-
-
Home » Andhra Pradesh » Kadapa » a story on rural development
-
పురోగతి ఏది...!
ABN , First Publish Date - 2020-11-22T05:26:08+05:30 IST
మేజర్ పంచాయతీగా ఉన్న బద్వేలు మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అవుతుందంటే బద్వేలు పట్టణ రూపురేఖలు మారుతాయని ప్రజలు కలలు కన్నా రు. అస్తవ్యస్థంగా ఉండే మురికి కాలువలు, గుంతల మయమైన రోడ్లు, పేరుకుపోయిన పారిశుధ్యం పట్టణంలో ఇక కనిపించవు.

పుష్కరం... కావస్తున్నా కనిపించని ప్రగతి
అస్తవ్యస్థంగా డ్రైనేజీ, రోడ్లు
పెరిగిన పన్నుల భారం - సమస్యలు యధాతథం
ఇదీ.. బద్వేలు మున్సిపాలిటీ దుస్థితి
బద్వేలు, నవంబరు 21: మేజర్ పంచాయతీగా ఉన్న బద్వేలు మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అవుతుందంటే బద్వేలు పట్టణ రూపురేఖలు మారుతాయని ప్రజలు కలలు కన్నా రు. అస్తవ్యస్థంగా ఉండే మురికి కాలువలు, గుంతల మయమైన రోడ్లు, పేరుకుపోయిన పారిశుధ్యం పట్టణంలో ఇక కనిపించవు. పట్టణమంతా పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా ఉంటుందని ఆశించారు. పట్టణ అభివృద్ధితోపాటు తాగునీరు, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలు ఎన్నో కల్పిస్తారని సంబరపడి పన్నుల భారాన్ని సైతం పట్టించుకోలేదు. అయితే వారు ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించకపోవడంతో పట్టణ వాసులు నిరాశనిస్పృహలకు గురయ్యారు. మున్సిపాలిటీగా ఏర్పడి సరిగ్గా 12 సంవత్సరాలు అంటే పుష్కరకాలం పూర్తి అయినా ఎక్కడి సమస్యలు అక్కడే కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీగా పేరు మారిందే కానీ బద్వేలు రూపురేఖలు మాత్రం మారలేదు.
అస్తవ్యస్థంగా డ్రైనేజీ...
పంచాయతీ ఉన్నప్పటినుంచే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. చిన్నపాటి వర్షం వచ్చినా కాలువలలో ఉన్న మురికినీరు, వర్షపునీరు రహదారులపై ప్రవహిస్తుండడం తో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మునిసి పాలిటీ స్థాయి పెరిగినప్పటికీ డ్రైనేజీవ్యవస్థలో మార్పు లేదు. డ్రైనే జీ కాలువల్లో మురికి పేరుకుపోయి దోమలకు నిలయంగా మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
అధ్వానంగా రహదారులు
మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డుల్లో కొన్ని వార్డులలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సిమెంటు రోడ్లు నిర్మించక పోవడంతో చిన్నపాటి వర్షం వచ్చినా బురదమయమై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా సిద్దవటం రోడ్డు చిన్నపాటి వర్షం కురిసినా కుంటలాగా మారుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు సిద్దవటం ప్రధానరహదారిలోని రైస్‌మిల్ వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు వర్షపునీరు నిలిచి ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
పార్కుకు నోచుకోని వైనం
బద్వేలు పట్టణంలో సుమారు 80 వేల జనాభా ఉంది. సాయంత్రం వేళలో ప్రజలు సేద తీరేందుకు కనీసం పార్కు కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానిక జడీపీ పాఠశాల ఆవరణలో కొంతమంది సేద తీర్చుకుంటున్నారు. కనీసం పార్కును ఏర్పా టు చేయాలన్న ఆలోచన ప్రజాప్రతినిధులకు రాకపోడం బాధాకరమని ప్రజలు పేర్కొంటున్నారు.
ఇష్టానుసారం ఆక్రమణలు
మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ కాలువలపైన ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు నిర్మించడంతో డ్రైనేజీవ్యస్థకు అడ్డ ంకిగా మారింది. దీంతో మురికి నీరు వెళ్లే దారి లేక రోడ్లపై ప్రవహిస్తోంది. ఆక్రమణల తొలగింపుపై ప్రజాప్రతినిధు లు, అధికారులు దృష్టిసారించకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు పేర్కొంటున్నారు.
పెరిగిన పన్నుల భారం
మున్సిపాలిటీ స్థాయి మారడంతో పన్నుల భారం పెరిగిందే తప్ప సమస్యలు మాత్రం తీరలేదు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు పన్నులపై చూపే శ్రద్ధ సమస్యలపై దృష్టి సారించడం లేదు. దీంతో ప్రజలు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగిస్తున్నారు.
మున్సిపాలిటీ దుస్థితి మారెదెన్నడో....
పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా స్థాయి పెరిగిందే తప్ప ఆ మేర సౌకర్యాలు పెరగకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పన్నులు పెంచుతున్నారే తప్ప అభివృద్ధి పనులు చేపట్టడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టిసారించాలి
-కె.వేణుగోపాల్, బద్వేలు
మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల కోసం పై అధికారులకు నివేదిక పంపాం. ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం జరిగింది. కరోనా కారణంగా పనులు ఇంకా మొదలు పెట్టలేదు. నిధులు మం జూరు కాగానే మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
-కేవి.కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్
