5185 మంది బైండోవర్‌

ABN , First Publish Date - 2020-03-13T10:47:53+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండవచ్చన్న భావన తో

5185 మంది బైండోవర్‌

ఇప్పటికే 549 కేసులు 

ఇంకా పెరిగే అవకాశం


కడప (క్రైం), మార్చి 12 : స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండవచ్చన్న భావన తో పోలీసులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బైండోవర్‌లు చేస్తున్నారు. జిల్లాలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదన్న ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే గ్రామసభలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు నిఘా ఉంచారు. రౌడీషీటర్లు, ట్రబుల్‌ మాంగర్స్‌, ఫ్యాక్షనిస్టులు, ప్రధాన అనుచరులపై బైండోవర్‌ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 549 కేసులు నమోదు చేసి 5185 మందిని బైండోవర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ బైండోవర్‌ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ ఎన్నికల నేపధ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో గ్రామస్థాయి నుంచి నగర స్థాయి వరకు అనుమానితులను గుర్తించి వారిపై బైండోవర్‌ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఘర్షణలు పడే అవకాశం ఉంటాయని ముందుగానే భావించి ఎన్నికల సమయాల్లో రాజకీయ పార్టీల మధ్య జరిగే పోటీల కారణంగా వివిధ వర్గాలకు చెందిన పలువురిని బైండోవర్‌ చేసి తహసీల్దారు ఎదుట హాజరుపరచి సొంత పూచీకత్తుపై వారిని విడుదల చే శారు.


తరువాత ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఏమైనా చర్యలకు పాల్పడితే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకునేందుకు బాండ్‌ పేపరుపై పూచీకత్తు కింద పేర్కొన్న మొత్తాన్ని వారి నుంచే వసూలు చేస్తారు. ఎన్నికలకు ముందస్తుగానే వీరి వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తే వారిని 24 గంటలు ముందుగానే పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. బైండోవర్‌ అయిన వ్యక్తి ఏదైనా ఎన్నికల సమయంలో ఘర ్షణ పడినట్లు తెలిస్తే వారు ఇచ్చిన బాండులోని నిబంధనల మేర అధికారులు చర్యలు తీసుకుంటారు. 


బైండోవర్‌ అంటే...

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో పోలీసులు ప్రతి గ్రామంలో బైండోవర్‌ కేసులు నమోదు చేస్తారు. బైండోవర్‌ చేసిన వారిని తహసీల్దారు వద్ద కానీ, ఆర్డీవో వద్ద కానీ హాజరు పరుస్తారు. బైండోవర్‌ అంటే బాండ్‌ ఫర్‌ గుడ్‌ బిహేవియర్‌  అని అర్థం. సత్ప్రవర్తన కలిగి మెలుగుతారని తెలియజేయడం ఒక వ్యక్తి వల్ల కానీ, వ్యక్తుల సమూహం వల్ల కానీ శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండవచ్చని భావిస్తే ఈ బైండోవర్‌ కేసులు నమోదు చేస్తారు. బుధ, గురువారాల్లో జిల్లావ్యాప్తంగా 190, 191 బైండోవర్‌ కేసులు నమోదు చేసి 1801 మంది వ్యక్తులను సంబంధిత తహసీల్దార్ల ఎదుట హాజరుపరిచి సొంత పూచీకత్తుతో విడుదల చేసినట్లు ఎస్‌పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 


Updated Date - 2020-03-13T10:47:53+05:30 IST