మూన్నాళ్ల ముచ్చటే...

ABN , First Publish Date - 2020-12-05T05:30:00+05:30 IST

రైతు అంటే పాడి పంట. అదనపు ఆదాయం కోసం పాడితో పాటు కోళ్ల పెంపకాన్ని చేపడతారు. కరువు కాటకాల వల్ల పంటలు దెబ్బతిన్నా నమ్ముకున్న పాడి, కోళ్లు రైతును గట్టెక్కిస్తాయి.

మూన్నాళ్ల ముచ్చటే...
ఊటుకూరు సమీపంలో మూతబడ్డ పెరటికోళ్ల ఉత్పత్తి కేంద్రం

 రాష్ట్ట్రంలో ఏకైక పెరటి కోళ్ల ఉత్పత్తి కేంద్రం
 ప్రారంభించిన నాలుగేళ్లకే మూత

రాష్ట్రంలో ఏకైక పెరటికోళ్ల పెంపక కేంద్రం కడపలో ప్రారంభమైంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కడప నగర శివార్లలోని ఊటుకూరు వద్ద 2008 మే 22న పెరటికోళ్ల ఉత్పత్తి కేంద్రానికి శ్రీకారం చుట్టారు. 2010 నుంచి 2015 వరకు దాదాపు 70,404 కోడిపిల్లలను ఉత్పత్తి చేశారు. అనంతరం అధికారుల పర్యవేక్షణా లోపం, సిబ్బంది కొరత కారణంగా ఈ ఉత్పత్తి కేంద్రం మూతపడింది. అనంతరం దీనిని గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.


(కడప - ఆంధ్రజ్యోతి): రైతు అంటే పాడి పంట. అదనపు ఆదాయం కోసం పాడితో పాటు కోళ్ల పెంపకాన్ని చేపడతారు. కరువు కాటకాల వల్ల పంటలు దెబ్బతిన్నా నమ్ముకున్న పాడి, కోళ్లు రైతును గట్టెక్కిస్తాయి. వ్యవసాయంలో పంటలతో పాటు పాడికి, కోళ్లకు ప్రాముఖ్యత ఉంది. గతంలో అయితే ఏ ఇంట అడుగు పెట్టినా పాడి, కోళ్లు కనిపించేవి. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా పాడి, కోళ్ల, పొట్టేళ్ల పెంపకాలు అదృశ్యమయ్యాయి. వైఎస్‌ సీఎం అయిన తరువాత పల్లె ముంగిట్లో కోడికూతలు, సవ్వడులు వినిపించాలనే ఉద్దేశ్యంతో నాటుకోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా కడప నగర శివార్లలోని ఊటుకూరులో పెరటి కోళ్ల ఉత్పత్తి కేంద్రానికి శ్రీకారం చుట్టారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక పెరటి కోళ్ల ఉత్పత్తి కేంద్రం ఇదే కావడం గమనార్హం. రోజూ ఓ గుడ్డు ఆరోగ్యం వెరీగుడ్డు అనే వైద్యుల సూచనలు ఒక మేర, నాటుకోళ్ల మాంసం శ్రేయస్సు అనే వాదన పెరటికోళ్లపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికీ నాటుకోళ్లకు ఎనలేని డిమాండ్‌ ఉంది. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు కడప నగర శివార్లలోని ఊటుకూరు వద్ద 2008 మే 22న పెరటికోళ్ల ఉత్పత్తి కేంద్రానికి శ్రీకారం చుట్టారు. రూ.90 లక్షల వ్యయంతో ఏటా 2 లక్షల కోడి పిల్లల ఉత్పత్తి చేయాలన్నది ప్రధాన లక్ష్యం. 2010 డిసెంబరు 10 నుంచి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమైంది. 2015 వరకు కోడిపిల్లలను ఉత్పత్తి చేశారు. ఏటా రూ.15 లక్షలు ఖర్చు చేశారు. అయితే సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణాలోపం కారణంగా అనుకున్న లక్ష్యం నెరవేరకుండానే ప్రారంభించిన నాలుగేళ్లకే మూతబడింది. డిసెంబరు 2010 నుంచి 2015 వరకు 88,388 గుడ్ల ద్వారా 70,404 కోడిపిల్లలను ఉత్పత్తి చేశారు. 

