రాయచోటిలో భూచోళ్లు..!

ABN , First Publish Date - 2020-02-16T09:24:38+05:30 IST

రాయచోటిలో భూ ఆక్రమణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు

రాయచోటిలో భూచోళ్లు..!

నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములు కాజేసేయత్నం

సర్వే నెంబరు 530/5-బీని రక్షించేది ఎవరు?


రాయచోటి, ఫిబ్రవరి 15: రాయచోటిలో భూ ఆక్రమణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు ఏమాత్రం వెనుకాడ్డంలేదు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నా.. నకిలీ పత్రాలు సృష్టించి.. కాజేసేందుకు జోరుగా యత్నాలు చేస్తున్నారు. మరికొందరు ఆ భూములను అమ్మడానికి సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


రాయచోటి మునిసిపాలిటీ పరిధిలోని సర్వే నెంబరు 530/5-బీలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నెంబరులో సిబక్‌తుల్లా కాలనీ పేరుతో కొంతమంది పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఉన్నారు. పేదలకు ఇంటి స్థలాలకు ఇవ్వగా.. మిగిలిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అయితే ఈ భూమి ఇతరులకు ఇచ్చినట్లు నకిలీ డీఫారాలు చలామణిలో ఉన్నా యి. దినకరన్‌, జగన్నాధం మరికొందరి పేర్లతో డీఫారాలు చలామణిలో ఉన్నాయి. ఈ రెండు డీఫారాలపైన తహ సీల్దార్‌ సంతకాలు, రాయచోటి తహసీల్దార్‌ కార్యాలయపు రబ్బరు స్టాంపు సీలు ఉన్నాయి. వీటిని చూపిస్తూ.. తమకు ప్రభుత్వం గతంలో ఇచ్చిందంటూ కొందరు ఆ స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ఢీఫారాలపై ఉన్న డీకేటీ నంబర్ల ప్రకారం రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే.. అది ప్రభుత్వ భూమిగానే ఉన్నట్లు తెలిసింది.


రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి

రాయచోటిలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొందరు అప్పనంగా ప్రభుత్వ భూములను కాజేసేందుకు యత్నిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇకనైనా రాయచోటి రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి.. సర్వే నంబరు 530/5-బీలో ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.


ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ?

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రాయచోటిని పోలీసు సబ్‌డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేసింది. దీంతో రాయచోటిలో డీఎస్పీ కార్యాలయ భవనాన్ని నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయించారు. ఇదే సమయంలో ప్రస్తుతం రాయచోటి పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగ పడేంత ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఇటువంటి స్థలాలు కాపాడి.. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని పలువురు పేర్కొంటున్నారు.


ఆ స్థలం ప్రభుత్వానిదే..సుబ్రమణ్యం రెడ్డి, తహసీల్దార్‌, రాయచోటి

రాయచోటి మునిసిపాలిటీ పరిధిలోని సర్వే నెంబరు 530/5-బీలో ఉన్న ఆరు ఎకరాల స్థలం ప్రభుత్వానిదే. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ స్థలాన్ని ఎవరికీ  ఇవ్వలేదు. ఈ స్థలం తమదే అని ఎవరైనా నకిలీ ఢీఫారాలు చలామణి చేస్తే కఠిన చర్యలు తప్పవు. తక్షణమే ఈ స్థలాన్ని సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల జోలికి ఎవరు వచ్చినా.. చర్యలు తప్పవు. 

Updated Date - 2020-02-16T09:24:38+05:30 IST