-
-
Home » Andhra Pradesh » Kadapa » a story on vari
-
ఆశలు ఆ‘వరి’..!
ABN , First Publish Date - 2020-11-21T05:42:40+05:30 IST
ఓ పక్క అధిక వర్షాలు.. మరో పక్క తెగుళ్లు. వీటిని ఎదురొడ్డి పండించిన వరిధాన్యానికి గిట్టుబాటు ధర లేక.. పెట్టుబడి కూడా చేతికిరాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి
ధర పతనమై మరింత నష్టం
ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్-ఏ రూ.1,888, సాధారణ రకం రూ.1,868
మార్కెట్లో రూ.1,450లకు మించని వైనం
వ్యాపారులు కుమ్మక్కై నాణ్యత పేరుతో దగా
ఇప్పటివరకు ప్రభుత్వం కొన్నది 1,400 టన్నులే
(కడప-ఆంధ్రజ్యోతి): ఓ పక్క అధిక వర్షాలు.. మరో పక్క తెగుళ్లు. వీటిని ఎదురొడ్డి పండించిన వరిధాన్యానికి గిట్టుబాటు ధర లేక.. పెట్టుబడి కూడా చేతికిరాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదు. వ్యాపారులు నాణ్యత పేరుతో దగా చేస్తున్నారు. క్వింటా రూ.1,450లకు కూడా కొనడం లేదు. ధర పతనమై దగా పడుతున్న ధాన్యం రైతుల కన్నీటి వ్యథలపై ప్రత్యేక కథనం.
జిల్లాలో ఖరీఫ్‌లో 45 వేల హెక్టార్లలో వరి సాగుచేశారని వ్యవసాయ అధికారులు తెలిపారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన వర్షాలకు పంట భారీగా దెబ్బతింది. దిగుబడి చేతికొచ్చే సమయంలో వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు పైరు దెబ్బతింది. వీటికి తోడు తెగుళ్లు సరేసరి. దీంతో దిగుబడి తగ్గింది. ఎకరాకు సగటున 35-40 బస్తాలు (బస్తా 75 కిలోలు చొప్పున 26-30 క్వింటాళ్లు) దిగుబడి రావాల్సి ఉంది. ప్రస్తుతం 20 నుంచి 30 బస్తాలు కూడా రావడం లేదు.
పతనమైన ధరలు
దిగుబడి తగ్గినప్పుడు డిమాండ్ పెరిగి ధర ఆశాజనకంగా ఉంటుంది. వరి రైతుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. దిగుబడితో పాటు ధరలు కూడా పతనమయ్యాయి. వ్యాపారులు కుమ్మక్కై నాణ్యత పేరుతో దగా చేస్తున్నారు. పుట్టి రూ.8,500 ప్రకారం కొంటున్నారు. అంటే క్వింటా రూ.1,450లకు మించడం లేదు. ఇదేమిటని వ్యాపారులను ప్రశ్నిస్తే తేమ 18-20 శాతం దాకా ఉంటోందని అంటున్నారు. అంతేకాదు.. తేమ అధికంగా ఉందని బస్తాపై 4-5 కిలోలు అదనంగా తీసుకుంటున్నారు. వ్యాపారులు పుట్టి వడ్లు ఎనడీఎల్‌ఆర్ కరం రూ.10,000-10,500లకు, బీపీటీ జిలకర సన్నాలు (కర్నూలు సోనా) రూ.8,000-8,500, జగిత్యాల రూ.8,000-8,500, వరంగల్ సన్నాలు రూ.7,500-8,000లకు మించి కొనుగోలు చేయడం లేదు. ఇది ప్రభుత్వ మద్దతు ధరకంటే తక్కువ కావడంతో రైతులు ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.16,250 వరకు నష్టపోవాల్సి వస్తోంది. నిల్వ చేసుకునే గోదాములు లేక.. పెట్టుబడి అప్పుల వడ్డీలు పెరుగుతాయని వచ్చినకాడికి రైతులు అమ్ముకుంటున్నారు. వ్యాపారులు కొనుగోలు చేసిన వడ్లు గోదాముల్లో నిల్వ చేసి.. కోతలు అయిపోయాక అధిక రేట్లకు అమ్మి లాభపడుతున్నారు. ఏటా జరిగే ప్రక్రియ ఇదే.