ఉమ్మడి రాషా్ట్రనికి సరఫరా
ఇక్కడ ఉత్పత్తి అయిన కోడిపిల్లలను డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించేవారు. ఊటుకూరు వద్ద ఏర్పాటు చేసిన పెరటికోళ్ల ఉత్పత్తి కేంద్రాల నుంచి అవసరమైన కోడి పిల్లలను ఉమ్మడి రాష్ట్రంలోని పలు జిల్లాలకు సరఫరా అయ్యేవి. ఉపాధి కోసం యువకులు ఏర్పాటు చేసుకోగా కొన్ని డ్వాక్రా మహిళా సంఘాలు అదనపు ఆదాయం కోసం కోడిపిల్లలను కొనుగోలు చేశారు. కోడిపిల్ల వయసును బట్టి 30 నుంచి 60 రూపాయల వరకు విక్రయించేవారు. కొందరు వీటిని పెంచి పెద్దవి చేసిన తరువాత గుడ్లను విక్రయించగా మరికొందరు మాంసాన్ని విక్రయించేవారు. పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా నాటుకోడి మాంసం, కోడిగుడ్లకు మంచి డిమాండ్‌  ఉండేది. ఆర్థికంగా బలోపేతం అయ్యేవారు. అయితే  పర్యవేక్షణాలోపం కారణంగా ప్రారంభించిన నాలుగేళ్లకే మూతబడింది. 

కోడి పిల్లల ఉత ్పత్తి ఇలా...
ఊటుకూరు పెరటికోళ్ల ఉత్పత్తి కేంద్రం నుంచి కోడిపిల్లలు ఉత్పత్తిని పరిశీలిస్తే 2013-14లో 2948 కోడిపిల్లలు, 2014-15లో 47,093, 2015-16లో 7,549, 2016-17లో 12,814, మొత్తం 70,404 కోడిపిల్లలు ఉత్పత్తయ్యాయి.

జగన్‌పైనే ఆశలు
జిల్లా వాసి జగన్‌ సీఎం కావడంతో మూతబడ్డ పెరటి కోళ్ల ఉత్పత్తి కేంద్రం తెరుచుకుంటుందన్న ఆశలు రైతుల్లో ఉన్నాయి. దివంగత సీఎ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకైక పెరటి కోళ ్ల ఉత్పత్తి కేంద్రం కడపలో ప్రారంభించారు. ఆయన మరణానంతరం ఉత్పత్తి ప్రారంభించినా ఆయన ఆశయం నెరవేరకుండానే మూతబడింది. తండ్రి ఆశయాన్ని జగన్‌ నెరవేరుస్తారన్న నమ్మకం రైతుల్లో ఉంది. సీఎం జగన్‌ రైతు సంక్షేమమంటూ పెద్దఎత్తున ప్రకటనలు ఇస్తున్నారు. పాడి పరిశ్రమకు పెద్దపీట వేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే మూతబడ్డ పెరటి కోళ ్ల ఉత్పత్తి కూడా ప్రారంభించి రైతులకు, యువకులకు ఉపాధి లభించే కోళ్ల పెంపకాన్ని కూడా పున రుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మౌలిక వసతుల కోసం అంచనాలు రూపొందిస్తున్నాం 
- ఎల్‌వీ సత్యప్రకాశ్‌, వెటర్నరీ జేడీ
పెరటి కోళ్ల ఉత్పత్తి కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అంచనాలు రూపొందిస్తున్నాం. రోడ్లు, విద్యుత్‌ సౌకర్యం, ఉత్పత్తి కేంద్రంలో మరమ్మతులకు అవసరమైన అంచనాలు తయారు చేయాల్సిందిగా ఇంజనీరింగ్‌ శాఖను ఆదేశించాం. నివేదిక వచ్చాక నిధుల కోసం ప్రభుత్వానికి పంపిస్తాం. మౌలిక వసతుల అనంతరం తిరిగి ఉత్పత్తులు ప్రారంభిస్తాం.

Updated Date - 2020-12-05T05:30:00+05:30 IST