జిల్లా వ్యాప్తంగా పోలీసులతో వైసీపీ ఒప్పందం

ABN , First Publish Date - 2020-03-15T09:48:52+05:30 IST

అధికార పార్టీనేతల ఆదేశాలకు అనుగుణంగా కొందరు పోలీసులు వైసీపీ రంగు

జిల్లా వ్యాప్తంగా పోలీసులతో వైసీపీ ఒప్పందం

గుంటూరు, మార్చి 14 : అధికార పార్టీనేతల ఆదేశాలకు అనుగుణంగా కొందరు పోలీసులు వైసీపీ రంగు పులుముకున్నారు....! ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థులను నయానో... భయానో లొంగదీసుకునేందుకు అన్ని రకాలైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, రేపల్లె నియోజకవర్గాల్లో పోలీసులు నేరుగా రంగంలోకి దిగి టీడీపీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, బాపట్ల, తెనాలి నియోజకవర్గాల్లో పోలీసులు పరోక్షంగా ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. 

పోలీసుల బెదిరింపులే ఎక్కువ..

ఓ వైపు అధికార పార్టీ నాయకులు నేరుగా టీడీపీ నేతలకు ఫోన్‌ చేసి నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారు. వారి మాట వినని వారిపై పోలీసులను ప్రయోగిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా పోలీసులు టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. దీంతో అనేక మంది పోటీకి వెనుకంజ వేయడంతో ఆయా స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. తమకు అధికార వైసీపీ బెదిరింపుల కంటే పోలీసుల బెదిరింపులే ఎక్కువగా ఉన్నాయని పలువురు టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

చిలకలూరిపేటలో..

తాజాగా రేపల్లె, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ఏకంగా పోలీసులు ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను కేసుల పేరుతో బెదిరించడం జిల్లావ్యాప్తంగా పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణ, ఎస్‌ఐ షఫీలు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించే యత్నం చేయడం కలకలం రేగింది.


నాదెండ్ల మండలంలో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకోకపోవడంతో ఏకంగా ఆయన కుమారుడు కారులో మద్యం బాటిళ్ళు నింపి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్ళి వేదించినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై వారు పోలీసు అధికారులతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాక అక్రమంగా మద్యానికి పట్టుబడినట్లు జడ్పీటీసీపై కూడా తప్పుడు కేసు బనాయించారు. స్థానిక ప్రజా ప్రతినిధి భర్త ఒత్తిడి మేరకే పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


ఇటీవల శివరాత్రి పర్వదినం సందర్భంగా వైసీపీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘటనలోను సంబంధం లేని నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా టీడీపీ అభ్యర్ధి కుమారుడి కారులో మద్యం బాటిళ్ళు పెట్టి తప్పుడుకేసులు బనాయించడం కలకలం రేపుతోంది.

రేపల్లె నియోజకవర్గంలో..

రేపల్లె నియోజకవర్గ పరిధిలోని నగరం మండలంలోను పోలీసులు కేసులు పెడితే టీడీపీ అభ్యర్ధులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరించడం కలకలం రేగింది. ఇటీవల నగరం మండల పరిధిలోని ఈదురపల్లిలో ఎంపీపీ అభ్యర్థి ఆళ్ళ పూర్ణ, ఆళ్ళ చౌదరిపై తప్పుడు కేసులు బనాయించి అదుపులోకి తీసుకుని నామినేషన్‌ వేయకుండా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో పోటీకి దూరం కావాల్సి వచ్చింది. తాజాగా ధూళిపూడిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్ధి ఆరుమళ్ళ మల్లేశ్వరిని పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి బెదిరించేందుకు యత్నించారు.


ఆమెపై గతంలో ఎటువంటి కేసులు లేవు. అయినప్పటికీ ఆమెను పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ పోలీసులు బెదిరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే సంబంధిత డీఎస్పీ, సీఐలకు చెప్పినా ఫలితం లేదు. ఉదయాన్నే ఆమె ఇంటికి చేరిన పోలీసులు స్టేషన్‌కు రావాలని తెలిపారు. దీంతో నేరుగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అక్కడకు చేరుకోవడంతో పోలీసులు జారుకున్నారు. ఆమెను స్టేషన్‌కు ఎందుకు పిలిపిస్తున్నారని ప్రశ్నించగా బైండోవర్‌ చేయడానికి పిలిచినట్లు చెప్పడం గమనార్హం. ఆమెపై ఎటువంటి కేసులు లేకపోయినప్పటికీ బైండోవర్‌ పేరుతో ఏకంగా పోటీలో ఉన్న మహిళను బెదిరింపులకు దిగడం జిల్లాలో పోలీసులు వైఖరికి అద్దం పడుతోంది. అదే విధంగా పెద్దవరం ఎంపీటీసీ అభ్యర్ధి గోవతోటి భాస్కరరావు, డమ్మీ అభ్యర్ధి శ్రీకాంత్‌లను బరి నుంచి తప్పుకోవాలంటూ పోలీసులు బెదిరించారు. పాత కేసులు ఉన్నాయని, ఇబ్బందులు పడతావంటూ బెదిరించి చివరకు కొంత మొత్తం డబ్బులు పెట్టి పోలీసులే బరి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. 

నాదెండ్ల మండలంలో..

 అదే విధంగా నాదెండ్ల మండలంతో పాటు ముప్పాళ్ళ పరిధిలోని చాగంటివారిపాలెం మరికొన్ని గ్రామాల్లోను ఇదే తరహాలో టీడీపీ అభ్యర్థులకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నరసరావుపేట పరిధిలోని రొంపిచర్ల మండలంలోను పోలీసుల బెదిరింపు వలన పలువురు అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకున్నారు. అలాగే వినుకొండ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులకు వైసీపీ నాయకులు, ఓ ప్రజాప్రతినిధి నుంచే కాక పోలీసుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనమర్లపూడిలో ఓ అభ్యర్ధికి వినుకొండకు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌ చేసి పరోక్షంగా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇవేకాక జిల్లాలోని అనేక మండలాల్లోను పోలీసులు టీడీపీ నాయకులను బరి నుంచి తప్పుకోవాలని బెదిరిస్తున్నారు. మాదల తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలను బలవంతంగా నామినేషన్‌లు ఉప సంహరించుకొనేలా చేశారు. 

మాచర్లలో మరీ దారుణం..

మాచర్ల నియోజకవర్గ పరిధిలో పోలీసులు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోటీ నుంచి తప్పుకోకుంటే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేరుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తమకు పోలీస్‌ ఉన్నతాధికారులపై తమకు నమ్మకం లేదని, ఇటువంటివి తానెప్పుడూ చూడలేదని సీనియర్‌ టీడీపీ నాయకులు సైతం వాపోతున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఆయా ఎన్నికలను రద్దు చేయాలని వారు కోరుతున్నారు. 

=

Updated Date - 2020-03-15T09:48:52+05:30 IST