పసుపు కొనుగోళ్లకు.. టోకన్లు!

ABN , First Publish Date - 2020-04-24T11:25:16+05:30 IST

ప్రభుత్వం పసుపు క్వింటా రూ.6850 ప్రకారం కొనుగోళ్లకు గురువారం శ్రీకారం చుట్టింది.

పసుపు కొనుగోళ్లకు.. టోకన్లు!

పూర్తిస్థాయి కొనుగోళ్లకు మరో మూడు రోజులు ఆగాల్సిందే

కడప మార్కెట్‌లో లాంఛనంగా ప్రారంభించిన డిప్యూటీ సీఎం

తొలివిడత కడప, రాజంపేట, మైదుకూరులో కొనుగోలు కేంద్రాలు

ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్లే


కడప, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం పసుపు క్వింటా రూ.6850 ప్రకారం కొనుగోళ్లకు గురువారం శ్రీకారం చుట్టింది. కడప మార్కెట్‌ యార్డులో డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మార్కెటింగ్‌ డీడీ కల్పన, మార్క్‌ఫెడ్‌ ఇన్‌చార్జి జిల్లా మేనేజర్‌ డి.నాగరాజు కొనుగోలు ప్రారంభించారు. అయితే.. కొనుగోళ్లలో భౌతికదూరం పాటించే విధంగా ఏ రోజు ఎంత మంది రైతుల నుంచి కొనుగోలు చేయాలో నిర్ణయించి ఆ మేరకు టోకన్లు మాత్రమే ఇస్తాం.. ఆ మేరకు నిర్ణయించిన తేదీల్లో మాత్రమే పంట దిగుబడి తీసుకురావాలని మార్క్‌ఫెడ్‌ అధికారులు సూచించారు. పూర్తిస్థాయి కొనుగోళ్లకు మరో మూడు నాలుగు రోజులు ఆగాల్సిందేనని అంటున్నారు. మొదటి విడతలో కడప, మైదుకూరు, రాజంపేటలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. రైతుల డిమాండ్‌ను బట్టి మరో నాలుగైదు కేంద్రాలు ఏర్పాటు చే సేందుకు సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు.


కాగా  ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్లే

జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 3573 హెక్టార్లలో పసుపు సాగు చేశారు. హెక్టారుకు 7 మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొందరు రైతులు రెండు మూడు ఎకరాల్లో సాగు చేస్తే, మరికొందరు నాలుగైదు ఎకరాల్లో కూడా పసుపు సాగు చేశారు. ఎకరాకు సగటున 28 - 30 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. రెండు ఎకరాల్లో సాగు చేసిన రైతుకు 60 క్వింటాళ్లు, మూడు ఎకరాల్లో సాగు చేసిన రైతుకు సగటున 95 క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుంది. రెండు ఎకరాల్లో సాగు చేసిన రైతు 30 క్వింటాళ్లు మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రంలో అమ్మితే..మిగిలిన 30 క్వింటాళ్లు బయట వ్యాపారులకు అమ్మాల్సి వస్తుంది.


ప్రస్తుతం నాణ్యతను బట్టి క్వింటా గరిష్టంగా రూ.5500 నుంచి ధర ఉందని వ్యాపారులే అంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.6550లతో పోలిస్తే క్వింటానికి రూ.1350 కోల్పోవాల్సి వస్తోంది. ఈ లెక్కన రెండు ఎకరాల్లో పసుపు సాగు చేసిన రైతు రూ.40,500, మూడు ఎకరాల్లో సాగు చేసిన రైతు సరాసరి రూ.90వేల నుంచి లక్ష రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది. పరిమితి లేకుండా మొత్తం దిగుబడిని ప్రభుత్వం మద్దతు ధర కు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2020-04-24T11:25:16+05:30 IST