జలపాతంలో పడి యువకుడు మృతి
ABN , First Publish Date - 2020-12-16T05:16:48+05:30 IST
మండలంలోని సరిహద్దు ప్రాంతమైన పీపీకుంట సమీపంలో ఉన్న జలపాతంలో ఓ యువకుడు మృతి చెందాడు.
గోపవరం, డిసెంబరు 15: మండలంలోని సరిహద్దు ప్రాంతమైన పీపీకుంట సమీపంలో ఉన్న జలపాతంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి మం డలం క్రిష్ణంపల్లెకు చెందిన హసన్ కుమారుడు మస్తాన్ (15) బద్వేలులోని బంధువుల ఇంటికి వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం బంధువుల పిల్లలతో కలిసి పీపీకుంట సమీపంలో ఉన్న వాటర్‌ఫాల్స్ వద్దకెళ్లాడు. కాసేపు జలపాతంలో ఈత కొట్టి తిరుగు ప్రయాణమయ్యాడు. మస్తాన్ మళ్లీ జలపాతంలోకెళ్లి ఈత కొడుతుండగా ఒక్కసారిగా గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు వెళ్లి చూడగా మస్తాన్ కనిపించలేదు. విష యం తెల్సుకున్న ఎస్‌ఐ క్రిష్ణయ్య తమ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బందితో కలిసి జలపాతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మస్తాన్ మృతదేహాన్ని వెదికి బయటికి తీశారు. మృతుడికి చెవుడు, మూగ ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోలీసులు బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రిష్ణంపల్లెలో మస్తాన్ మృతితో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.