రైతుకు మద్దతు ఏదీ..?
వరి ధాన్యం మద్దతు ధర గ్రేడ్-ఏ రూ.1,888, సాధరణ రూ.1,868గా ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 13 ఏర్పాటు చేస్తే.. తాజాగా కడప, చెన్నూరు, బద్వేలు, నందలూరు, ఖాజీపేట, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, వేంపల్లి కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. రైస్ మిల్లర్లతో ఒప్పందం చేసుకొని సివిల్ సప్లయ్ అధికారులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 1,400 టన్నులే కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ 17 శాతంలోపే ఉండాలి. ఎక్కువ శాతం మంది రైతులు వడ్లు ఆరబెట్టేందుకు అవకాశం లేక పొలంలో అమ్మేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు నాణ్యత పేరుతో దగా చేస్తున్నారు. సివిల్ సప్లయ్ సిబ్బంది, రైస్ మిల్లర్లు రైతుల వద్దకు వెళ్లి తేమ బూచి చూపి తక్కువ ధరకే కొనుగోలు చేసినా మద్దతు ధరకు తీసుకున్నట్లు బిల్లులు ఇస్తున్నారు. బిల్లుల్లో మాత్రం చెల్లించే మొత్తానికి సరిపడ తూకం వడ్లనే చూపుతున్నారని, తమవద్ద అంతకంటే ఎక్కువ ధాన్యం తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రూ.1,500లకు కొన్నారు.. రూ.1,888కు బిల్లు ఇచ్చారు
ఈ రైతుది వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె. పేరు నిమ్మకాయల రమణారెడ్డి. ఇటీవల ధాన్యం అమ్మారు. ఆయన ఏమన్నారంటే ‘‘కేసీ కాలువ కింద 8 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఈ నెల 11న ఖాజీపేట కొనుగోలు కేంద్రం సివిల్ సప్లయ్ సిబ్బంది, రైస్ మిల్లరు గ్రామానికి వస్తే 94.5 క్వింటాళ్లు అమ్మాను. తేమ 18 శాతం ఉందని క్వింటా రూ.1,500లు ధర నిర్ణయించారు. ఆ ప్రకారం నాకు రూ.1.41 లక్షలు రావాలి. బిల్లు మాత్రం రూ.1.41 లక్షలకు సరిపడేలా క్వింటా రూ.1,888 ప్రకారం 75.2 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు ఇచ్చారు. ఇదేమిటంటే తేమ అధికంగా ఉంది.. అంతకు మించి రేటు రాదని, ఇష్టమైతే ఇవ్వు.. లేదంటే వద్దని అన్నారు. బయట పుట్టి రూ.8,500లకు మించి లేకపోవడంతో ఇచ్చేశా. అంతేకాదు.. బస్తా 75 కిలోలకు గానూ 78 కిలోలు తూకం తీసుకున్నారు.’’ అని చెప్పారు. రైతు నుంచి అదనంగా తీసుకున్న 19.3 క్వింటాళ్లు ఏ లెక్కలో చూపించారో సివిల్ సప్లయ్ అధికారులకే తెలియాలి. ఆ ఒక్క రోజే ఆదినిమ్మాయపల్లెలో అదే ధరకు దాదాపు 1,000 బస్తాలు తీసుకున్నట్లు రైతులు తెలిపారు.
నాణ్యమైన వడ్లకు రూ.1,888 మద్దతు ధర
- పద్మ, జిల్లా మేనేజరు, సివిల్ సప్లయ్ విభాగం, కడప
గ్రేడ్-ఏ రకం వరి క్వింటాలుకు రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868గా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. తేమ 17 శాతానికి మించకూడదు. ఎండకు బాగా ఆరబెట్టి, తాలు, మట్టి లేకుండా నాణ్యమైన వడ్లు తీసుకొస్తే మద్దతు ధర రూ.1,888 వస్తుంది. ఇప్పటివరకు 1,400 టన్నులు కొనుగోలు చేశాం.
