ప్రభుత్వ జాగా..వేసెయ్‌ పాగా..

ABN , First Publish Date - 2020-08-22T11:41:43+05:30 IST

గోపవరం మండలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములుండేవి. భూముల్లేని నిరుపేదలు కూడా అక్కడ ఎక్కువే. అక్కడ పరిస్థితులను గమనించిన

ప్రభుత్వ జాగా..వేసెయ్‌ పాగా..

రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను

పరిశ్రమల పేరుతో ఆక్రమణకు యత్నం

డ్రోన్‌ కెమెరాలతో సర్వే...అడ్డుకున్న స్థానికులు


అది.. బద్వేలు - నెల్లూరు జాతీయ రహదారి. అక్కడ భూములకు మంచి డిమాండ్‌ ఉంది. బద్వేలు శరవేగంగా విస్తరిస్తుండడమే కారణం. అక్కడి భూములకు రెక్కలు రావడంతో కొందరు అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నాయో గుర్తించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొందరు రూ.100 కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిపై కన్నేసినట్లు సమాచారం. పరిశ్రమల పేరుతో ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రోన్‌ కెమెరాలతో ఆ భూములను సర్వే చేస్తుండగా స్థానికులు అడ్డుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.


(కడప - ఆంధ్రజ్యోతి): గోపవరం మండలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములుండేవి. భూముల్లేని నిరుపేదలు కూడా అక్కడ ఎక్కువే. అక్కడ పరిస్థితులను గమనించిన జర్మనీ సంస్థ నిరుపేదలను ఆదుకునేందుకు 1972లో ప్రభుత్వం నుంచి 1252.52 ఎకరాలను లీజుకు తీసుకుంది. గోపవరం రెవెన్యూ పొలం సర్వే నెం.1859, 1860, 1861, 1862, 1863, 1864, 1865, 1866, 1867, 1868, 1869, 1870, 1871, 1872, 1873, 1874, 75, 76, 77, 88, 79, 1880 నుంచి 1920 సర్వే నెంబర్లలో ఉన్న భూమిలో కేటాయించిన మేరకు ‘ది గోపవరం ప్రాజెక్టు సైట్‌ కోఆపరేటివ్‌ జాయింట్‌ ఫారిన్‌ సొసైటీ లిమిటెడ్‌’ను ఏర్పాటు చేసింది. 200 మంది సభ్యులను నియమించారు. ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న భూమిని వ్యవసాయానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దింది. ఆ భూముల్లో వ్యవసాయ బోర్లు, కొంతమేర మామిడిసాగు, పంటను నిల్వ ఉంచుకునేందుకు గోదాములను నిర్మించింది. సొసైటీ సభ్యులు సాగు చేసుకుని జీవించాలన్నది జర్మనీ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. కొందరు సభ్యులు పంట సాగు చేస్తుండగా, మరికొందరు సాగు చేయలేదు.


నేతల కన్ను

సొసైటీకి కేటాయించిన ప్రభుత్వ భూములు జాతీయ రహదారిపక్కనే ఉన్నాయి. అక్కడ ప్రాంతాన్ని బట్టి ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకూ పలుకుతోంది.  వీటిపై కొందరు అధికార పార్టీ నేతల కన్ను పడినట్లు తెలిసింది. సొసైటీకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకొచ్చేలా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఆ భూములను కాజేయాలన్న పన్నాగం పన్నిన కొందరు ఇటీవల డ్రోన్‌ కెమెరాలతో సర్వేకు ప్రయత్నించగా స్థానికులు వారిని అడ్డుకుని బంధించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పరిశ్రమలు పెట్టేందుకు సర్వే చేస్తున్నామని అక్కడికి వచ్చిన వారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు భూములు కావాలంటే ఏపీఐఐసీని సంప్రదిస్తే ఎక్కడ ఎన్ని ఎకరాల భూమి ఉందో తెలుస్తుందని, సాగు చేసిన భూములను ఆక్రమించే యత్నం చేయడం ఏంటంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


చక్రం తిప్పుతున్న ముగ్గురు

రూ.100 కోట్ల విలువ చేసే ఆ భూమిపై అఽధికార పార్టీకి చెందిన ముగ్గురు నేతలు కన్నేసినట్లు సమాచారం. ముఖ్యంగా బద్వేలు మున్సిపల్‌ రాజకీయాల్లో కీ రోల్‌గా ఉన్న ఓ నేత, మరో నేత, గోపవరానికి చెందిన ఇంకో నేత.. ఈ ముగ్గురూ కలిసి ఈ కుట్ర పన్నుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ముగ్గురి వెనుక ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు ఉన్నట్లు చెబుతున్నారు. వీరంతా కలిసి రూ.100 కోట్ల భూమికి స్కెచ్‌ వేస్తుండడం అధికార పార్టీ నేతల్లోనే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.


పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు లేవు- సరస్వతి, తహసీల్దారు, గోపవరం

గోపవరంలో సొసైటీకి కేటాయించిన భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. 

Updated Date - 2020-08-22T11:41:43+05:30 IST