Date - 2020-06-22T11:24:49+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పనులు జోష్‌గా సాగుతున్నాయి.

‘ఉపాధి’ జోష్‌

రికార్డు స్థాయిలో కూలీల హాజరు

3 లక్షలు దాటిన సంఖ్య


కడప, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పనులు జోష్‌గా సాగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కూలీలు హాజరవుతున్నారు. పని జరిగే ప్రదేశాలన్నీ కూలీలతో జాతరను తలపించేలా మారుతున్నాయి. కరోనా వేళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులే ఆసరాగా నిలుస్తున్నాయి. పొట్ట చేతబట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు లాక్‌డౌన్‌ కారణంగా సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో వారందరూ ఇప్పుడు ఉపాధి పనులకు వెళుతున్నారు. దీంతో పనులకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉపాధి పథకం ఆవిర్భవించిన తరువాత ఎన్నడూ లేనివిధంగా రోజూ 3 లక్షల కూలీల మార్కు దాటిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.766.30 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. 1.94 లక్షల పనిదినాలు కల్పించాలనేది తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 3,48,253 జాబ్‌కార్డులు ఉన్నాయి. కూలీల సంఖ్య 6,35,766 మంది ఉన్నారు. 29,480 శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. అయితే 25,897 శ్రమశక్తి సంఘాల్లోని 3,21,548 మంది మాత్రమే పనులకు హాజరవుతున్నారు. 


1.11 కోట్ల పనిదినాలు లక్ష్యం

లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూతబడ్డాయి. వ్యవసాయరంగం దెబ్బతింది. దీంతో స్థానికంగానే జాబ్‌కార్డు, పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని నిర్ణయించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు సొంతూర్లకు వచ్చారు. రెండు నెలల వ్యవధిలో 7309 మంది కుటుంబాలకుజాబ్‌కార్డులు ఇచ్చారు. వాటి ద్వారా ఇందులో 11,543 మంది కూలీలు పనులకు వస్తున్నారు. జూన్‌ చివరి నాటికి కోటి 11 లక్షలా 91 వేల పనిదినాలు లక్ష్యం కాగా ఈనెల 19 నాటికి 70 లక్షలా 80 వేల పనిదినాలు ఖర్చు పెట్టి వేతనాల రూపంలో కూలీలకు రూ.168 కోట్లు చెల్లించారు. శ్రమశక్తి సంఘాల్లోని సభ్యులందరూ పనికి రావాలని, వలస వెళ్లి సొంతూర్లకు వచ్చిన అందరికీ పని కల్పించాలని డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి ఆదేశించారు. దీంతో క్షేత్ర స్థాయి సిబ్బంది కదిలారు.


ఎన్నడూ లేని విధంగా..

ఉపాధి హామీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పనులకు వచ్చే కూలీల సంఖ్య జూన్‌ మాసంలో 3 లక్షలు దాటింది. ఈనెల 8న 3,14,246 మంది హాజరయ్యారు. 9న 3,15,923, 10న 3,16,072, 15న 3,04,141 మంది, 16న 3,45,623, 17న 3,08,416, 18న 3,16,727, 19న 3,03,084 మంది హాజరయ్యారు.


వర్షాలు పడితే మొక్కల పెంపకంపై దృష్టి

వర్షాలు కురిస్తే ఉపాధి హామీ పనులు చేసేందుకు అవకాశం ఉండదు. దీంతో కూలీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే అందుకే రోడ్లకిరువైపులా పొలం గట్లపై ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఉపాధి హామీ నిధులతో అటవీ శాఖ నర్సరీల్లో మొక్కలు పెంచింది. ప్రస్తుతం అటవీశాఖ వద్ద రోడ్లకిరువైపులా నాటేందుకు 13,16,900 మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే చిన్న మొక్కలు 37 లక్షలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 


3.50 లక్షలు లక్ష్యం-యధుభూషణ్‌రెడ్డి, డ్వామా పీడీ 

ఇక నుంచి ప్రతిరోజూ 3.50 లక్షల మంది కూలీలు పనులకు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించాము. కోవిడ్‌-19 నేపధ్యంలో మాస్కులు లేకుంటే పనులకు అనుమితించే ప్రసక్తే లేదు. పనిచేసే చోట భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాము. సమిష్టి కృషితోనే ఉపాధి పనుల ద్వారా అందరికీ పనులు కల్పిస్తున్నాము. 

Updated Date - 2020-06-22T11:24:49+05:30 IST