16 టీఎంసీలు నిల్వ చేయాల్సిందే

ABN , First Publish Date - 2020-09-13T08:16:36+05:30 IST

ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో గండికోట ప్రాజెక్టులో కనీసం 16 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు మీరు సహకరించాలని

16 టీఎంసీలు నిల్వ చేయాల్సిందే

  • ఫ నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
  • ఎవరి ఇళ్లను కూల్చకుండానే పరిహారాన్ని ఇస్తాం
  • నిర్వాసితులతో ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి


కొండాపురం, సెప్టెంబరు 12: ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో గండికోట ప్రాజెక్టులో కనీసం 16 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు మీరు సహకరించాలని తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితులతో శనివారం జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి తెలిపారు. వారం రోజులుగా మీరు ఆందోళన చేస్తున్నప్పటికీ కరోనా వల్ల ఎంపీ అవినాశ్‌రెడ్డి, నేను రాలేకపోయామని తెలిపారు. కొందరు తమను ఉద్దేశించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా మీకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. ఈ ఏడాది రాయలసీమ ప్రయోజనాల దృష్ట్యా కనీసం 16 టీఎంసీల నీటిని నింపకపోతే మనం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. 16 టీఎంసీల నీటిని నింపితే తాళ్లప్రొద్దుటూరులో బీసీ, ఎస్సీ కాలనీలు ముంపునకు గురవుతాయన్నారు. టీడీపీ హయాంలో పునరావాసం కోసం పూర్తి సౌకర్యాలు కల్పించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని తెలిపారు. ఈ ఏడాది గండికోట నిర్వాసితుల కోసం ప్రభుత్వం 900 కోట్ల నిధులను విడుదల చేసిందని, నిర్వాసితులకు కూడా వెంటనే త్వరితగతిన పరిహారాన్ని వారి అకౌంట్లలో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


ఇళ్లు కూల్చకుండానే తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితులకు ఈ ఏడాది పరిహారం అందజేస్తామని, అయితే ఎస్సీ, బీసీ కాలనీలు ఖాళీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి నడిరోడ్డుపైకి కట్టుబట్టలతో వెళ్లాలా, మాకు ఇళ్లు కట్టుకోవడానికి గడువు ఇవ్వండి సారూ అని తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితులు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎదుట వాపోయారు. పాడి పశువులు, పిల్లాపాపలతో ఎక్కడకు వెళ్లాలి అని ఎమ్మెల్యే వద్ద వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపుతామని, రెండు నెలలు వేరేచోట పునరావాసం కల్పిస్తామని అంతవరకు అక్కడ ఉండి సహకరించి ఇళ్లు నిర్మించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కటాఫ్‌ డేట్‌ను పెంచాలని పునరావాస ప్యాకేజీ రూ.12.50 లక్షలు ఇవ్వాలని వారు కోరగా అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.


10వ రోజు కొనసాగిన ఆందోళన

మండలంలోని తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితులు చేస్తున్న ఆందోళన శనివారం 10వ రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వచ్చి వారితో మాట్లాడినప్పటికీ తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ రాకపోవడంతో సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. వీరికి జనసేన పార్టీ నాయకుడు సుంకర శ్రీనివాస్‌, పౌరహక్కుల సంఘం నేత వెంకటేశ్వరరావు, విప్లవ రచయితల సంఘం నాయకురాలు వరలక్ష్మి, సీపీఐ ఏరియా కార్యదర్శి సుబ్బారెడ్డి, మండల కార్యదర్శి మనోహర్‌బాబు, ఏఐటీయూసీ నేత చాంద్‌బాష సంఘీభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-13T08:16:36+05:30 IST