నిప్పుల కుంపటి..!

ABN , First Publish Date - 2020-05-24T11:39:08+05:30 IST

రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి..! ఇది పల్లెల్లో నానుడి. ఆ రోహిణి కార్తె నేడు రానుంది. ఎండలు భగభగ

నిప్పుల కుంపటి..!

భగభగ మండుతున్న సూర్యుడు

43 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

మండుటెండల్లో ఉపాధి కూలీల అవస్థలు

రోడ్లపైకి రావాలంటే జనం భయం భయం

11 తరువాత బయటికి రావద్దంటున్న వైద్యులు


కడప, మే 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి..! ఇది పల్లెల్లో నానుడి. ఆ రోహిణి కార్తె నేడు రానుంది. ఎండలు భగభగ మండుతున్నాయి. సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో జనం తల్లడిల్లుతున్నారు. పల్లెల్లో ఉపాధి పనులకు వెళ్లాలన్నా.. పట్టణాల్లో రోడ్లపైకి రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి. మండుటెండల్లో బయటికి రాకపోవడమే ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. నిత్యం పనుల కోసం బయటికి వచ్చినా 11 గంటల్లోగా ఇంటికి చేరుకోవాలని చెబుతున్నారు. అలాగే.. వడదెబ్బకు గురి కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. పెరుగుతున్న ఎండలు, వైద్యుల సూచనలతో ఆంధ్రజ్యోతి కథనం.


జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పచ్చదనం అంతరిస్తుండడం.. కాంక్రీట్‌ జంగిల్‌ పెరుగుతుండడంతో ఎండ తీవ్రతకు ఉక్కబోత ఎక్కువ అవుతోంది. ఇళ్లల్లో ఉండాలంటే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల 11వ తేదీ గరిష్టంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే.. 18వ తేదీ నాటికి స్వల్పంగా తగ్గి కనిష్టంగా 28 డిగ్రీలు, గరిష్టంగా 39 డిగ్రీలు నమోదయ్యాయి. ఆ రోజు నుంచి క్రమ క్రమంగా పెరుగుతూ శనివారం జిల్లా సగటున కనిష్టంగా 30 డిగ్రీలు, గరిష్టంగా 43 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఉదయం 9గంటలకే ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఇప్పటిదాకా లాక్‌డౌన్‌లో ఇంటిలోనే ఉన్న జనం లాక్‌డౌన్‌ సడలింపుతో బయటికి వెళ్లి ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు ఎండలకు పడుతున్న ఇబ్బందులు ఎన్నో. 


ఎండలో తస్మాత్‌ జాగ్రత్త...

ఎండలో ఎక్కువగా తిరిగితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.

మధుమేహంతో బాధపడుతున్న రోగులు ఎండలోకి వెళితే మరింత ఇబ్బంది పడతారు.

చర్మ సంబంధిత జబ్బులు తలెత్తుతాయి. 

డీ హైడ్రేషన్‌ వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. మూత్రం తగ్గి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


ఈ జాగ్రత్తలు పాటిద్దాం....

అత్యవసర పనులుంటే బయటికి వెళ్లి ఉదయం 11గంటల్లోగా ఇల్లు చేరుకోవాలి.

పిల్లలు, వృద్ధులను అత్యవసరం అయితే తప్ప బయటికి పంపకూడదు.

శరీరాన్ని పూర్తిగా కప్పే నూలు (కాటన్‌) దుస్తులు ధరించాలి.

రోజుకు 3 నుంచి 5 లీటర్ల నీటిని తీసుకోవాలి.

ఓఆర్‌ఎస్‌ ద్రావణం తరచుగా తీసుకోవడం ఉత్తమం.

ఓఆర్‌ఎస్‌ ద్రావణం లేకపోతే లీటరు నీటిలో 2 టీస్పూన్‌లు ఉప్పు, నాలుగు టీ స్పూన్‌లు చక్కెర వేసి కలిపి అప్పుడప్పుడూ తాగుతుండాలి. నిమ్మరసం చేసుకుంటే మంచిది.

పలుచటి మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగుతుండాలి.

శీతల పానీయాలకు (కూల్‌డ్రింక్స్‌) స్వస్తి చెప్పడం ఆరోగ్యానికి మంచిది.

ఫ్రిడ్జ్‌లలో నీళ్లు కాకుండా మట్టికుండల్లో నీళ్లు తాగడం మంచిదని వైద్యుల సూచన.

కారం, మసాలాల ఆహారానికి దూరంగా ఉండడం మంచిది.

మధుమేహంతో బాధపడే వ్యక్తులు ఉదయం అల్పాహారం తరువాత ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అప్పుడప్పుడూ ఆహారం తీసుకోవాలి. రాగిజావ, బార్లీగింజలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.


జాగ్రత్తలే ఆరోగ్యానికి రక్ష : డాక ్టర్‌ గురవయ్య, రిమ్స్‌, కడప 

ఎండలు తీవ్రమవుతున్నాయి. విచ్చలవిడిగా బయట తిరగడం ఆరోగ్యానికి మంచిది కాదు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి రక్ష. వీలైనంత వరకు ఇంటి పట్టున ఉండడం మంచిది. పనుల కోసం బయటికి వెళితే 11 - 12 గంటల్లోపు ఇంటికి రావాలి. సాయంత్రం 5 గంటల తరువాత బయటికి వెళ్లాలి. తరచుగా నీటిని, ద్రవ ఆహారాన్ని తీసుకోవాలి. డీ హైడ్రేషన్‌కు లోనైతే శరీరం చల్లబడే విధంగా తడి బట్టతో తుడవాలి. తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. పలుచటి మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ద్రావణం తరచుగా తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ద్రావణం అందుబాటులో లేనప్పుడు ఉప్పు, చక్కెర, నిమ్మరసం కలిపిన నీటిని తరచుగా సేవించాలి.


11వ తేదీ నుంచి నమోదైన ఉష్ణోగ్రత సెంటిగ్రేడ్‌ డిగ్రీలలో..

తేది గరిష్టం కనిష్టం

11 43 27

12 41 27

13 41 25

15 42 26

16 41 27

17 40 27

18 39 28

19 38 29

20 39 27

21 42 27

22 43 30

23 43 29


శనివారం ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు

పట్టణం గరిష్టం కనిష్టం

కడప 43 29

రాజంపేట 43 28

రైల్వేకోడూరు 41 27

పులివెందుల 42 29

రాయచోటి 41 27

ప్రొద్దుటూరు 43 30

బద్వేలు 43 28

మైదుకూరు 43 21

కమలాపురం 43 30

జమ్మలమడుగు 43 30


Updated Date - 2020-05-24T11:39:08+05:30 IST