కలవరపెడుతున్న కరోనా

ABN , First Publish Date - 2020-06-21T11:29:41+05:30 IST

కరోనా మహమ్మారి కలవరపాటుకు గురి చేస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

కలవరపెడుతున్న కరోనా

మరో 22 పాజిటివ్‌ కేసులు

485కి చేరిన కోవిడ్‌ -19 బాధితుల సంఖ్య

అనధికారికంగా మరో 20..?


కడప, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కలవరపాటుకు గురి చేస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శనివారం మరో 22 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య 485కి చేరింది. మైలవరం మండలం చిన్నకొమెర్లలో 12 పాజిటివ్‌ కేసులు, పులివెందులలో 5, మైదుకూరులో 2, కడప నగరంలోని ఓంశాంతినగర్‌, కుమ్మరికుంటలలో ఒక్కొక్క కేసు, కువైత్‌ నుంచి వచ్చిన వారిలో ఒకటి పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. పోరుమామిళ్ల మండలంలో 9, వల్లూరులో 3, ప్రొద్దుటూరులో మరో 10 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


కోవిడ్‌-19 సమాచారం

  • మొత్తం శాంపిల్స్‌  - 55975
  • రిజల్ట్‌ వచ్చినవి   - 51625
  • నెగటివ్‌ - 51140
  • పాజిటివ్‌ - 485
  • డిశ్చార్జ్‌ అయినవారు - 167
  • రిజల్ట్‌ రావాల్సినవి  - 4350
  • 20వ తేదీ తీసిన శాంపిల్స్‌  - 1912


నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసు నమోదు : ఎస్పీ

కడప (క్రైం) : కరోనా వైరస్‌ నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మాస్కులు ధరించని వారిపై 463 కేసులు నమోదు చేసి రూ.1,42,714లు జరిమానా విఽధించినట్లు తెలిపారు. కొందరు ప్రజలు నోరు, ముక్కు కప్పి ఉంచేలా మాస్కులు కట్టుకోకుండా అలంకారప్రాయంగా తగిలించుకుంటున్నారని అన్నారు. వీరు వీరి ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా ఇతరుల ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తుండడం సరికాదన్నారు. బయటికి వచ్చే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


ఒకే కుటుంబంలో 9 మందికి...?

పోరుమామిళ్ల: పోరుమామిళ్ల మండలంలోని వాసుదేవాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో 9 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని స్థానిక అధికారులు తెలిపారు. వీరంతా ముంబైలో ఉండేవారని, వీరిలో ఒకరు నేవీ రిటైర్డ్‌ ఉద్యోగి కాగా అతని కుమారుడు ప్రస్తుతం నేవీలో విధులు నిర్వహిస్తున్నాని అన్నారు. వీరంతా ఈ నెల 15న స్వగ్రామమైన వాసుదేవాపురం రావడంతో విషయం తెలుసుకున్న అధికారులు 16 మందిని కడప క్వారెన్‌టైన్‌కు తరలించారు. వీరిలో 9 మందికి శనివారం రిపోర్టులో పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిసింది.

Updated Date - 2020-06-21T11:29:41+05:30 IST