అమరావతిపై రెఫరెండంకు సిద్ధమేనా ?

ABN , First Publish Date - 2020-12-18T04:58:21+05:30 IST

నాటి ప్రతిపక్ష నేతగా జగన్‌ అమరావతి రాజధానిగా అంగీకరిస్తున్నట్లు అసెంబ్లీలో ఒప్పుకున్నారు.. ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చి మూడు రాజధానులు తెరపైకి తెచ్చారు. రాజధాని అమరావతిపై రెఫరెండం పెట్టి ఎన్నికలకు వెళదామని, దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని టీడీపీ నేతలు సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు.

అమరావతిపై రెఫరెండంకు సిద్ధమేనా ?
అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులు

సీఎం జగన్‌కు టీడీపీ నేతల సవాల్‌

కడప, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): నాటి ప్రతిపక్ష నేతగా జగన్‌ అమరావతి రాజధానిగా అంగీకరిస్తున్నట్లు అసెంబ్లీలో ఒప్పుకున్నారు.. ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చి మూడు రాజధానులు తెరపైకి తెచ్చారు. రాజధాని అమరావతిపై రెఫరెండం పెట్టి ఎన్నికలకు వెళదామని, దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని టీడీపీ నేతలు సీఎం జగన్‌కు సవాల్‌ విసిరారు. అమరావతినే రాజదానిగా కొనసాగించాలంటూ రైతులు చేపడుతున్న ఉద్యమం గురువారానికి ఏడాది అయింది. టీడీపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కడప అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, హరిప్రసాద్‌, గోవర్ధనరెడ్డిలు టీడీపీ శ్రేణులతో ఆ పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండు మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం నడిబొడ్డున, ప్రజలందరికీ అందుబాటులో ఉండడంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారన్నారు. అప్పట్లో జగన్‌ కూడా రాజధాని అమరావతికే మద్దతు పలికారన్నారు. అయితే అధికారం చేపట్టిన వెంటనే రాజధాని అమరావతిని నాశనం చేసేందుకు మూడు రాజధానులను తెర పైకి తెచ్చారన్నారు. ఏడాదిగా రైతులు ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌ కానీ కనీసం మంత్రులు కూడా వారిని పరామర్శించి వారి డిమాండ్లు ఏంటో తెలుసుకోలేదన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ స్పందించి అమరావతే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులు జిలానీబాషా, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, అన్వర్‌హుసేన్‌, ఆదినారాయణ, జాకీరుద్దీన్‌, పీరయ్య, గురప్ప. సురేషు, శివకొండారెడ్డి, శివరాం, మల్లేషు, రాంప్రసాద్‌, మాసా కోదండరామ్‌, జలతోటి జయకుమార్‌, ఆమూరి బాలదాసు, రామానాయుడు, శ్రీనివాసులు, ఝాన్సీ, మీనాక్షి, స్వర్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T04:58:21+05:30 IST